Drone Spotted Uddhav Residence: ఉద్ధవ్ ఠాక్రే నివాసం వద్ద డ్రోన్... భద్రతపై ఆందోళనలు
ABN , Publish Date - Nov 09 , 2025 | 05:04 PM
ఎంఎంఆర్‌డీఏ వివరణపై ఆదిత్య ఠాక్రే మండిపడ్డారు. ఇళ్ల లోపల ఏరియల్ గూఢచర్యం జరపమని ఏ సర్వే చెప్పిందని నిలదీశారు. ముందుగా ఆయా ప్రాంతాల్లోని నివాసం ఉంటున్న వారికి సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదా అని అధికారులను ప్రశ్నించారు.
ముంబై: శివసేన (UBT) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే నివాసం 'మాతోశ్రీ'కి సమీపంలో ఆదివారంనాడు ఒక డ్రోన్ ఎగురుతూ కనిపించింది. ఈ విషయాన్ని వెంటనే అక్కడి భద్రతా సిబ్బంది ఠాక్రేకు తెలియజేశారు. ఈ ఘటనపై ఉద్ధవ్ శివసేన వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఠాక్రేపై నిఘాకు ఈ డ్రోన్‌ను ఉపయోగించి ఉంటారని అనుమానం వ్యక్తమవుతుండగా, పోలీసులకు ఫిర్యాదు చేసే ఆలోచనలో ఆ పార్టీ ఉంది.
ముంబై పోలీసుల వివరణ
కాగా, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డవలప్‌మెంట్ అథారిటీ (ఎంఎంఆర్‌డీఏ) అనుమతితోనే బీకేసీ, ఖేర్వాడి ప్రాంతాల్లో డ్రోన్ ఆపరేషన్‌ను నిర్వహిస్తున్నట్టు ముంబై పోలీసులు తెలిపారు. అధీకృత సర్వే ప్రయోజనాల కోసమే డ్రోన్స్ వాడుతున్నట్టు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దని ప్రజలను కోరారు.
ఏ సర్వే చెప్పింది?: ఆదిత్య
ఎంఎంఆర్‌డీఏ వివరణపై ఆదిత్య ఠాక్రే మండిపడ్డారు. ఇళ్ల లోపల ఏరియల్ గూఢచర్యం జరపమని ఏ సర్వే చెప్పిందని నిలదీశారు. ముందుగా ఆయా ప్రాంతాల్లోని నివాసం ఉంటున్న వారికి సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదా అని అధికారులను ప్రశ్నించారు. ఎంఎంఆర్‌డీఏ ప్రత్యేకించి తమ నివాసాన్నే మానిటర్ చేసిందా, కేబీసీ ఏరియా మొత్తాన్ని మానిటర్ చేసిందా అని నిలదీసారు. ఏరియల్ సర్వేలకు బదులు అసంపూర్తిగా ఉన్న, అవినీతి మచ్చపడిన ఎంటీహెచ్ఎల్ (అటల్ సేతు) వంటి ప్రాజెక్టులపై ఎంఎంఆర్‌డీఏ దృష్టి సారిస్తే బాగుంటుందని అన్నారు. పౌరుల ప్రైవసీ, భద్రతపై విషయంలో జవాబుదారీతనం ఉండాలని, దీనిపై ముంబై పోలీసులు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా, గతంలోనూ మాతోశ్రీ సమీపంలో డ్రోన్ కనిపించడంతో ఠాక్రే నివాసం వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
కర్ణాటకలో నాయకత్వ పోరుపై బీజేపీ పేరడీ వీడియో
హిందూ ధర్మం కూడా ఎక్కడా నమోదు చేసుకోలేదు.. ఆర్ఎస్ఎస్ చట్టబద్ధతపై మోహన్ భాగవత్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి