Share News

Breakfast Meeting 2.0: సిద్ధరామయ్యను బ్రేక్‌ఫాస్ట్‌కు ఆహ్వానించిన డీకే

ABN , Publish Date - Dec 01 , 2025 | 05:57 PM

సిద్ధరామయ్య, డీకే మధ్య అధికార పంపణీ విషయంలో విభేదాలు తలెత్తడంతో కాంగ్రెస్ అధిష్ఠానం ఇటీవల ఇద్దరు నేతలకు కొన్ని సూచనలు చేసింది. ముందుగా ఇరువురు నేతలు కలిసి చర్చించుకోవాలని, ఐక్యతా సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించింది.

Breakfast Meeting 2.0: సిద్ధరామయ్యను బ్రేక్‌ఫాస్ట్‌కు ఆహ్వానించిన డీకే
Siddaramaiah with DK Shivakumr

బెంగళూరు: కర్ణాటకలో నాయకత్వ మార్పు వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్ఠానం ఇచ్చిన సూచనలకు అనుగుణంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇటీవల తన నివాసంలో బ్రేక్‌ఫాస్ట్‌కు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌‌ను ఆహ్వానించారు. తాజాగా డీకే శివకుమార్ మంగళవారంనాడు తన ఇంట్లో ఇచ్చే అల్పాహారం కోసం రావాల్సిందిగా సిద్ధరామయ్యను ఆహ్వానించారు. ఈ విషయాన్ని డీకే కార్యాలయం సోమవారంనాడు ధ్రువీకరించింది.


సిద్ధరామయ్య, డీకే మధ్య అధికార పంపణీ విషయంలో విభేదాలు తలెత్తడంతో కాంగ్రెస్ అధిష్ఠానం ఇటీవల ఇద్దరు నేతలకు కొన్ని సూచనలు చేసింది. ముందుగా ఇరువురు నేతలు కలిసి చర్చించుకోవాలని, ఐక్యతా సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించింది. పార్లమెంటు సమావేశాలు ఉన్నందున దానిపైనే ప్రధానంగా దృష్టి సారించాల్సి ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ...ఇరువురు నేతలను వేచిచూడాలనే సందేశాన్ని పంపినట్టు సమాచారం. ఈ క్రమంలో తొలుత సిద్ధరామయ్య తన నివాసంలో ఇచ్చిన బ్రేక్‌ఫాస్ట్‌కు డీకే హాజరయ్యారు.


కాగా, డీకే బ్రేక్‌ఫాస్ట్‌ ఇచ్చే అవకాశంపై సిద్ధరామ్యయను మీడియా ప్రశ్నించినప్పుడు, తనను కలిసినప్పుడు మంగళవారంనాడు ఇంటికి రావాలని మాత్రమే డీకే చెప్పి వెళ్లిపోయారని ఆయన తెలిపారు. అయితే ఇప్పటి వరకూ ఎలాంటి పిలుపు రాలేదని, పిలిస్తే తప్పనిసరిగా వెళ్తానని సమాధానమిచ్చారు. ఈ నేపథ్యంలో మంగళవారంనాడు బ్రేక్‌ఫాస్ట్‌కు రావాల్సిందిగా సిద్ధరామయ్యను డీకే ఆహ్వానించినట్టు ఆయన కార్యాలయ వర్గాలు సోమవారం వెల్లడించాయి.


ఇవి కూడా చదవండి..

పార్లమెంటరీ మర్యాదలను 11 ఏళ్లుగా తుంగలో తొక్కారు.. మోదీ వ్యాఖ్యలపై ఖర్గే

శునకంతో పార్లమెంటుకు.. వివాదంలో రేణుకా చౌదరి

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 01 , 2025 | 06:01 PM