Heavy Rains: ‘దిత్వా’ ఎఫెక్ట్.. రెండు రోజుల భారీ వర్షసూచన
ABN , Publish Date - Nov 29 , 2025 | 11:14 AM
రాష్ట్రంలో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఆగ్నేయ శ్రీలంక తీరం దిశగా నెలకొన్న వాయుగుండం ‘దిత్వా’ తుపానుగా మారి నగరానికి చేరువగా తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రెండు రోజులు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
- నేడు 6 జిల్లాలకు రెడ్ అలర్ట్
- అప్రమత్తంగా ఉండండి ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం ఆదేశం
చెన్నై: నైరుతి బంగాళాఖాతంలో ఆగ్నేయ శ్రీలంక తీరం దిశగా నెలకొన్న వాయుగుండం ‘దిత్వా’ తుపానుగా మారి నగరానికి చేరువగా తీరం దాటే అవకాశం ఉందని స్థానిక వాతావరణ కేంద్రం అధికారులు అంచనావేశారు. ఈ తుఫాను కారణంగా తిరువారూరు, నాగపట్టినం, మైలాడుదురై, కడలూరు(Kadaluru), విల్లుపురం, చెంగల్పట్టు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు తెలిపారు. ఈ ఆరు జిల్లాల్లో శనివారం భారీ వర్షం కురుస్తుందన్నారు. శుక్రవారం రాత్రి ఆ తుఫాను నగరానికి 370 కి.మీల దూరంలో ఉందని, ఆదివారం వేకువజాము దక్షిణాంధ్ర, ఉత్తర తమిళనాడు మధ్య తీరం దాటుతుందని పేర్కొన్నారు. ఈ తుఫాను ప్రభావం కారణంగా రెడ్ అలర్ట్ జారీ అయిన తంజావూరు, తిరువారూరు, పుదుకోట, రామనాధపురం జిల్లాల్లో శుక్రవారం భారీగా వర్షం కురిసింది. శనివారం డెల్టా జిల్లాలైన తంజావూరు, తిరువారు, పుదుకోట జిల్లాలతోపాటు రామనాఽథపురం, తూత్తుకుడి, విరుదునగర్, మదురై జిల్లాల్లోనూ చెదురుమదురుగా వర్షం కురుస్తుందని వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు చెబుతున్నారు.
చెన్నై, కాంచీపురం జిల్లాల్లో...
చెన్నై, కాంచీపురం సహా 9 జిల్లాల్లో శనివారం ఓ మోస్తరు నుండి భారీగా వర్షం కురుస్తుందని అధికారులు పేర్కొన్నారు. తంజావూరు, అరియలూరు, పెరంబలూరు, తిరువణ్ణామలై, వేలూ రు, రాణిపేట జిల్లాల్లో పలు ప్రాంతాల్లో కుండ పోతగా వర్షాలు కురిసే అవకాశముందన్నారు. ఈ నెల 30న తిరువళ్లూరు, చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, రాణిపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు తెలిపారు. నగరంలో శుక్రవారం ఉదయం నుండే ఆకాశం మేఘావృతమైంది. కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. చలిగాలులు కూడా ఎక్కువయ్యాయి.
బోసిపోయిన రామేశ్వరం...
మూడు రోజులుగా కురిసిన వర్షం కారణంగా సుప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం రామేశ్వరం భక్తులు లేక బోసిపోయింది. ఇదే విధంగా రామేశ్వరం చుట్టూ ఉన్న ధనుష్కోడి తదితర ప్రాంతాలకు కూడా పర్యాటకుల సందడి తగ్గింది. ధనుష్కోడి, అరిచ్చల్‌మునై సముద్రతీర ప్రాంతాల్లో గంటలకు 65 నుండి 70 కి.మీ.ల వేగంతో పెనుగాలులు వీయడంతో ఆ ప్రాంతాల్లో పర్యాటకుల సంచారంపై అధికారులు నిషేధం విధించారు. కాగా శుక్రవారం రామేశ్వరంలో సముద్రం అల్లకల్లోలంగా కనిపించింది. దీంతో తీరప్రాంత ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.

డెల్టా జిల్లాలకు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు...
దిత్వా తుఫాను హెచ్చరిక నేపథ్యంలో, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో చేపట్టనున్న సహాయక చర్యల్లో ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ బృందాలు పాల్గొననున్నాయి. రాష్ట్రప్రభుత్వ సూచనల మేరకు అరక్కోణం నుం డి శుక్రవారం మధ్యాహ్నం తంజావూరు, నాగపట్నం, మైలాడుదురై, పుదుకోట, కడలూరు, తిరువారూర్ అనే ఆరు డెల్టా జిల్లాలకు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు వెళ్లాయి.
సహాయ చర్యలను ప్రారంభించండి: స్టాలిన్
‘దిత్వా’ ప్రభావం కారణంగా భారీగా వర్షం కురిసే అవకాశమున్న జిల్లాల్లో కలెక్టర్లు ముందస్తు సహాయ చర్యలను ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.. ఇదే విధంగా ఆయా జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌లుగా ఉన్న రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు వర్ష బాధితులను ఆదుకునేందుకు సిద్ధంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాలవారిని ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న సురక్షిత శిబిరాలకు తరలించాలని విజ్ఞప్తి చేశారు. తూత్తుకుడి, తిరువళ్లూరు, మైలాడుదురై, పుదుకోట, నాగపట్టినం, తిరువారూరు, కాంచీపుం సహా 14 జిల్లాలకు చెందిన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సహాయక చర్యలను తెలుసుకున్నారు.
నేడు స్కూళ్లు, కళాశాలలకు సెలవు
‘దిత్వా’ ప్రభావంతో భారీగా వర్షం కురవనుండటంతో శనివారం పుదుచ్చేరి, కారైక్కల్ సహా ఏడు జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. రాష్ట్రంలో సెలవు ప్రకటించిన జిల్లాల వివరాలు... కడలూరు, కళ్లకురిచ్చి, తిరువారూరు, నాగై, మైలదుత్తురై ఉన్నాయి. కాగా పుదుచ్చేరిలో శనివారం అన్ని విమాన సేవలను రద్దు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest Telangana News and National News