Fadnavis offer Thackeray: మాతో చేతులు కలపండి.. థాకరేకు ఫడ్నవిస్ ఆఫర్
ABN , Publish Date - Jul 16 , 2025 | 09:27 PM
ఫడ్నవిస్ ఆఫర్ ఇచ్చిన కొద్దిసేపటికి ఫడ్నవిస్, థాకరే నవ్వుతూ కరచాలనం చేసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. అయితే అది శాసనమండలి సమావేశం కావడానికి ముందు ఈ ఇద్దరు నేతలు కలుసుకున్న ఫోటో కావడం విశేషం.

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ బుధవారంనాడు శాసన మండలి సమావేశంలో మాజీ సీఎం, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray)కు ఆసక్తికరమైన ఆఫర్ ఇచ్చారు. అధికార పక్షంలో చేరాల్సిందిగా నవ్వుతూ ఆహ్వానించారు. దీంతో సభలో ఒక్కసారిగా నవ్వులు వెల్లివిరిసాయి. సభలోనే ఉన్న ఉద్ధవ్ థాకరే మాత్రం ఎలాంటి ప్రత్యుత్తరం ఇవ్వలేదు.
థాకరే వర్గం శివసేన నేత, శాసన మండలిలో విపక్ష నేతగా ఉన్న అంబదాస్ దాన్వే 'ఫేర్‌వెల్ సెర్మనీ' సందర్భంగా సభలో ఫడ్నవిస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ఉద్ధవ్ జీ.. మేము 2029 వరకూ అక్కడికి (విపక్షం) వెళ్లే అవకాశం లేదు. మీరు ఇక్కడికి రావాలనుంటే పరిశీలించగలం. అది మీపై ఆధారపడి ఉంది' అని అన్నారు. అంబదాస్ దాన్వేను ప్రశంసిస్తూ, అధికార పక్షంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా ఆయన ఆలోచనలన్నీ హిందుత్వం చుట్టూనే తిరుగుతుంటాయని సీఎం పేర్కొన్నారు.
తేలిగ్గానే తీసుకోవాలి..
ఎన్డీయేతో చేతులు కలపమంటూ ఫడ్నవిస్ ఇచ్చిన ఆఫర్‌పై థాకరేను అడిగినప్పుడు ఆయన తేలికగా కొట్టిపారేశారు. 'వాటిని పట్టించుకోనక్కరలేదు. ఒక్కోసారి ఏవేవో జరుగుతుంటాయి. వాటిని తేలికగానే తీసుకోవాలి' అని సమాధానమిచ్చారు. ఆసక్తికరంగా ఫడ్నవిస్ ఆఫర్ ఇచ్చిన కొద్దిసేపటికి ఫడ్నవిస్, థాకరే నవ్వుతూ కరచాలనం చేసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. అయితే అది శాసనమండలి సమావేశం కావడానికి ముందు ఈ ఇద్దరు నేతలు కలుసుకున్న ఫోటో కావడం విశేషం.
ఇవి కూడా చదవండి..
నాకు చెప్పకుండానే గోవా వదిలి వెళ్లింది... రష్యా మహిళ భర్త వెల్లడి
నిన్నటి ఆయుధాలతో నేడు యుద్ధంలో గెలువలేము
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి