Share News

Delhi Election Results: బీజేపీ క్లీన్ స్వీప్.. 48 స్థానాలతో విజయకేతనం

ABN , Publish Date - Feb 08 , 2025 | 05:21 PM

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. 70 అసెంబ్లీ స్థానాల్లో అధికారానికి అవసరమైన మెజారిటీ మార్క్ 36 స్థానాలను సునాయాసంగా దాటేసి 48 స్థానాలను సాధించింది. 22 స్థానాలతో ఆమ్ ఆద్మీ పార్టీ రెండో స్థానంలో నిలిచింది.

Delhi Election Results: బీజేపీ క్లీన్ స్వీప్.. 48 స్థానాలతో విజయకేతనం

న్యూఢిల్లీ: హోరాహోరీగా సాగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో (Delhi Assembly Elecitons) బీజేపీ (BJP) ఘనవిజయం సాధించింది. 70 అసెంబ్లీ స్థానాల్లో అధికారానికి అవసరమైన మెజారిటీ మార్క్ 36 స్థానాలను సునాయాసంగా దాటేసి 48 స్థానాలను గెలుచుకుంది. 22 స్థానాలతో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) రెండో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ (Congress) పార్టీ వరుసగా మూడోసారి కూడా ఒక్కసీటు కూడా గెలుచు కోకుండా హ్యాట్రిక్ 'జోరో'లతో చతికిలపడింది. బీజేపీ ఘనవిజయంతో 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికార పగ్గాలు చేపట్టబోతోంది.

Delhi Election Results: సీఎం రేసులో పర్వేష్ వర్మ


సామాన్యుడినంటూ రాజకీయాల్లోకి వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ 2015, 2026లో భారీ అధిక్యతతో అధికారం కొనసాగించగా, ఈసారి ముందస్తు ఎన్నికల ప్రచారం, అభ్యర్థుల జాబితాల విడుదల, మరిన్ని ఉచిత హామీ పథకాలు ప్రకటించినప్పటికీ బీజేపీ వ్యూహాత్మక ప్రచారంతో కోలుకోలేని దెబ్బకొట్టింది. 2025లో టార్గెట్ ఫిక్స్ చేసుకుని మరీ మోదీ, అమిత్‌షా టీమ్ అనుకున్న లక్ష్యం సాధించింది. ఢిల్లీ ఎన్నికలకు ముందే బడ్జెట్‌ను (ఫిబ్రవరి 1)న బడ్జెట్ ప్రవేశపెట్టడం, మధ్యతరగతి వర్గానికి ఊరట కలిగించడం సహా అందుబాటులో ఉన్న అవకాశాలన్నింటినీ బీజేపీ ఉపయోగించుకుంది. దేశంలోనే కేజ్రీవాల్ అంత అవినీతిపరుడు, అబద్ధాలకోరును చూడలేదంటూ లిక్కర్ స్కామ్, శీష్ మహల్ వివాదాన్ని సమర్ధవంతంగా ప్రచారం చేసింది. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటికీ ఢిల్లీలో అమల్లో ఉన్న పథకాలను కొనసాగిస్తామని భరోసా ఇచ్చింది. యమునా జలాల్లో బీజేపీ విషం కలిగిందంటూ కేజ్రీవాల్ చివరి నిమిషంలో చేసిన ఆరోపణలను సైతం అంతే ధీటుగా తిప్పికొట్టింది. అవినీతికి చరమగీతం పాడతామని, అభివృద్ధికి పట్టం కడతామని ప్రజలను భరోసా ఇవ్వగలిగింది. బీజేపీ 'వికసిత్ ఢిల్లీ సంకల్ప్ పత్ర' మేనిఫెస్టో మంత్రం ఢిల్లీ ఓటర్లపై పనిచేయగా, అవినీతి మరకలు, కుంభకోణాలు ఆప్ పార్టీ పాలిట శాపంగా మారాయి. ఎగ్జిట్ పోల్స్‌లో చెప్పినట్టుగానే భారతీయ జనతా పార్టీకి ఢిల్లీ ప్రజలు పట్టంకట్టారు.


టాప్-3 ఔట్

అసెంబ్లీ ఎన్నికల్లో వెలివడిన ఫలితాలు ఆప్‌ను ఘోరంగా దెబ్బతీశాయి. టాప్-3లో ఉన్న అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్ ఓటమి చవిచూశారు. కేజ్రీవాల్ న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో 3 వేల పైచిలుకు ఓట్లతో బీజేపీ అభ్యర్థి పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ చేతిలో ఓడిపోయారు. మనీష్ సిసోడియా జంగ్‌పురలో బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ చేతిలో 600 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. షాకుర్ బస్తీలో బీజేపీ అభ్యర్థి కర్నాల్ సింగ్ చేతిలో 19,000 కు పైగా ఓట్ల తేడాతో సత్యేందర్ జైన్ ఓడిపోయారు. ఢిల్లీ సీఎం అతిషి మాత్రం తన సమీప బీజేపీ అభ్యర్థి రమష్ బిధూరిపై 3,521 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.


అభివృద్ధి గెలిచింది.. ప్రధాని మోదీ

బీజేపీ గెలుపుపై ప్రధాన మంత్రి నరేంద్రం మోదీ ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల శక్తి అత్యున్నతమని, అభివృద్ధి, సుపరిపాలన గెలిచాయని అభివర్ణించారు. చారిత్రక విజయం అందించిన సోదరసోదరీమణులందరికీ అభినందనలు తెలిపారు. పార్టీని ఆశీర్వదించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు చెప్పారు. ఢిల్లీ అభివృద్ధి, జీవన ప్రమాణాల పెరుగుదలకు కట్టుబడి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. రేయింబవళ్లు గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలను చూసి గర్విస్తున్నానని ట్వీట్ చేశారు.


ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం: కేజ్రీవాల్

ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని ఎన్నికల్లో ఓటమి తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. గెలిచిన బీజేపీకి అభినందనలు తెలిపారు. పదేళ్ల పాటు ఢిల్లీ అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి పాటుపడ్డామని, ఇక ప్రతిపక్షంగా నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామని చెప్పారు. ఎన్నికల్లో పోరాడిన ఆప్ నేతలు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.


ఇవి కూడా చదవండి

Delhi Election Results: ఆ మంత్రం భలే పని చేసింది.. బీజేపీ గెలుపులో సగం మార్కులు దానికేనా..

Delhi Election Result: కాంగ్రెస్‌కు మళ్లీ ``హ్యాండ్`` ఇచ్చిన ఢిల్లీ.. మరోసారి సున్నాకే పరిమితం..

Priyanka Gandhi: విసిగిపోయిన ఢిల్లీ ప్రజలు మార్పు కోసం ఓటేశారు: ప్రియాంక గాంధీ

For More National News and Telugu News..

Updated Date - Feb 08 , 2025 | 05:26 PM