Retirement Age Row: మోదీ రిటైర్మెంట్ గురించే ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలంటూ కాంగ్రెస్ పోస్టు
ABN , Publish Date - Jul 11 , 2025 | 03:53 PM
మోదీ గత మార్చిలో నాగపూర్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. దీంతో మోదీ రిటైర్మెంట్ అంశం చర్చించేందుకు వెళ్లారంటూ వార్తలు వచ్చాయి. అయితే మోదీ రిటైర్మెంట్ ఊహాగానాలను 2023లోనే కేంద్రం హోం మంత్రి అమిత్‌షా తోసిపుచ్చారు.

న్యూఢిల్లీ: రాజకీయ నేతలు ఎవరైనా సరే 75 ఏళ్లు రాగానే రిటైర్మెంట్ తీసుకోవాలంటూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భాగవత్ (Mohan Bhagwat) చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. దీనిపై కాంగ్రెస్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించే మోహన్ భాగవత్ ఈ వ్యాఖ్యలు చేశారని విమర్శలు గుప్పించింది.
మోహన్ భాగవత్ గత బుధవారంనాడు నాగపూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. '75 ఏళ్లు వచ్చాయంటే దాని అర్థం మీరు తప్పుకుని ఇతరులకు అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది' అని అన్నారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త మోరోపంత్ పింగ్లే సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసేవారని గుర్తుచేశారు. '75 ఏళ్ల శాలువా మన మీద కప్పారంటే నిర్దిష్ట వయసుకు మనం చేరుకున్నామని అర్థం. మనం హుందాగా పక్కకు తప్పుకుని వేరే వాళ్లకు పనిచేసే అవకాశం ఇవ్వాలి' అని పింగ్లే చెప్పేవారని అన్నారు.
మోదీ, మోహన్ భాగవత్ 1950 సెప్టెంబర్‌లో జన్మించారు. భాగవత్ 11న, మోదీ 17న పుట్టారు. రిటైర్మెంట్ వయసుపై భాగవత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ సోషల్ మీడియా 'ఎక్స్'లో స్పందించారు. 'పలు అవార్డులు తీసుకుని విదేశాల నుంచి తిరిగి వస్తున్న మోదీకి లభించిన స్వాగతం చూడండి. ఈ ఏడాది సెప్టెంబర్ 17 నాటికి 75 ఏళ్లు పూర్తవుతాయని మోదీకి ఆర్ఎస్ఎస్ చీఫ్ గుర్తు చేశారు. భాగవత్‌కు కూడా సెప్టెంబర్ 11వ తేదీకి 75 ఏళ్లు పూర్తవుతాయని మోదీ గుర్తుచేయాలి' అని ఆయన ట్వీట్ చేశారు. ఇటు మోదీ, అటు భాగవత్ ఇద్దరూ బ్యాగులు సద్దుకుని ఆఫీసు వదిలిపెట్టాలంటూ కాంగ్రెస్ మరో నేత పవన్ ఖేర అన్నారు. కాగా, శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ, 75 ఏళ్లు రాగానే గతంలో పలువురు సీనియర్ నేతలకు ఉద్వాసన చెప్పిన నిబంధననే మోదీ తనకు కూడా వర్తింపజేసుకోవాలని అన్నారు. ఎల్.కె.అడ్వాణి, మురళీ మనోహర్ జోషి, జస్వంత్ సింగ్ వంటి నాయకులను 75 ఏళ్లు వచ్చాయంటూ బలవంతంగా మోదీ రిటైర్ చేయించారని, అదే నిబంధన ఇప్పుడు ఆయన కూడా పాటిస్తారా అనేది చూడాలని అన్నారు.
మోదీ గత మార్చిలో నాగపూర్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. దీంతో మోదీ రిటైర్మెంట్ అంశం చర్చించేందుకు వెళ్లారంటూ వార్తలు వచ్చాయి. అయితే మోదీ రిటైర్మెంట్ ఊహాగానాలను 2023లోనే కేంద్రం హోం మంత్రి అమిత్‌షా తోసిపుచ్చారు. 2029 వరకూ మోదీనే నాయకత్వం వహిస్తారని చెప్పారు. బీజేపీ రాజ్యాంగంలో అసలు రిటైర్మెంట్ అనేది లేదని చెప్పారు.
భారత్‌కు నష్టం కలిగిందని ఒక్క ఫోటో చూపించండి.. అజిత్ డోభాల్ సవాల్
ఇందులో ఏం డౌట్ లేదు.. ఐదేళ్ళు నేనే సీఎం..
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి