SIR: ఓటర్ల జాబితాలో అవకతవకలపై సవాలు చేయండి.. రాష్ట్రాల నేతలకు కాంగ్రెస్ దిశానిర్దేశం
ABN , Publish Date - Nov 18 , 2025 | 08:46 PM
బిహార్ తరహాలో కాకుండా ఈసారి ముసాయిదా జాబితాలో ఎలాంటి అవకతవకలు కనిపించినా లీగల్ టీమ్‌ల సాయంతో అభ్యంతరాలు తెలియజేయాలని, ఫైనల్ లిస్ట్ తర్వాత కూడా అప్పీల్స్ చేయాలని కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకులు సూచించారు.
న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతున్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటర్ల ముసాయిదా జాబితాలో ఎలాంటి అవకతవకలు జరిగినా దానిని వెంటనే పార్టీ నేతలు సవాలు చేయాలని కాంగ్రెస్ కోరింది. మంగళవారంనాడిక్కడ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సమావేశంలో 12 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల పార్టీ నేతలు, వర్కింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) కేసీ వేణుగోపాల్ పాల్గొన్నారు. ఎస్ఐఆర్, ఓట్ చోరీకి వ్యతిరేకంగా ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో డిసెంబర్ ప్రథమార్ధంలో ర్యాలీ నిర్వహించాలని కూడా కాంగ్రెస్ నిర్ణయించింది.
కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం, ఎస్ఐఆర్ పూర్తి భిన్నమైన స్వభావం కలిగి ఉందని, గతంలో ఈ ప్రక్రియ చేపట్టినప్పుడు తీసుకున్న సమయంతో పోల్చుకుంటే చాలా తక్కువ వ్యవధిలో పూర్తిచేయాలనే ఆరాటమే కనిపిస్తోందని మెజారిటీ నేతలు సమావేశంలో అభిప్రాయపడ్డారు. తగినంత మంది బూత్ స్థాయి ఏజెంట్లను ఏర్పాటు చేసి వారికి శిక్షణ ఇచ్చినట్టు రాష్ట్రాల నేతలు పార్టీ అధిష్ఠానానికి వివరించారు. దీనిపై కేంద్ర నాయకులు స్పందిస్తూ, ముసాయిదా జాబితా నుంచి ఉద్దేశపూర్వకంగా ఎవరినైనా తొలగించినా, బోగస్ ఓటర్లను చేర్చినా వెంటనే అభ్యంతరాలు లేవనెత్తాలని పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసింది. బిహార్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యంతరాలను నమోదు చేయకపోవడం వల్లే ఓటర్ల జాబితా సరిగానే ఉందని, పార్టీలు ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదని ఎన్నికల కమిషన్ ప్రకటించుకున్నట్టు పేర్కొంది.
బిహార్ తరహాలో కాకుండా ఈసారి ముసాయిదా జాబితాలో ఎలాంటి అవకతవకలు కనిపించినా లీగల్ టీమ్‌ల సాయంతో అభ్యంతరాలు తెలియజేయాలని, ఫైనల్ లిస్ట్ తర్వాత కూడా అప్పీల్స్ చేయాలని పార్టీ కేంద్ర నాయకులు సూచనలు చేశారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఎస్ఐఆర్ ఎక్సర్‌సైజ్‌పై మానిటర్ చేసే మెకానిజం ఉన్నా చిన్న పార్టీలకు ఆ అవకాశం లేకపోవడాన్ని ప్రశ్నించారు. ఏ ఒక్కరు ఓటు కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత ఈసీపై ఉందని, దాన్ని పార్టీల మీద నెట్టేయకూడదని అన్నారు.
బీజేపీ షాడోలో ఈసీ పనిచేయరాదని, ఓట్ల చోరీకి ఎస్ఐఆర్ ప్రక్రియను ఆయుధంగా చేసుకోరాదని ఖర్గే అన్నారు. ఈ విషయంలో పార్టీ కార్యకర్తలు, బీఎల్ఏలు, జిల్లా, సిటీ, బ్లాక్ అధ్యక్షులు అప్రమత్తంగా ఉండాలని, నిజమైన ఓటర్లను తొలగించడం, బోగస్ ఓట్లను చేర్చేందుకు చేసే ఎలాంటి ప్రయత్నం జరిగినా వెంటనే బయటపెట్టాలని సూచించారు.
ఇవి కూడా చదవండి..
మోదీ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉంది.. మళ్లీ శిశథరూర్ ప్రశంసలు
ఓటమికి బాధ్యత నాదే, పొరపాట్లు సరిచేసుకుంటాం
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.