Share News

Congress: కాంగ్రెస్‌కు షాక్.. రూ.199 కోట్ల విరాళాలపై పన్ను మినహాయింపునకు ట్రిబ్యునల్ నిరాకరణ

ABN , Publish Date - Jul 22 , 2025 | 08:52 PM

ఆలస్యంగా పన్ను రిటర్న్ దాఖలు చేయడం వల్ల రాజకీయ పార్టీలకు పన్ను మినహాయింపు ఇచ్చే సెక్షన్ 13ఏకు అర్హత కోల్పోయిందని ద్విస్వభ ఐటీఏటీ బెంచ్ తమ ఆదేశాల్లో పేర్కొంది. సెక్షన్ 139(1)కింద ఆర్థిక సంవత్సరంలో రిటర్న్‌ల దాఖలు 2018 డిసెంబర్ 31వ తేదీ వరకూ గడువు పొడిగించినా 2019 ఫిబ్రవరి 2న పార్టీ రిటర్న్‌లు దాఖలు చేసినట్టు బెంచ్ పేర్కొంది.

Congress: కాంగ్రెస్‌కు షాక్.. రూ.199 కోట్ల విరాళాలపై పన్ను మినహాయింపునకు ట్రిబ్యునల్ నిరాకరణ
Congress

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి ఆదాయం పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్ (ITAT)లో చుక్కెదురైంది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి రూ.199.15 కోట్ల విరాళాలపై పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన అప్పీల్‌ను ఐటీఏటీ తోసిపుచ్చింది. ఆదాయపు పన్ను చట్టం కింద పన్ను మినహాయింపు క్లెయిమ్‌ కోసం పార్టీ ఆలస్యంగా రిటర్నులు దాఖలు చేసిందని, కీలకమైన లీగల్ షరతులను పాటించడంలో విఫలమైందని ఐటీఏటీ పేర్కొంది. చట్ట ప్రకారం మొత్తం ఆదాయానికి పన్ను చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.


ఆలస్యంగా పన్ను రిటర్న్ దాఖలు చేయడం వల్ల రాజకీయ పార్టీలకు పన్ను మినహాయింపు ఇచ్చే సెక్షన్ 13ఏకు అర్హత కోల్పోయిందని ద్విస్వభ ఐటీఏటీ బెంచ్ తమ ఆదేశాల్లో పేర్కొంది. సెక్షన్ 139(1)కింద ఆర్థిక సంవత్సరంలో రిటర్న్‌ల దాఖలు 2018 డిసెంబర్ 31వ తేదీ వరకూ గడువు పొడిగించినా 2019 ఫిబ్రవరి 2న పార్టీ రిటర్న్‌లు దాఖలు చేసినట్టు బెంచ్ పేర్కొంది. రూ.199 కోట్లు విరాళంగా వచ్చాయని చూపుతూ పన్ను మినహాయింపు కోరినట్టు తెలిపింది.


ఛారిటబుల్ ట్రస్టులకు రిటర్న్‌ల సమర్పణలో జాప్యం అయినా అనుమతించాలనే సెక్షన్ 12ఏను రాజకీయ పార్టీలకు కూడా వర్తింపజేయాలని కాంగ్రెస్ చేసిన వాదనను ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. సెక్షన్ 13ఏ ప్రకారం టైమ్‌లైన్‌ను కఠినంగా అమలు చేయాల్సి ఉంటుందని తెలిపింది.


కాగా, కాంగ్రెస్ ఆలస్యంగా రిటర్న్‌లు దాఖలు చేయడంతోపాటు దాతల నుంచి ఎక్కువ మొత్తంలో విరాళాలు స్వీకరించినట్టు ఐటీ అధికారులు కనుగొన్నారు. నిబంధనల ప్రకారం ఒక్కొక్కరి నుంచి గరిష్టంగా రూ.2,000 వరకూ మాత్రమే విరాళాలు స్వీకరించాల్సి ఉండగా, రూ.14.49 లక్షలను నగదు రూపంలో తీసుకున్నట్టు గుర్తించారు. కాంగ్రెస్ పన్ను మినహాయింపు విజ్ఞప్తిని ఐటీ శాఖ అధికారుల తోసిపుచ్చడమే కాకుండా మొత్తానికి పన్ను చెల్లించాలని నోటీసులు పంపారు. ఈ నిర్ణయాన్ని కమిషనర్ ఆఫ్ ఇన్‌కమ్ టాక్స్ సమర్ధించగా, దీన్ని సవాలు చేస్తూ ఇన్‌కమ్ టాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు కాంగ్రెస్ వెళ్లింది. అయితే తాజాగా అక్కడ కూడా కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్‌ పార్టీకి తాత్కాలిక ఉపశమనం కల్పించేందుకు ఐటీఏటీ నిరాకరించింది. దీంతో మొత్తం రూ.199 కోట్ల విరాళాలకు కాంగ్రెస్ పార్టీ ఆదాయం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.


ఇవి కూడా చదవండి..

51 లక్షల ఓటర్ల పేర్లు తొలగింపు

నన్ను మీరు కొడితే.. గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 22 , 2025 | 08:56 PM