Share News

Maharashtra: నన్ను మీరు కొడితే.. గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , Publish Date - Jul 22 , 2025 | 05:59 PM

భాషపై హింసాత్మక ఘటనల వల్ల రాష్ట్రంలో పెట్టుబడులకు విఘాతం కలుగుతుందని, ఇది దీర్ఘకాలంలో మహారాష్ట్రకు నష్టం కలిగిస్తుందని మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ చెప్పారు. ప్రతి ఒక్కరి మాతృభాషను మనం గౌరవించాల్సి ఉంటుందని చెప్పారు.

Maharashtra: నన్ను మీరు కొడితే.. గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు
CP Radhakrishnan

ముంబై: మరాఠీలో మాట్లాడేందుకు నిరాకరించారనే కారణంగా మహారాష్ట్రలో జరుగుతున్న దాడులపై ఆ రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) సూటిగా స్పందించారు. భాషపై హింసాత్మక ఘటనల వల్ల రాష్ట్రంలో పెట్టుబడులకు విఘాతం కలుగుతుందని, ఇది దీర్ఘకాలంలో మహారాష్ట్రకు నష్టం కలిగిస్తుందని చెప్పారు. ప్రతి ఒక్కరి మాతృభాషను మనం గౌరవించాల్సి ఉంటుందని చెప్పారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు తమిళనాడులో తాను చూసిన ఒక ఘటనను ఈ సందర్భంగా ఆయన సామాజిక మాధ్యమం 'ఎక్స్‌'లో షేర్ చేశారు.


తమిళనాడులో ఉన్నప్పుడు..

'తమిళనాడు ఎంపీగా నేను ఉన్నప్పుడు ఒకరోజు హైవే మీదుగా వెళ్తున్నాను. కొందరు వ్యక్తులను అక్కడి వాళ్లు కొడుతుండటం నా కంటపడింది. డ్రైవర్‌ను వెంటనే కారు ఆపమని కిందకు దిగారు. దాడికి పాల్పడిన వారు నన్ను చూసి పారిపోయారు. దెబ్బలు తిన్నవారు మాత్రం అక్కడే ఉన్నారు. ఏమి జరిగిందని అడిగాను. వాళ్లు హిందీలో మాట్లాడారు. నాకు మాత్రం మార్..మార్.. అనే మాట మాత్రమే ఆర్ధమైంది. అక్కడి హోటల్ యజమానిని పిలిచి అడగాను. వాళ్లకు తమిళం రాదని, తమిళంలో మాట్లాడమంటూ వాళ్లపై దాడి ప్రయత్నం జరిగిందని ఆయన నాతో చెప్పాడు' అని రాధాకృష్ణన్ వివరించారు. 'మీరు నన్ను కొట్టినంత మాత్రాన అప్పటికప్పుడు మరాఠీ మాట్లాడగలనా? అది అసాధ్యం. తమిళనాడు ఘటనలో గాయపడిన వారికి ఏదైనా తినమని చెప్పి, వారు లారీలో కూర్చున్న తర్వాతే అక్కడి నుంచి ముందుకు కదిలాను' అని రాధాకృష్ణన్ వివరించారు.


తమిళనాడు ఘటనను షేర్ చేయడంపై అడిగినప్పుడు ఆయన మాట్లాడుతూ, ఇలాంటి విద్వేష ఘటనల వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రారని, అందువల్ల దీర్ఘకాలంలో రాష్ట్రానికి నష్టం జరుగుతుందని చెప్పారు. పెట్టుబడిదారులు కానీ, పరిశ్రమలు కానీ రానప్పుడు మహారాష్ట్రకు మనం హాని చేసినట్టే అవుతుందన్నారు.


హీందీ మాట్లాడటం రాదు..

తనకు హిందీ అర్ధం చేసుకోవడం, మాట్లాడటం రాధని రాధాకృష్ణన్ చెప్పారు. అది తనకు ఒక అడ్డంకేనని ఆయన అంగీకరించారు. మనం వీలున్నన్ని భాషలు నేర్చుకోవాలని, మాతృభాషను చూసి గర్వించాలని, ఆ విషయంలో రాజీ పడాల్సిన అవసరం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. మరాఠీలో మాట్లాడని పలువురిపై ఉద్ధవ్ థాకరే శివసేన కార్యకర్తలు, ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్‌థాకరే అనుచరులు ఇటీవల దాడులు జరిపిన ఘటనలు వెలుగుచూసిన నేపథ్యంలో గవర్నర్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.


ఇవి కూడా చదవండి..

ధన్‌ఖఢ్ రాజీనామా వెనుక నితీష్‌ను తప్పించే కుట్ర.. ఆర్జేడీ ఆరోపణ

వాళ్లెవరు, వాళ్ల హోదా ఏమిటి.. నిలదీసిన శశిథరూర్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 22 , 2025 | 06:03 PM