CM Stalin: సీఎం స్టాలిన్ సంచలన కామెంట్స్.. ఈపీఎస్ రైతు కాదు... ద్రోహి
ABN , Publish Date - Nov 27 , 2025 | 11:19 AM
ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీసీఎం ఎడప్పాడి పళనిస్వామి రైతు కాదు... ద్రోహి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా పెను దుమారాన్ని రేపాయి. మరొకొద్ది రోజుల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ ఆరోపణలు, విమర్శల పర్వం కొనసాగుతోంది.
- ఈరోడ్ సభలో స్టాలిన్ ధ్వజం
చెన్నై: తానొక రైతునంటూ గొప్పలు చెప్పుకునే ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) వాస్తవానికి రైతు కానేకాదని, సాగుపనులకు వెళ్లకుండా ఆయన చేస్తున్నదంతా ద్రోహమేనని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) మండిపడ్డారు. రైతు నాయకుడిలా మెడలో ఆకుపచ్చ తువ్వాలు ధరించి ఈపీఎస్ చేస్తున్నదంతా ద్రోహమేనన్నారు. ఈ రోడ్‌లో బుధవారం ఉదయం రూ.4.90 కోట్లతో ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర సమరయోధుడు పొల్లాన్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి, స్మారక మండపాన్ని ప్రారంభించారు. రూ.605.44 కోట్లతో పూర్తయిన పథకాలను ప్రారంభించి, రూ.91.09 కోట్లతో చేపట్టనున్న 23 కొత్త పథకాలకు శంకుస్థాపన చేశారు.
వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల కింద 1,84,491 మంది లబ్ధిదారులకు సహాయాలను అందజేశారు. ఈ సందర్భంగా సభలో స్టాలిన్ మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతాంగానికి ఆయన చేసిందేమీ లేదని ధాన్యం తేమ శాతాన్ని పెంచేందుకు అంగీకరించని కేంద్రంలోని బీజేపీ పాలకులతో ఈపీఎస్ చర్చలు జరిపి ధాన్యంలో తేమ శాతాన్ని పెంచమని అడగొచ్చు కదా అని ప్రశ్నించారు. డీఎంకే ద్రావిడ తరహా పాలనలో ప్రజా సంక్షేమం కోసం ప్రతిరోజూ పథకాలను అమలు చేస్తుండటాన్ని చూసి ప్రతిపక్షపార్టీలు ఓర్వలేక తమపై పసలేని విమర్శలు చేస్తున్నాయని ఆరోపించారు.
ఈరోడ్‌కు వరాల జల్లు....
ఈరోడ్ జిల్లాలో అమలు చేయనున్న ఆరు పథకాలను సభలో స్టాలిన్ ప్రకటన చేశారు. ఆ మేరకు పుంజయ్ పుళియంపట్టి మునిసిపాలిటీకి రూ.4.30 కోట్లతో, గోపిశెట్టిపాళయం మునిసిపాలిటీకి రూ.4.50 కోట్లతో కొత్త కార్యాలయ భవనాలను నిర్మించనున్నామని, భవానీసాగర్, కీళ్‌భవానీ నీటి సాగు భూముల దిగువ సత్యమంగళం, నంబియూరు, భవానీ తదితర ప్రాంతాలకు చెందిన రైతులకిచ్చిన తాత్కాలిక భూ పట్టాలను శాశ్వత పట్టాలుగా మార్చుతున్నామని సభికుల హర్షధ్వానాల నడుమ ప్రకటించారు.

అందియూరు సమీపంలో తోనిమడువపల్లం (వాగుపై) వద్ద రూ.4 కోట్లతో చెక్‌డ్యామ్ నిర్మిస్తామని, అద్దకపు పరిశ్రమల వ్యర్థాల కారణంగా కాలుష్యమవుతున్న నొయ్యల్‌వాగు ఆయకట్టు రైతులకు నష్టపరిహారం చెల్లించే విషయంలో పెండింగ్‌లో ఉన్న పలు కేసుల పరిష్కారానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేఎన్ నెహ్రూ, ఈవీ వేలు, ఎస్. ముత్తుసామి, ఎంపీ సామినాధన్, డాక్టర్ ఎం. మదివేందన్, ఎన్ కయల్‌విళి సెల్వరాజ్, ఎంపీలు అందియూరు సెల్వరాజ్, కేఈ ప్రకాష్, కె.సుబ్బరాయన్, ఎమ్మెల్యేలు వీసీ చంద్రకుమార్, ఏజీ వెంకటాచలం, ఈరోడ్ జిల్లా కలెక్టర్ ఎస్. కందసామి, ఈరోడ్ మేయర్ నాగరత్నం తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రాణాలకు తెగించి నాగుపాముకు వైద్యం.. 2 గంటల పాటు..
మీకు తెలుసా.. రైలులో చేసే ఈ తప్పు వల్ల జైలు పాలవ్వడం ఖాయం..
Read Latest Telangana News and National News