Share News

Heavy Rains: ఇంకా.. జలదిగ్బంధంలో శివారు ప్రాంతాలు

ABN , Publish Date - Dec 04 , 2025 | 12:24 PM

చెన్నై శివారు ప్రాంతాలన్నీ.. ఇంకా.. జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ‘దిత్వా’ తుఫాను వల్ల రాజధాని చెన్నైతోపాటు శివారు ప్రాంతాలన్నీ తడిసి ముద్దయిపోయాయి. తుపాన్ వల్ల జనజీవనం ఎక్కడికక్కడే స్థంభించిపోయింది. ప్రజానీకం ఇళ్లనుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది.

Heavy Rains: ఇంకా.. జలదిగ్బంధంలో శివారు ప్రాంతాలు

- ఇళ్ళకే పరిమితమైన నగర వాసులు

- సబ్‌ వేలో రాకపోకల పునరుద్ధరణ

- బలహీనపడిన వాయుగుండం

- ఏడు జిల్లాలకు వర్ష సూచన

- ఎన్నూరులో 15 సెంమీ వర్షపాతం

చెన్నై: ‘దిత్వా’ తుఫాను కారణంగా గత మూడు రోజులుగా కురిసిన భారీ వర్షం కారణంగా చెన్నైతో పాటు శివారు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరింది. కుమరన్‌ నగర్‌లో 15 గృహాల్లోకి వర్షపునీరు చేరింది. నగరంలోని 22 సబ్‌వేల్లో నీరు నిల్వ లేకుండా జీసీసీ ముందస్తు చర్యలు చేపట్టింది. వాయుగుండం బలహీనపడినప్పటికీ ఏడు జిల్లాలకు మాత్రం వర్ష సూచన ఉందని వాతావారణశాఖ హెచ్చరించింది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా అనేక ప్రాంతాలు నీటిలో చిక్కుకున్నాయి. కాగా గురువారం చెన్నై , తిరువళ్లూరు జిల్లాల్లో పాఠశాలలకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు.


nani1,3.jpg

మూడు రోజులుగా గృహాలకే పరిమితం

రాజధాని వాసులు మూడు రోజులుగా ఇళ్లకే పరిమితమయ్యారు. దిత్వా తుఫాన్‌ కారణంగా ఈ నెల ఒకటో తేదీ నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో మంగళ, బుధవారాల్లో విద్యాసంస్థల కు సెలవు ప్రకటించారు. రహదారుల్లో వాహనాల రద్దీ తక్కువగా కనిపించింది. ఒక వైపు వర్షం, మరోవైపు చలి పెరడగంతో నగర వాసులు ఇంటికే పరిమితమయ్యారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉండే జాలర్లు కూడా గత 8 రోజులుగా చేపల వేటకు దూరంగా ఉన్నారు.


సబ్‌వేలలో వాహనాల రాకపోకలు యధాతథం

చెన్నై నగరంలో మొత్తం 22 సబ్‌వే (అండర్‌పాస్)లున్నాయి. భారీ వర్షం కురిస్తే ఈ సబ్‌ వేలలోకి వర్షపునీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. అయితే, ఈ సారి ఆ పరిస్థితి రాకుం డా, కార్పొరేషన్‌, అగ్నిమాపకదళం, ట్రాఫిక్‌ పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఒక్క సబ్‌వేలో కూడా నీరు చేరకుండా మోటర్లతో నీటిని ఎప్పటికప్పుడు పంపింగ్‌ చేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలగలదేఉ.


nani1.3.jpg

జోరుగా వర్షపునీరు పంపింగ్‌

ఉత్తర చెన్నైలో లోతట్టు ప్రాంతాల్లో నిలిచిపోయిన వర్షపునీరు పంపింగ్‌ జోరుగా చేస్తున్నారు. ముఖ్యంగా వ్యాసార్‌పాడి, పులియంతోపు, ఎంకేబీ నగర్‌, ముల్లై నగర్‌, రాయపురం, కొరుకుపేట, తండయారుపేట, వాషర్‌మెన్‌పేట, ఎంకేబీ నగర్‌, కొడుంగయూరు తదితర ప్రాంతాల్లో కార్పొరేషన్‌ సిబ్బంది రేయింబవళ్ళు శ్రమిస్తూ వర్షపునీటిని పంపింగ్‌ చేస్తున్నారు.


nani1,2.jpg

ఒట్టేరిలో కూలిన ఇల్లు

ఓట్టేరి ప్రాంతంలోని స్టార్‌ హార్న్స్‌ సాలైలో రెండంతస్తుల భవనం మంగళవారం రాత్రి కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. వీరిని కీల్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే కూలిపోయిన భవనం 80 యేళ్ళనాటిదిగా స్థానికులు చెబుతున్నారు. ఈ భవన కూలిపోయిన విషయాన్ని తెలుసుకున్న కార్పొరేషన్‌ అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అలాగే, భవనానికి చెందిన ముగ్గురు యజమానులను విచారిస్తున్నారు.. ఈ నేపథ్యంలో ఈ భవనం కూలిన ప్రాంతంలో ఉన్న ఇతర భవనాలకు బుధవారం కార్పొరేషన్‌ అధికారులు దృఢత్వ పరీక్షలు చేశారు.


బలహీనపడినా తప్పని వర్షాలు..

మరోవైపు బంగాళాఖాతంలో కేంద్రీకృతమైవున్న తుఫాన్‌ క్రమంగా బలహీపడుతోంది. అయినప్పటికీ ఏడు జిల్లాలకు వాతావరణ శాఖ వర్ష హెచ్చరిక చేసింది. చెన్నై, కాంచీపురం, తిరువళ్ళూరు, చెంగల్పట్టు, రాణిపేట, నీలగిరి, కోవై జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుందని తెలిపింది. కడలూరు, విల్లుపురం, తిరువణ్ణామలై, తిరుపత్తూరు, కళ్లకుర్చి, వేలూరు, ధర్మపురి, సేలం, కన్నియాకుమారి, తెన్‌కాశి, విరుదునగర్‌, మదురై, నెల్లై, తూత్తుకుడి జిల్లాలకు వర్ష సూచన చేసింది.


ఎన్నూరులో 15 సెంమీ వర్షపాతం

గడిచిన 24 గంటల్లో గరిష్టంగా ఎన్నూరు, చెంగల్పట్టు జిల్లాలోని హిందుస్థాన్‌ విశ్వవిద్యాలయం ప్రాంతాల్లో 15 సెం.మీ వర్షపాతం నమోదైంది. తిరువణ్ణామలై జిల్లా సేతుపట్టిలో 13 సెం.మీ, తిరుమయం, వింకో నగర్‌, తిరువళ్ళూరు తామరైపాక్కంలో 12 సెం.మీ, మనలి పుదునగర్‌, తిరుక్కళుగుండ్రం, మేడవాక్కం, తిరువారూర్‌, ఇళుంబూరులో 11 సెం.మీ, పళ్ళికరణి, మహాబలిపురం, వడకుత్తు, కేలంబాక్కం, రెడ్‌హిల్స్‌, ఉళుందూరుపేటలో 10 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైంది.


ఈ వార్తలు కూడా చదవండి..

మరింత పెరిగిన పుత్తడి ధరలు.. రికార్డు స్థాయికి వెండి

8 నెలలు.. 20వేల కోట్లు

Read Latest Telangana News and National News

Updated Date - Dec 04 , 2025 | 12:24 PM