BJP: టీవీకే నుంచి వచ్చే వార్త కోసం వేచిఉన్నాం..
ABN , Publish Date - Jul 05 , 2025 | 11:35 AM
వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోగా ఎన్‌డీఏలో చేరిక గురించి టీవీకే నుంచి వచ్చే వార్త కోసం వేచిఉన్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్(BJP state president Nainar Nagendran) పేర్కొన్నారు.

- నయినార్ నాగేంద్రన్ నర్మగర్భ వ్యాఖ్యలు
చెన్నై: వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోగా ఎన్‌డీఏలో చేరిక గురించి టీవీకే నుంచి వచ్చే వార్త కోసం వేచిఉన్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్(BJP state president Nainar Nagendran) పేర్కొన్నారు. శుక్రవారం మొగప్పేర్ వెస్ట్‌లోని ఓ దుకాణాన్ని ప్రారంభించిన అనంతరం నాగేంద్రన్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, హోంశాఖ నిర్వర్తిస్తున్న ముఖ్యమంత్రి స్టాలిన్ ఆధీనంలో పోలీసుశాఖ లేదని, సచివాలయంలోని కొందరు ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారమే పోలీసులు నడచుకుంటున్నారని ఆరోపించారు.
శివగంగ జిల్లా తిరుభువనం వద్ద ఆలయ వాచ్‌మన్‌ను చిత్రహింసలకు గురిచేసి ప్రత్యేక దళం పోలీసులు హతమార్చారన్నారు. లాకప్ డెత్‌కు కారకురాలైన నిఖిత సచివాలయంలోని ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడినట్టు చెబుతున్నారని, ఆమె ఆదేశాల మేరకు లాక్‌పడెత్ జరినట్లు నిర్ధారణ అవుతోందని ఆరోపించారు. 2011లో నిఖిత పెళ్ళిపేరుతో మోసాలకు పాల్పడినట్లు ఆమెపై పాత కేసులున్నాయని, రాష్ట్రంలో తీవ్ర ప్రకంపనలు సృష్టించిన లాకప్‌డెత్‌కు ముఖ్యమంత్రి స్టాలిన్ మృతుడి తల్లికి సారీ చెప్పి చేతులు దులుపుకున్నారని విమర్శించారు.
ఐదేళ్ల క్రితం సాత్తాన్‌కుళంలో తండ్రీకొడుకులు లాకప్ డెత్ ఘటనలో సీబీఐ విచారణ జరిపినా ఇంకా దోషులకు శిక్షపడలేదని, అన్నా వర్సిటీలో విద్యార్థినిపై జరిగిన అత్యాచారం కేసులో ఐదు నెలల్లోనే దోషికి శిక్షపడిందని, అదే వేగంతో లాక్‌పడెత్ సంఘటనలపై విచారణ జరిపి దోషులను శిక్షించడానికి ముఖ్యమంత్రి ఎందుకు తటపటాయిస్తున్నారో తమకు అర్థం కావటంలేదన్నారు. పాట్టాలి మక్కల్ కట్చిలో ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షోభానికి బీజేపీ ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.
ఈ నెల 7న మేట్టుపాళయంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి ఎన్నికల ప్రచార యాత్ర ప్రారంభోత్సవంలో తాను పాల్గొంటానని చెప్పారు. ఎన్డీయేలో టీవీకే చేరుతుందా అని విలేఖరులు అడిగిన ప్రశ్న కు నయినార్ నాగేంద్రన్ బదులిస్తూ ఎన్నికలకు ఇంకా సమయం ఉందని, అంతా మంచే జరుగుతుందని, అంతవరకూ వేచిచూడాలని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి.
విశాఖ వందేభారత్‌కు ఇకపై 20 బోగీలు
నిరుద్యోగుల కష్టాలు కనబడట్లేదా...
Read Latest Telangana News and National News