BJP Mission Bengal: బీజేపీ మిషన్ బెంగాల్ ప్లాన్.. టార్గెట్ 160 ప్లస్
ABN , Publish Date - Nov 24 , 2025 | 08:16 PM
ఈసారి ఫిరాయింపుదారులను పార్టీలోకి చేర్చుకునే ఆలోచన బీజేపీకి అంతగా లేదని అంటున్నారు. బెంగాల్‌లో తమ పార్టీ ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగిందని బీజేపీ భావిస్తుండటమే ఇందుకు కారణం.
న్యూఢిల్లీ: మొన్న న్యూఢిల్లీ, నిన్న బిహార్‌లో వరుస ఘన విజయాలను సాధించిన భారతీయ జనతా పార్టీ (BJP) ఇప్పుడు పశ్చిమబెంగాల్‌పై దృష్టి సారిస్తోంది. 'మిషన్ బెంగాల్'కు సమగ్ర వ్యూహం రూపొందిస్తోంది. 160 ప్లస్ సీట్లు లక్ష్యంగా బెంగాల్ కంచుకోటను సొంతం చేసుకోవడమే ఈ ప్లాన్ లక్ష్యం. ఇందుకోసం సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం, ఆనువంశ రాజకీయాలు, క్షీణిస్తున్న శాంతి భద్రతలను ఎండగట్టడం ద్వారా సీట్లు, ఓట్ షేర్ పెంచుకునేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టు పార్టీ విశ్వసనీయ వర్గాల సమాచారం.

వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్‌లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. ఈసారి ఎన్నికల్లో మమతాబెనర్జీ కంటే ఆమె రాజకీయ వారసుడిగా భావిస్తున్న అభిషేక్ బెనర్జీపై ప్రధానంగా బీజేపీ దృష్టి సారించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆనువంశిక రాజకీయాలను టార్గెట్ చేసుకోనుంది. అభిషేక్ పట్ల పెద్దగా విధేయత లేని కార్యకర్తలను తమ వైపు ఆకట్టుకోవడం ద్వారా టీఎంసీకి ఉన్న ప్రధాన ఓటర్ బేస్‌ను దెబ్బతీయవచ్చని భావిస్తోంది. పార్టీ ఫిరాయింపుదారుల కంటే కార్యకర్తలపైనే ప్రధానంగా దృష్టి సారించాలనుకుంటోంది. 2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కీలక తృణమూల్ నేతలను ఆకర్షించేందుకు కమలనాథులు ప్రయత్నాలు సాగించారు. టీఎంసీలో అభిషేక్ బెనర్జీకి పెరుగుతున్న ఆధిపత్యంపై అసంతృప్తితో ఉన్న కీలక టీఎంసీ నేత, మమతా బెనర్జీకి కుడిభుజమైన సువేందు అధికారిని విజయవంతంగా పార్టీలోకి రప్పించింది. అయితే ఈసారి ఫిరాయింపుదారులను పార్టీలోకి చేర్చుకునే ఆలోచన బీజేపీకి అంతగా లేదని అంటున్నారు. బెంగాల్‌లో తమ పార్టీ ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగిందని బీజేపీ భావిస్తుండటమే ఇందుకు కారణం. అందువల్ల పార్టీ సీనియర్ నేతలు మాత్రమే నాయకత్వం వహించేలా ప్రచారం సాగించి, ఐక్యతా సందేశం పంపాలని పార్టీ యోచనగా ఉంది. సమష్టి నాయకత్వం, మోదీ పనితీరుపై ఆధారపడి ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోంది.

బెంగాల్ ఎన్నికలకు ఈసారి విభిన్న ఫార్ములాతో వెళ్లాలని బీజేపీ భావిస్తోంది. కుల రాజకీయాల ప్రభావం బెంగాల్‌పై పెద్దగా ప్రభావం ఉండదని, ఆ కారణంగా ప్రాంతీయ, మతపరమైన ఈక్వేషన్లను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్లాలనుకుంటోంది. బెంగాల్ జనాభాలో సుమారు 30 శాతం ముస్లింలు ఉన్నారు. అయితే 30-40 సీట్లలోనే ముస్లింలు గణనీయంగా ఉన్నారు. ఇక్కడి నుంచే తృణమూల్‌కు పెద్ద సంఖ్యలో ఓట్లు పడుతున్నాయి. అయితే ఈ ప్రభావం ఓవరాల్ గెలుపు సీట్లపై పెద్దగా ఉండదని బీజేపీ యోచనగా ఉంది. ఇందుకు ప్రత్యామ్నాయంగా ఇతర ప్రాంతాల్లో పోలరైజేషన్‌తో హిందూ ఓటర్లను తమవైపు తిప్పుకోవచ్చని అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది. ముస్లింలను సంతృప్తి పరచడం వంటి ఆరోపణలతో టీఎంసీని ఇరుకున పెట్టాలని వ్యూహరచన చేస్తోంది.
నెంబర్ గేమ్
గత నాలుగు ఎన్నికల్లో (2 రాష్ట్ర ఎన్నికలు, రెండు జాతీయస్థాయి ఎన్నికలు) బీజేపీ 100కు పైగా సీట్లు సాధించుకుందని ఆ పార్టీ చెబుతోంది. తద్వారా రాష్ట్రంలో పార్టీ బలంగా వేళ్లూనుకుందని, పార్టీని మరింత పటిష్టం చేయడం ద్వారా బెంగాల్‌పై పట్టు సాధించడం, 160 ప్లస్ సీట్లు సాధించడం పెద్ద కష్టం కాకపోవచ్చని బీజేపీ అంచనాగా ఉంది. ఇంతవరకూ బీజేపీ బెస్ట్ బెంగాల్ షోగా (సీట్లు, ఓట్లుపరంగా) 2019 లోక్‌సభ ఎన్నికలను చెప్పుకోవచ్చు. ఈ ఎన్నికల్లో బెంగాల్‌లో 18 సీట్లు గెలుచుకోవడం ద్వారా 40.25 శాతం ఓట్ షేర్ సాధించింది. 2012 రాష్ట్ర ఎన్నికల్లో పార్టీ 77 సీట్లు దక్కించుకుని 38.14 శాతం ఓట్ షేర్ రాబట్టింది. తృణమూల్ పరంగా చూసినప్పుడు అత్యుత్తమ ఓట్ షేర్ 48 శాతం మాత్రమేనని, బీజేపీ అదనంగా మరో 6 శాతం ఓట్లు గెలిస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు సులభసాధ్యమేనని బీజేపీ అంచనా వేస్తోంది.
ఇవి కూడా చదవండి..
అయోధ్యలో పర్యటించనున్న మోదీ.. రామాలయంపై పతాకావిష్కరణ
ఢిల్లీలో డీకే విధేయులు.. సీఎం మార్పుపై సిద్ధరామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.