BJP: తమిళనాట అన్నాడీఎంకే-బీజేపీ మళ్లీ పొత్తు
ABN , Publish Date - Apr 12 , 2025 | 05:18 AM
దక్షిణాదిపై దృష్టి పెట్టిన బీజేపీ.. వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడలతో ముందుకు సాగుతోంది. కర్ణాటకలో అధికారం కోల్పోయిన దరిమిలా.. ఏపీలో టీడీపీ, జనసేనలతో కలిసి పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన కమల నాథులు ఇప్పుడు తమిళనాడుపైనా ఇదే వ్యూహంతో ముందుకు సాగాలని నిర్ణయించారు.

పళనిస్వామి సారథ్యంలో పనిచేస్తాం: అమిత్ షా
ఆర్‌ఎ్‌సఎస్ నేత, ఆడిటర్ గురుమూర్తి సలహాతో
పొత్తుపై హుటాహుటిన కేంద్ర మంత్రి ప్రకటన
పళని డిమాండ్‌తోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష
పదవి నుంచి అన్నామలై తొలగింపు
కొత్త సారథిగా నాగేంద్రన్ నియామకం
డీఎంకే దూకుడుతోనే కమలనాథుల నిర్ణయం
చెన్నై, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): దక్షిణాదిపై దృష్టి పెట్టిన బీజేపీ.. వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడలతో ముందుకు సాగుతోంది. కర్ణాటకలో అధికారం కోల్పోయిన దరిమిలా.. ఏపీలో టీడీపీ, జనసేనలతో కలిసి పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన కమల నాథులు ఇప్పుడు తమిళనాడుపైనా ఇదే వ్యూహంతో ముందుకు సాగాలని నిర్ణయించారు. నిన్న మొన్నటి వరకు ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లేందుకు ప్రయత్నించినా.. త్రిభాషా ఉద్యమం, నీట్, పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన వంటి కీలక విషయాల్లో అధికార డీఎంకే పార్టీ బీజేపీని కేంద్రంగా చేసుకుని రాజకీయ యుద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఒంటరి పోరు ఏ విధంగానూ సరికాదని గ్రహించిన బీజేపీ అగ్రనాయకత్వం.. తమిళనాడు ప్రధాన ప్రతిపక్షం, ఒకప్పటి మిత్ర పక్షం.. అన్నాడీఎంకేతో చేతులు కలిపింది. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అన్నాడీఎంకే-బీజేపీల మధ్య పొత్తు ఖరారైంది. సాక్షాత్తు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చెన్నై వచ్చి అన్నాడీఎంకే నేతలతో చర్చించిన తర్వాత ఈ పొత్తును ఆయనే స్వయంగా ప్రకటించారు. అంతేకాదు, నేరుగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్) నివాసానికి వెళ్లిన అమిత్ షా.. ఈపీఎస్ కుటుంబంతో కలిసి తేనీరు సేవించారు.
ఎన్నికలే అజెండా!
డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు.. ప్రజల్లో ఆ పార్టీకి, ఆ పార్టీ మిత్రపక్షాలకు సానుకూల స్పందన కల్పిస్తున్నాయి. దీనికి తోడు త్రిభాషా అమలు విధానం కోసం ఒత్తిడి, డీలిమిటేషన్‌పై వ్యతిరేకత, ‘నీట్’ వ్యతిరేక బిల్లును రాష్ట్రపతి తిరస్కరించడం తదితర కారణాతో బీజేపీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని తమ పార్టీ నుంచి నలుగురిని అసెంబ్లీకి పంపించిన బీజేపీకి.. ఈసారి ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కొనే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం బీజేపీతో తమిళమానిల కాంగ్రెస్, పీఎంకే వంటి చిన్న పార్టీలు మాత్రమే కలసి నడుస్తున్నాయి. గత 2024 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి కూటమికి 11 శాతం ఓట్లు పోలయినట్లు కనిపించినా, అందులో పీఎంకేకు 6 శాతానికి పైగా ఓటు బ్యాంకు ఉండడం గమనార్హం. దీంతో పరిస్థితిని గ్రహించిన కమలనాథులు అన్నాడీఎంకేను దరి చేర్చుకున్నారు. తమిళనాడులో ప్రస్తుత బీజేపీ చీఫ్ అన్నామలైని పక్కన పెడితేనే పొత్తుకు సిద్ధమని అన్నాడీఎంకే తేల్చి చెప్పడంతో.. ఆ డిమాండ్‌కు తలొగ్గిన బీజేపీ అధినాయకత్వం అన్నామలైని ఆ బాధ్యతల నుంచి వెంటనే తప్పించడం గమనార్హం.
అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోం
తమిళ పత్రిక ‘తుగ్లక్’ సంపాదకుడు, ఆర్‌ఎ్‌సఎస్ క్రియాశీలక నాయకుడిగా పేరొందిన ప్రముఖ ఆడిటర్ గురుమూర్తితో భేటీ అయ్యాకే అన్నాడీఎంకేతో పొత్తును అమిత్‌షా ప్రకటించడం గమనార్హం. నిజానికి శుక్రవారం సాయంత్రం 5 గంటలకు అమిత్‌షా గురుమూర్తితో భేటీ కావాల్సివుంది. కానీ, ఉదయం 10 గంటలకే గురుమూర్తి నివాసానికి వెళ్లిన అమిత్‌షా.. ఆయనతో చర్చించారు. కూటమి ఏర్పాటు గురించి జాప్యం చేయవద్దని ఆయన చేసిన సూచన మేరకు ఈపీఎ్‌సను తను ఉన్న హోటల్‌కు పిలిపించుకున్న అమిత్‌షా.. ఆయనతో గంటపాటు చర్చించారు. అనంతరం నేరుగా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చి పొత్తుపై ప్రకటన చేశారు. తమిళనాట అన్నాడీఎంకే నేతృత్వంలోనే తమ కూటమి పని చేస్తుందని, ఈ పొత్తుకు ఎలాంటి షరతుల్లేవని అమిత్‌షా చెప్పారు. శుక్రవారం సాయంత్రం బీజేపీ తమిళనాడు ప్రధాన కార్యాలయమైన కమలాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. జాతీయస్థాయిలో మోదీ నేతృత్వంలో, రాష్ట్రస్థాయిలో పళనిస్వామి నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ఎన్నికలకు వెళ్తుందని చెప్పారు. అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేశారు. కాగా, తమిళనాడులో బీజేపీ, అన్నాడీఎంకే చేతులు కలపడం ఆహ్వానించదగిన పరిణామమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. బీజేపీ, అన్నాడీఎంకే కూటమికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కూటమి తరపున సీఎం అభ్యర్థిగా పళనిస్వామి పేరును ప్రకటించడం ద్వారా పాలనానుభవం ఉన్నవారికి బాధ్యతలు అప్పగిస్తామని సంకేతమిచ్చినట్లు అయిందన్నారు.
నాగేంద్రన్‌కు బీజేపీ పగ్గాలు
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా తిరునల్వేలి ఎమ్మెల్యే నయినార్ నాగేంద్రన్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ పదవికి నాగేంద్రన్ మాత్రమే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక లాంఛనమైంది. దక్షిణ తమిళనాడులో దేవర్ల ప్రాబల్యం అధికంగా ఉన్న నేపథ్యంలో ఆ సామాజిక వర్గానికి చెందిన నాగేంద్రన్‌ను బీజేపీ ఎంపిక చేయడం గమనార్హం. 1989లో అన్నాడీఎంకేలో చేరి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన నాగేంద్రన్.. 2001లో తిరునల్వేలి నుంచి అన్నాడీఎంకే తరఫున పోటీచేసి విజయం సాధించారు. జయలలిత మంత్రివర్గంలో మంత్రిగా వ్యవహరించారు. జయ మరణానంతరం అన్నాడీఎంకేలో ఏర్పడిన విభేదాలతో ఆ పార్టీ నుంచి వైదొలిగి 2017లో బీజేపీలో చేరారు. కాగా.. ఇప్పటి వరకు పార్టీని నడిపించిన అన్నామలై శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. పార్టీ తరఫున అన్నామలై శక్తికిమించి పనిచేశారని అమిత్ షా అన్నారు.