BJP on Vote Theft Rally: మోదీనే టార్గెట్.. ఓట్ చోరీ ర్యాలీపై బీజేపీ ఫైర్
ABN , Publish Date - Dec 14 , 2025 | 04:22 PM
మోదీని అగౌరవపరిస్తే ప్రజలు ఎంతమాత్రం సహించరని బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర అన్నారు. ఆయన కుటుంబ సభ్యులను అవమానపరిచిన ప్రతిచోటా అక్కడ ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరిస్తూ వస్తున్నారని చెప్పారు.
న్యూఢిల్లీ: రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ నిర్వహిస్తున్న 'ఓట్ చోర్' ర్యాలీపై బీజేపీ విరుచుకుపడింది. ర్యాలీ ఉద్దేశం చాలా స్పష్టమని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గద్దె దిగాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈ ర్యాలీని నిర్వహిస్తున్నారని విమర్శించింది. ర్యాలీలో కాంగ్రెస్ కార్యకర్తలు కొందరు చేసిన వివాదాస్పద నినాదాలే ఇందుకు నిదర్శనమని పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వ్యతిరేకంగా ఆయన పాలనకు చరమగీతం పాడాలంటూ కొందరు కార్యకర్తలు నినాదాలు చేస్తున్న వీడియోను బీజేపీ షేర్ చేసింది.
'కాంగ్రెస్ ఎజెండా ఏమిటనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇది ఎస్ఐఆర్ గురించో, సంవిధాన్ పే వార్ గురించో కాదు. ఎస్ఐఆర్ పేరుతో ప్రధాని మోదీని గద్దె నుంచి తప్పించాలనుకుంటున్నారు. ఇటీవలే ఈసీఐని కూడా రాహుల్ గాంధీ బెదిరించారు. ఇంతవరకూ కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోదీపై 150 సార్లు అవమానకర వ్యాఖ్యలు చేసింది' అని బీజేపీ ప్రతినిధి షెహజాద్ పూనావాలా సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపారు.
మోదీని అగౌరవిస్తే సహించం
అందరూ గౌరవించే మోదీని అగౌరవపరిస్తే ప్రజలు ఎంతమాత్రం సహించరని బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తల నినాదాలను తాను వినలేదని, అయితే జాగ్రత్తగా పరిశీలించిన మీదట ఇలాంటి స్లోగన్లు ఇవ్వడం ద్వారా ప్రజల సెంటిమెంట్లను అర్ధం చేసుకోవడంలో కాంగ్రెస్ విఫలమైందని చెప్పక తప్పదని అన్నారు. మోదీని, ఆయన కుటుంబ సభ్యులను అవమానపరిచిన ప్రతిచోటా ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరిస్తూ వస్తున్నారని చెప్పారు. ఓట్ చోరీ ఆరోపణలపై పార్లమెంటులో చర్చ తరువాత కూడా కాంగ్రెస్ ర్యాలీ నిర్వహించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఉభయ సభలోని ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేసారని, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రతి పాయింట్‌కు వివరణ కూడా ఇచ్చారని చెప్పారు. తెలంగాణ, హిమాచల్, కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచినప్పుడు ఓట్ చోరీ ప్రస్తావన చేయలేదని, బీజేపీ గెలిస్తే మాత్రం ఓట్ చోరీ అంటూ యాగీ చేస్తున్నారని తప్పుపట్టారు. హోం మంత్రి చొరబాటుదారుల గురించి ప్రస్తావిస్తుంటే విపక్ష నేతలు వాకౌట్ చేశారని, దానిని బట్టే కాంగ్రెస్ ర్యాలీ ఓట్ చోరీకి సంబంధించినది కాదని, చొరబాటుదారులను కాపాడేందుకు జరుగుతున్న ప్రయత్నాలు మాత్రమేనని సంబిత్ పాత్ర విమర్శించారు.
ఇవి కూడా చదవండి..
ఎన్నికల్లో బీజేపీ గెలవడానికి కారణమిదే.. ప్రియాంక గాంధీ సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ 'ఓట్ చోర్, గద్దీ ఛోడ్' మహా ధర్నా
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి