Share News

MCD Bypolls: ఎంసీడీ ఉపఎన్నికల ఫలితాల్లో బీజేపీదే పైచేయి.. రెండో ప్లేస్‌లో ఆప్

ABN , Publish Date - Dec 03 , 2025 | 05:55 PM

అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం తర్వాత ఎంసీడీ ఉప ఎన్నికలు రావడంతో ముఖ్యమంత్రి రేఖాగుప్తాకు ఇది పరీక్షగా అందరూ భావించారు. అయితే ఆమె సునాయాసంగా ఈ పరీక్షలో నెగ్గారు.

MCD Bypolls: ఎంసీడీ ఉపఎన్నికల ఫలితాల్లో బీజేపీదే పైచేయి.. రెండో ప్లేస్‌లో ఆప్
Rekha Gupta

న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) పైచేయి సాధించింది. 12 స్థానాల్లో 7 స్థానాలు గెలుచుకుంది. ఫిబ్రవరి అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన గెలుపును పదిలం చేసుకుంది. దశాబ్దానికి పైగా అధికారంలో కొనసాగి పది నెలల క్రితం అధికారాన్ని కోల్పోయిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) 3 సీట్లు గెలుచుకుని రెండో స్థానానికి పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ ఒక సీటును దక్కించుకోగా, మరో సీటును ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ (AIFB) గెలుచుకుంది.


ఎంసీడీ ఉప ఎన్నికల్లో బీజేపీ ఏడు సీట్లు దక్కించుకున్నప్పటికీ మొత్తం 12 సీట్లలో ఇంతకుముందు 9 సీట్లు బీజేపీవే. ఇప్పుడు కోల్పోయిన రెండు సీట్లలో ఒక సీటు కాంగ్రెస్‌, మరొకటి ఏఐఎఫ్‌బీ చేజిక్కించుకున్నాయి. 2022లో జరిగిన పూర్తిస్థాయి ఎన్నికల్లో ఆప్ గెలుచుకున్న చాందినీచౌక్‌ను ఇప్పుడు బీజేపీకి చెందిన సుమన్ గుప్తా గెలుచుకోవడం ఆ పార్టీకి సానుకూల పరిణామం. 2022లో గెలుచుకున్న నరైన వార్డును తిరిగి ఆప్ నిలబెట్టుకుంది. బీజేపీ రెండు సీట్లు కోల్పోయినప్పటికీ ఎంసీడీలో ఆ పార్టీ ఆధిపత్యానికి ఢోకా లేదనే చెప్పాలి. మొత్తం 250 సీట్లలో బీజేపీకి ప్రస్తుతం 122 సీట్లు ఉండగా, ఆప్ 102 స్థానాలు కలిగి ఉంది. కాంగ్రెస్‌కు 9 సీట్లు ఉన్నాయి.


అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం తర్వాత ఎంసీడీ ఉప ఎన్నికలు రావడంతో ముఖ్యమంత్రి రేఖాగుప్తాకు ఇది పరీక్షగా అందరూ భావించారు. అయితే ఆమె సునాయాసంగా పరీక్షలో నెగ్గారు. ఆప్ ఢిల్లీ యూనిట్ బాధ్యతలు తీసుకున్న సౌరభ్ భరద్వాజ్‌కు కూడా ఇది తొలి ఎన్నికలే అయినప్పటికీ ఆయన కూడా ఎలాంటి సీటు కోల్పోకుండా ఎన్నికలను గట్టెక్కించారని చెప్పవచ్చు. గ్రేటర్ కైలాశ్, షాలిమార్ బాగ్ బి, అశోక్ విహార్, చాందినీ చౌక్, చాందినీ మహల్, డిచావున్ కలాన్, నరైన, సంగమ్ విహార్ ఏ, దక్షిణ్ పురి, ముండ్కా, వినోద్ నగర్, ద్వారకా బి వార్డుల్లో ఈ ఉప ఎన్నికలు జరిగాయి. వార్డు కౌన్సిలర్లు అసెంబ్లీకి ఎన్నిక కావడంతో 11 వార్డులకు ఖాళీలు ఏర్పడ్డాయి


కాంగ్రెస్ పార్టీ సంగమ్ విహార్-ఏలో మాత్రమే గెలిచింది. ఆ పార్టీ అభ్యర్థి సురేష్ చౌదరికి 12,766 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థికి 3,628 ఓట్లు వచ్చాయి. చాందినీ మహల్ వార్డును ఎఐఎఫ్‌బీ అభ్యర్థి మహమ్మద్ ఇమ్రాన్ గెలుచుకున్నారు. దక్షిణపురి,ముండ్కా, నరైనా వార్డులను ఆప్ గెలుచుకుంది. తక్కిన ఏడు వార్డుల్లోనే బీజేపీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు.


ఇవి కూడా చదవండి..

యాప్ ముందస్తు ఇన్‌స్టలేషన్ తప్పనిసరేం కాదు.. కేంద్రం

సంచార్ సాథీతో నిఘాకు తావే లేదు.. లోక్‌సభలో సింధియా

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 03 , 2025 | 05:57 PM