Sanchar Saathi: సంచార్ సాథీతో సైబర్ ఫ్రాడ్‌ల నుంచి రక్షణ: మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
ABN , Publish Date - Dec 03 , 2025 | 03:48 PM
సంచార్ సాథీ వెబ్‌సైట్‌ను ఒకసారి చూసినట్టయితే ఈ వెబ్‌సైట్‌కు 20 కోట్ల వెబ్‌సైట్ హిట్లు వచ్చాయని, 1.4 కోట్ల మంది ఇప్పటికే ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారని కేంద్ర మంత్రి వివరించారు.
న్యూఢిల్లీ: సైబర్ మోసాల బారిన పడకుండా నిరోధించే ఏకైక మార్గం 'సంచార్ సాథీ' (Sanchar Saathi) అప్లికేషన్ అని అని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandra Sekhar) బుధవారంనాడు తెలిపారు. భారత్‌లో విక్రయించే ఫోన్లలో ఈ యాప్‌ను ముందుగానే ఇన్‌స్టాల్ చేసి ఇవ్వాలనే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలపై విపక్షాలు ఆందోళన వ్యక్తం చేయడం, ఇది ప్రజల వ్యక్తిగత జీవితాలపై నిఘా పెట్టడమే అవుతుందని అభ్యంతరాలు చెబుతున్న నేపథ్యంలో మంత్రి తాజా వివరణ ఇచ్చారు.
'స్నూపింగ్ యాప్ అని చెబుతున్న ఎవరికైనా ఒక మాట చెప్పదలచుకున్నాను. దయచేసి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. మీఅంతగా మీరు క్షుణ్ణంగా పరిశీలించండి. సైబర్ నేరాలను నిరోధించేందుకు చాలా తక్కువ మార్గాలు ఉన్నారు. నా అభిప్రాయంలో సైబర్ నేరాలను నిరోధించేందుకు ఇదొక్కటే మార్గం. యాప్‌ను ప్రీ-ఇన్‌స్టాల్ చేయడం తప్పనిసరా కాదా అనేది వేరే విషయం. తమ ఆదేశాలను పునఃపరిశీలిస్తామని ప్రభుత్వం, సింధియా వివరణ ఇచ్చారు. విద్యాధికుల సమాచారం సేకరించడం, దానిని పేదలు, వృద్ధులకు సాయపడేందుకు ఉపయోగించడం ఈ యాప్ లక్ష్యం' అని చంద్రశేఖర్ చెప్పారు.
20 కోట్ల వెబ్‌సైట్ హిట్లు
అన్ని వాడుకభాషల్లోనూ యాప్ పనిచేస్తుందని మంత్రి తెలిపారు. సంచార్ సాథీ వెబ్‌సైట్‌ను ఒకసారి చూసినట్టయితే ఈ వెబ్‌సైట్‌కు 20 కోట్ల వెబ్‌సైట్ హిట్లు వచ్చాయని, 1.4 కోట్ల మంది ఇప్పటికే ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారని వివరించారు. యాప్ స్టోర్‌లో కనిపించడానికి ముదు యాపిల్, గూగుల్ సైత యాప్‌ను వెరిఫై చేసినట్టు తెలిపారు. ఎవరైనా యాప్ వద్దనుకుంటే దాన్ని డిలీట్ చేయవచ్చని, అయితే యాప్ ఆలోచన మంచిదని, ప్రతి ఒక్కరూ డౌన్‌లోడ్ చేసుకోవచ్చని మంత్రి సూచించారు.
ఇవి కూడా చదవండి..
సంచార్ సాథీతో నిఘాకు తావే లేదు.. లోక్‌సభలో సింధియా
విజయవంతంగా హై-స్పీడ్ రాకెట్ స్లెడ్ టెస్ట్.. ఎలైట్ క్లబ్‌లో భారత్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి