Nitish Kumar: కోటి ఉద్యోగాలు, కొత్తగా టెక్ హక్.. నితీశ్ క్యాబినెట్ కీలక నిర్ణయాలు
ABN , Publish Date - Nov 25 , 2025 | 04:24 PM
డిఫెన్స్ కారిడార్, సెమికండక్టర్ తయారీ పార్క్, గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు, మెగా టెక్ సిటీ, ఫిట్‌నెస్ సిటీ ఏర్పాటుతో బీహార్‌ను ఈస్ట్రన్ ఇండియా టెక్ హబ్‌గా తయారు చేయాలని మంత్రివర్గ మావేశంలో నిర్ణయించినట్టు సీఎస్ తెలిపారు.
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం అనంతరం నితీశ్ కుమార్ (Nitish Kumar) మంత్రివర్గం మంగళవారంనాడు తొలిసారి సమావేశమైంది. నితీశ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాబోయే ఐదేళ్లలో రాష్ట్ర యువతకు కోటి ఉద్యోగాలు కల్పించాలని, 'ఈస్ట్రన్ ఇండియా టెక్ హబ్'గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని నిర్ణయించారు. సమావేశానంతరం బిహార్ చీఫ్ సెక్రటరీ ప్రత్యయ్ అమ్రిత్ ఆ వివరాలను మీడియాకు తెలిపారు. విస్తృత ఉద్యోగావకాశాల కల్పన, పారిశ్రామిక అభివృద్ధిపై సమావేశంలో కీలకంగా చర్చ జరిగినట్టు ఆయన చెప్పారు.
డిఫెన్స్ కారిడార్, సెమీకండక్టర్ తయారీ పార్క్, గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు, మెగా టెక్ సిటీ, ఫిట్‌నెస్ సిటీ ఏర్పాటుతో బీహార్‌ను ఈస్ట్రన్ ఇండియా టెక్ హబ్‌గా తయారు చేయాలని సమావేశంలో నిర్ణయించినట్టు సీఎస్ తెలిపారు. న్యూఏజ్ ఎకానమీ కింద రాబోయే ఐదేళ్లలో గ్లోబల్ వర్క్‌ప్లేస్‌గా బీహార్‌ను అభివృద్ధి చేయనున్నామని, ఈ లక్ష్య సాధనకు డెడికేటెడ్ కమిటీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. స్టార్టప్ డొమైన్‌లో రాష్ట్రంలోని ప్రతిభావంతులు, యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే విధంగా ప్రణాళికలు రూపొందించేందుకు ఒక కమిటీని ఇప్పటికే ఏర్పాటు చేశామని తెలిపారు. ఏఐ డొమైన్‌లో కూడా బీహార్‌ను లీడింగ్ స్టేట్‌గా తీర్చిదిద్దనున్నామని, ఇందుకు అవసరమైన ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ మిషన్‌కు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపిందని సీఎస్ తెలిపారు.
సోనెపూర్, సీతామర్హితో సహా 12 సిటీల్లో గ్రీన్‌ఫీల్డ్ టౌన్‌షిప్ ప్రాజెక్టులను ప్రారంభించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మూతపడిన 9 చక్కెర మిల్లులను పునరుద్ధరించాలని, 25 కొత్త మిల్లలను ఏర్పాటు చేయాలని కూడా క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని చీఫ్ సెక్రటరీ వివరించారు.
ఇవి కూడా చదవండి..
ఎందరో త్యాగధనుల కలలు నేటితో సాకారం.. ఆర్ఎస్ఎస్ చీఫ్
రామభక్తుల సంకల్పం సిద్ధించింది: ప్రధాని మోదీ
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.