Bihar Kanwariya Accident: డీజే సిస్టమ్ విద్యుత్ తీగకు తాకి ఐదుగురు భక్తులు మృతి
ABN , Publish Date - Aug 04 , 2025 | 09:54 AM
భక్తిశ్రద్ధతో శివుడిని దర్శించుకునేందుకు బయలుదేరిన భక్తుల ప్రయాణం అనుకోని విషాదంగా మారింది. వారు ప్రయాణిస్తున్న వాహనంపై అమర్చిన డీజే సౌండ్ సిస్టమ్ విద్యుత్ తీగకు తాకిన క్రమంలో ఐదుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు గాయపడ్డారు.

బిహార్: భాగల్పూర్ జిల్లా(Bihar Kanwariya Accident)లో ఆదివారం రాత్రి ఘోర దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు శివ భక్తులు మరణించగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. శ్రావణి మేళా చివరి సోమవారం సందర్భంగా సుల్తాన్‌గంజ్ నుంచి గంగాజలం తీసుకుని జయేష్ఠగౌర్ నాథ్‌స్థాన్‌కు వెళ్తున్న యువకుల బృందం ఈ ప్రమాదానికి గురైంది. వారు ప్రయాణిస్తున్న వాహనంపై అమర్చిన డీజే సౌండ్ సిస్టమ్ విద్యుత్ తీగను తాకడంతో ఈ దుర్ఘటన సంభవించింది.
అనేక మంది భక్తులు..
పోలీసుల వివరణ ప్రకారం రాత్రి 12:05 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. డీజే సౌండ్ సిస్టమ్‌తో ఉన్న వాహనం ఒక ప్రదేశంలో బురదలో కూరుకుపోయింది. డ్రైవర్ వాహనాన్ని బయటకు తీయడానికి ప్రయత్నిస్తుండగా, డీజే సిస్టమ్ రోడ్డుపైన హై-టెన్షన్ విద్యుత్ తీగకు అనుకోకుండా తగిలింది. ఆ క్రమంలో షాక్ కొట్టి వాహనం పక్కనే ఉన్న కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించగా, పలువురు గాయపడ్డారు. వాహనంలో మొత్తం తొమ్మిది మంది ఉండగా, డజన్ల కొద్దీ భక్తులు కాలినడకన డీజే సౌండ్ సిస్టమ్‌తో వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.
షాకైన స్థానికులు
వారి కుటుంబాలకు ఆర్థికసాయం అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. ప్రమాద స్థలంలో ఎస్‌డీపీఓ ఉన్నారని, డ్రైవర్‌ను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. వాహనం బురదలో చిక్కుకోవడంతో డ్రైవర్ దాన్ని బయటకు తీసే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో సౌండ్ సిస్టమ్ విద్యుత్ తీగకు తగలడంతో ఈ దుర్ఘటన జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటన శ్రావణి మేళా ఉత్సవాల సందర్భంగా జరగడం స్థానికులను షాక్‌కు గురిచేసింది.
ఇవి కూడా చదవండి
ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి