Shibu Soren Death: జేఎంఎం వ్యవస్థాపకుడు, మాజీ సీఎం శిబూ సోరెన్ ఇక లేరు
ABN , Publish Date - Aug 04 , 2025 | 10:03 AM
జార్ఖండ్ రాజకీయ చరిత్రలో తనదైన ముద్ర వేసిన మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి శిబూ సోరెన్ (81) ఇక లేరు. ఈరోజు ఉదయం కన్నుమూశారు.

జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి శిబూ సోరెన్(81) ఇక లేరు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు. నెల రోజులకు పైగా సోరెన్ ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మూత్రపిండాల సంబంధిత సమస్యల కారణంగా శిబూ సోరెన్(Shibu Soren Death) జూన్ చివరి వారంలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. కాగా, తన తండ్రి మరణ వార్తను జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (hemanth soren) సోషల్ మీడియా ఎక్స్ ద్వారా తెలియజేశారు.
నెల రోజులుగా
కాగా, శిబూ సోరెన్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ జార్ఖండ్ ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు హేమంత్ సోరెన్ మాట్లాడుతూ, గురూజీ మనందరినీ విడిచిపెట్టి వెళ్లారని పేర్కొన్నారు. శిబూ సోరెన్ ఈరోజు ఉదయం 8:56 గంటలకు మరణించినట్లు ప్రకటించారు. మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్న సోరెన్‌కు నెలన్నర క్రితం స్ట్రోక్ వచ్చింది. ఆయన దాదాపు నెల రోజులుగా లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌లో ఉన్నారు. వైద్యుల బృందం ఐసీయూలో నిరంతరం ఆయన్ని పర్యవేక్షించింది. కానీ చివరికి ఆయన్ని కాపాడలేకపోయారు.
మూడు సార్లు సీఎం
శిబూ సోరెన్ 1944 జనవరి 11న జన్మించారు. జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు కోసం నడిపిన ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. మూడుసార్లు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా (2005లో 10 రోజులు, 2008-2009, 2009-2010) పనిచేశారు. ఆయన దుమ్కా లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఏకంగా ఎనిమిది సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 2004, 2004-2005, 2006లో కేంద్ర బొగ్గు శాఖ మంత్రిగా పనిచేశారు.
ఆయన జీవితం..
శిబూ సోరెన్ ఆదివాసీ నాయకుడిగా, జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) స్థాపకుడిగా చేసిన కృషి రాష్ట్ర రాజకీయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. సామాన్యుల హక్కులు, ఆదివాసీ సమాజ ఉద్ధరణ కోసం అలుపెరగని పోరాటం చేశారు. రాజకీయ నాయకుడిగానే కాక, సామాజిక సంస్కర్తగా ఆయన జీవితం ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుంది.
ఇవి కూడా చదవండి
ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి