Athishi: గోవా, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ: అతిషి
ABN , Publish Date - Mar 10 , 2025 | 09:51 PM
గోవా, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని, ఇప్పటి వరకూ పొత్తులపై ఎలాంటి చర్చలు జరగలేదని ఆప్ సీనియర్ నేత అతిషి చెప్పారు.

పనాజీ: గోవా, గుజరాత్‌లలో 2027లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అతిషి (Atishi) తెలిపారు. మార్గవోలో పార్టీ కార్యాలయం ప్రారంభించేందుకు గోవా వచ్చిన అతిషి మీడియాతో మాట్లాడుతూ, గోవా, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని, ఇప్పటి వరకూ పొత్తులపై ఎలాంటి చర్చలు జరగలేదని చెప్పారు.
ED Team Attacked: మాజీ సీఎం నివాసంలో సోదాలు చేసిన ఈడీ టీమ్‌పై దాడి
గోవాలో 2022లో బీజేపీకి ఓటర్లు అధికారం ఇచ్చారని, ఇదే సమయంలో కాంగ్రెస్ 11 సీట్లు గెల్చుకోగా 8 మంది బీజేపీలో చేరిపోయారని అతిషి తెలిపారు. ప్రధాన పార్టీగా ఉన్న కాంగ్రెస్‌కు ప్రస్తుతం ముగ్గురు ఎమ్మెల్యేలే ఉన్నారని, ఆప్‌కు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పారు. 2022లో ఇద్దరు ఆప్ ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు రెండు నెలల్లోనే వాళ్లు పార్టీ మారుతారంటూ ఊహాగానాలు వచ్చాయని, అయితే ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పటికీ పార్టీతోనే ఉన్నారనిస బీజేపీ ఆకర్షణలకు తమ ఎమ్మెల్యేలు లొంగలేదని చెప్పారు. ఎందుకంటే ఆప్ ఎమ్మెల్యేలు డబ్బుల కోసం రాజకీయాల్లోకి రాలేదని అన్నారు. ఎన్నికల్లో గెలవడం, డబ్బులు కూడబెట్టడం లక్ష్యంగా తమ రాజకీయాలు ఉండవని, ప్రజలకు సేవ చేయడం కోసమే రాజకీయాలని చెప్పారు.
ఢిల్లీలో ఓటమిపై..
ఢిల్లీలో ఆప్ ఓటమిపై అడిగిన ప్రశ్నకు అతిషి సమాధానమిస్తూ, ఆప్‌కు ఏం జరుగుతుందనే కాకుండా, ప్రజలకు ఏం జరుగుతుందనేది చూడాలని అన్నారు. బీజేపీ ఇప్పటికే 250 మొహల్లా క్లినిక్‌లు మూసేస్తామని ప్రకటించిందని చెప్పారు. ఆప్ అధికారం కోల్పేతే ఢిల్లీలో విద్యుత్ కోతలు మొదలవుతాయని, ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యతాయుతమైన విద్య దుస్థితికి చేరుతుందని కేజ్రీవాల్ అప్పుడే చెప్పారని, అప్పటికే ఆ పరిస్థితి మొదలైందని చెప్పారు. ఒక క్రమపద్ధతిలో ఆప్ ప్రభుత్వం చేపట్టిన పనులు ఆపేస్తారని అన్నారు. అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం, ఓటర్లను బెదిరించడం వంటివి ఢిల్లీ ఎన్నికల్లో చోటుచేసుకున్నాయని, ఇలాంటి ఎన్నికలను ఢిల్లీ ఎప్పుడూ చూడలేదని చెప్పారు. ఇంత జరిగినా బీజేపీ-ఆప్ మధ్య వచ్చిన ఓట్ల తేడా కేవలం 2 శాతం మాత్రమేనని అన్నారు. మార్చి 8వ తేదీ నాటికి మహిళల అకౌంట్లలో రూ.2,500 వేస్తామని ఇచ్చిన వాగ్దానాన్ని బీజేపీ నిలబెట్టుకోలేదని తప్పుపట్టారు.
ఇవి కూడా చదవండి
Ranya Rao: రన్యారావుకు పొలిటికల్ లింక్స్.. దుమ్మెత్తి పోసుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్
Ranya Rao: ఇంటరాగేషన్‌లో టార్చర్.. కోర్టులో కంటతడి పెట్టిన రన్యారావు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.