Amit Shah: జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణపై సరైన సమయంలో నిర్ణయం
ABN , Publish Date - Oct 18 , 2025 | 07:58 PM
జమ్మూకశ్మీర్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగిందని, పంచాయతీలు, మున్సిపాలిటీలతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు కూడా జరిగాయని, రాజ్యసభ ఎన్నికలు కూడా త్వరలో జరగనున్నాయని అమిత్‌షా చెప్పారు.
పాట్నా: జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir)కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ (statehood restoration)పై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా (Amit Shah) తెలిపారు. కేంద్ర పాలిత ప్రాంతైన లద్దాఖ్ (Ladakh) విషయంలోనూ ప్రజలు లేవనెత్తిన డిమాండ్లపై కూడా 'మంచి తీర్మానం' చేస్తామని హామీ ఇచ్చారు. పాట్నాలో శనివారంనాడు జరిగిన మీడియా కాంక్లేవ్‌లో హోం మంత్రి మాట్లాడుతూ, ఉగ్రవాదం గుప్పిట్లో చిక్కిన జమ్మూకశ్మీర్ 370వ అధికరణ తర్వాత యూటర్న్ తీసుకుందని, గత తొమ్మది నెలల్లో లోకల్ టెర్రరిస్ట్ రిక్రూట్‌మెంట్ ఒక్కటి కూడా చోటుచేసుకోలేదని అన్నారు.
'1990 నుంచి వేర్వాటువాద చీడపీడల్లో చిక్కుకున్న జమ్ముకశ్మీర్‌లో గుణాత్మకమైన మార్పు వచ్చింది. గతంలో సరిహద్దులకు ఆవల నుంచి టెర్రరిస్టులను పంపాల్సిన అవసరం లేదని పాక్ భావించేది. మన పిల్లల చేతుల్లో ఆయుధాలు ఉంచేది. ఇప్పుడు పరిస్థితి మారింది. జమ్మూకశ్మీర్ ప్రజలంతా తాము దేశంతో ఉన్నామని, యావత్ దేశం తమ వెంట ఉందని బలంగా విశ్వసిస్తున్నారు' అని అమిత్‌షా చెప్పారు.
జమ్మూకశ్మీర్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగిందని, పంచాయతీలు, మున్సిపాలిటీలతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు కూడా జరిగాయని, రాజ్యసభ ఎన్నికలు కూడా త్వరలో జరగనున్నాయని అమిత్‌షా చెప్పారు. తాను సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత కూడా ఇంతవరకూ రాష్ట్ర హోదా పునరుద్ధరణ జరగలేదంటూ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, రాజకీయ అనివార్యతల వల్ల ఆయన అలా చెప్పి ఉండొచ్చని అన్నారు. కానీ రాష్ట్ర హోదా పునరుద్ధరణ సరైన సమయంలో జరుగుతుందని, సీఎంతో కూడా చర్చిస్తామని చెప్పారు. లద్దాఖ్‌లో ఇటీవల జరిగిన ఆందోళనను ప్రస్తావిస్తూ, లెహ్, కార్గిల్ కమిటీలతో కేంద్రం సంభాషణలు జరుపుతోందని చెప్పారు. ప్రజలు ఓర్పుతో ఉండాలని కోరారు. వారి న్యాయపరమైన డిమాండ్లపై మంచి తీర్మానం జరుగుతుందని వివరించారు. సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ విడుదల అవకాశాలపై అడిగినప్పుడు, ప్రజల డిమాండ్లపైనే తాను మాట్లాడుతున్నానని, వ్యక్తుల డిమాండ్ల గురించి కాదని అన్నారు. ఆయనకు (వాంగ్‌చుక్) సంబంధించిన కేసు కోర్టు ముందు ఉందని, సాక్ష్యాల ఆధారంగా కోర్టు నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
పాక్‌లో ప్రతి అంగుళం బ్రహ్మోస్ రేంజ్‌లో ఉంది.. రాజ్‌నాథ్ వార్నింగ్
ఢిల్లీలో ఎంపీలకు కేటాయించిన ఫ్లాట్లలో భారీ అగ్నిప్రమాదం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి