Delhi Elections: బీజేపీ మూడవ 'సంకల్ప్ పాత్ర'ను విడుదల చేసిన అమిత్‌షా
ABN , Publish Date - Jan 25 , 2025 | 04:52 PM
ఢిల్లీ నివాసులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారానికి, దేశ రాజధాని ప్రగతి, అభివృద్ధికి అవసరమైన రోడ్ మ్యాప్‌కు మేనిఫెస్టోలో బీజేపీ భరోసా ఇచ్చింది.

న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల మానిఫెస్టోను రెండు భాగాలుగా ఇంతవరకూ విడుదల చేసిన భారతీయ జనతా పార్టీ (BJP) మూడవది, చివరిది అయిన 'వికసిత్ ఢిల్లీ సంకల్ప్ పాత్ర' (Vikasit Dilli Sankalp Patra)ను శనివారంనాడు విడుదల చేసింది. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఈ చివరి భాగం 'సంకల్ప్ పాత్ర'ను కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) విడుదల చేశారు. 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ విజన్, కీలక వాగ్దానాలను ఈ మేనిఫెస్టోలో పొందుపరిచారు.
Delhi Poll: ఆప్ ప్రచార పోస్టర్.. అవీనితిపరుల జాబితాలో రాహుల్
ప్రజా సూచనలను అనుగుణంగా..
మేనిఫెస్టో విశ్వసనీయతను అమిత్‌షా ప్రస్తావిస్తూ, బీజేపీ వరకూ మేనిఫెస్టో అంటే విశ్వసనీయతే కానీ ఉత్తుత్తి వాగ్దానాలు కాదని చెప్పారు. 1.08 లక్షల మంది ప్రజలు, 62,000 గ్రూపుల సలహాలు, సూచనలు తీసుకుని ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా మేనిఫెస్టోను రూపొందించినట్టు తెలిపారు. ఢిల్లీ నివాసులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారానికి, దేశ రాజధాని ప్రగతి, అభివృద్ధికి అవసరమైన రోడ్ మ్యాప్‌కు మేనిఫెస్టో భరోసా ఇచ్చింది.
ఓటర్లను తప్పుదారి పట్టిస్తున్న ఆప్
తప్పుడు వాగ్దానాలతో అమాయకులైన ఓటర్లను ఆమ్ ఆద్మీ పార్టీ సారథ్యంలోని ప్రస్తుత ప్రభుత్వం మభ్యపెడుతోందని అమిత్‌షా విమర్శించారు. మంత్రులకు అధికార బంగ్లాలు ఉండవని గతంలో కేజ్రీవాల్ వాగ్దానం చేశారని, అయితే అందుకు భిన్నంగా అత్యంత విలాసవంతమైన 'శీష్ మహల్' సహా లగ్జరీ నివాసాల్లో వారుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇచ్చిన వాగ్దానాలను తోసిరాజని ప్రభుత్వం భారీగా ఖర్చులు చేయడంపై ప్రభుత్వాన్ని ఢిల్లీ ప్రజలు ప్రశ్నిస్తున్నారని అన్నారు. జవాబుదారీతనం, అభివృద్ధికి పాటుపడే పార్టీనే ఓటర్లు ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఆప్ ప్రభుత్వం ఎక్సైజ్ స్కామ్, ఢిల్లీ జల్ బోర్డ్ స్కామ్, రేషన్ డిస్ట్రిబ్యూషన్ స్కామ్, డీటీసీ స్కామ్, సీసీటీవీ ఇన్‌స్టలేషన్ స్కామ్, మెడికల్ టెస్ట్ స్కామ్ వంటి పలు కుంభకోణాల్లో చిక్కుకుందని, యుమనా జలాల ప్రక్షాళన మాట నిలబెట్టుకోలేదని అమిత్‌షా విమర్శించారు. ఎడ్వర్‌టైజ్‌మెంట్లకు ధారాళంగా ఖర్చు చేసి గార్బేజ్ కలెక్షన్ సహా నిత్యావసర సర్వీసులకు నిధుల్లేకుండా చేసిందని అన్నారు. యమునలో కేజ్రీవాల్ పవిత్ర స్నానం చేయలేకుంటే కనీసం మహాకుంభకు వెళ్లి అయినా తన వాగ్దానం నిలుపుకోవాలని సూచించారు.
బీజేపీ ఢిల్లీ విజన్
ఢిల్లీ అభివృద్ధికి బీజేపీ రోడ్‌మ్యాప్‌ను అమిత్‌షా వివరిస్తూ, ఢిల్లీలో అవినీతిరహిత పాలనను అందిస్తామని, 1,700 అనధీకృత కాలనీలను రెగ్యులరైజ్ చేస్తామని, జ్యూడిషియల్ అథారిటీ ద్వారా మూతపడిన 1,300 దుకాణాలను తెరిపిస్తామని, లీజ్డ్ ప్రాపర్టీల్లో నివసిస్తు్న్న పాక్ శరణార్ధులకు యాజమాన్య హక్కులను కల్పిస్తామని హామీ ఇచ్చారు. మోదీ నాయకత్వంలోనే ఈ వాగ్దానాల అమలు సాధ్యమవుతుందని, ఇతరులు వాగ్దానాలు చేస్తే, మోదీ ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తారని అన్నారు. ఢిల్లీకి ఉజ్వల భవిష్యత్తు, అవినీతి రహిత పాలన అందించి, పారదర్శకత, అభివృద్ధికి కట్టుబడే ప్రభుత్వాన్ని ఓటర్లు ఎన్నుకోవాలని అమిత్‌షా విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి