Share News

Avio Phobia: అమ్మో... విమాన ప్రయాణం

ABN , Publish Date - Jun 27 , 2025 | 04:17 AM

ఒకప్పుడు విమాన ప్రయాణం అంటే కలల ప్రపంచంలో విహారమే. దానినో హోదాగా, గర్వంగా భావించేవారు. తర్వాత పరిస్థితి మారింది. అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం విమాన ప్రయాణాన్ని ఓ భయంగా మార్చేసింది.

Avio Phobia: అమ్మో... విమాన ప్రయాణం

  • ఎయిర్‌ఇండియా ప్రమాదం తర్వాత ప్రజల్లో పెరిగిన ’ఏవియో ఫోబియా’.. విమానం ఎక్కాలంటేనే గుబులు

  • టికెట్‌ బుక్‌ చేసుకునే ముందే పూర్తిస్థాయిలో వివరాల ఆరా

  • బోయింగ్‌ డ్రీమ్‌ లైనర్‌ పేరు వింటేనే ప్రయాణికుల్లో ఒక రకమైన భయం

  • ఎయిర్‌ ఇండియాపై సన్నగిల్లిన నమ్మకం.. బుకింగ్స్‌పై ప్రభావం

  • ఎమర్జెన్సీ డోర్ల వద్ద సీట్లకు డిమాండ్‌

కప్పుడు విమాన ప్రయాణం అంటే కలల ప్రపంచంలో విహారమే. దానినో హోదాగా, గర్వంగా భావించేవారు. తర్వాత పరిస్థితి మారింది. అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం విమాన ప్రయాణాన్ని ఓ భయంగా మార్చేసింది. ఇలాంటి భయంతో నెలకొనే ఒత్తిడి, గుండెలో గుబులు, అసహనం కలిగే స్థితిని మానసిక నిపుణులు ఏవియో ఫోబియాగా పిలుస్తారు. చాలా మంది ఈ ఫోబియాతో విమాన ప్రయాణాలకు దూరంగా ఉంటారు. గతంలో ప్రయా ణికులు ఏ విమానాల్లో ప్రయాణిస్తున్నామనేది పెద్దగా పట్టించుకోలేదని, ఇప్పుడు ఆలోచన విధానం మారిందని ముంబైకి చెందిన ఓ ట్రావెల్‌ ఏజెన్సీ తెలిపింది. టికెట్‌ బుక్‌ చేసుకునే ముందే విమాన రకం, మోడల్‌, విమానయాన కంపెనీ వంటి అంశాలను పరిశీలిస్తున్నారని పేర్కొంది. బోయింగ్‌, డ్రీమ్‌లైనర్‌ అనే పేర్లు వినడానికి కూడా ప్రయాణికులు ఇష్టపడటం లేదని వెల్లడించింది.

ప్రయాణికుల్లో భయం

274 మంది ప్రాణాలను బలిగొన్న బోయింగ్‌ డ్రీమ్‌లైనర్‌ విమాన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో, టీవీ చానెళ్లలో విస్తృతంగా వైరల్‌ అయ్యాయి. ఇప్పటికే ఏవియో ఫోబియా ఉన్న వారిలో భయాన్ని రెట్టింపు చేయడమే కాదు.. కొత్తగా ఫోబియాకు లోనయ్యే వారి సంఖ్యను కూడా పెంచాయి. భారతీయ ప్రయాణికుల్లో భయాందోళనలకు ఈ ప్రమాద దృశ్యాలు ఒక ముఖ్య కారణమని మానసిక నిపుణులు తెలిపారు. ఈ సంఘటన జరిగిన ఒక్కరోజు తర్వాత భారత్‌లో ’ఫ్లయింగ్‌ ఫియర్‌’ అనే పదంపై గూగుల్‌లో శోధన పెరిగిందని గూగుల్‌ ట్రెండ్స్‌ డేటా చూపిస్తోంది.


ఎయిర్‌ ఇండియాపై ప్రభావం

అహ్మదాబాద్‌ ప్రమాదం విమానయాన రంగాన్ని గణనీయంగా ప్రభావం చేసింది. ముఖ్యంగా ఎయిర్‌ఇండియాపై ప్రజల నమ్మకం తగ్గినట్టు స్పష్టంగా తెలుస్తోందని ముంబైలోని మరో ట్రావెల్‌ ఏజెన్సీ తెలిపింది. చాలా మంది ప్రయాణికులు ఎయిర్‌ ఇండియాలో ప్రయాణించడానికి భయపడుతున్నారని, ప్రత్యామ్నాయ విమానయాన సంస్థలను కోరుకుంటున్నారని పేర్కొంది. వారి డేటా ప్రకారం ’ఎయిర్‌ ఇండియా విమానాల బుకింగ్‌లు 15 నుంచి 20 శాతం తగ్గాయి. అదే సమయంలో ప్రయాణాల రద్దు 30 నుంచి 40 శాతం మేర పెరిగాయి’ అని తెలిపింది. ఇది ఎయిర్‌ఇండియాకు ఆర్థికంగా, బ్రాండ్‌ ఇమేజ్‌పరంగా నష్టాన్ని కలిగించిందని మార్కెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఏవియో ఫోబియా ఎలా ఎదుర్కొవాలి ?

మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నివేదిక ప్రకారం.. 2024లో ప్రపంచవ్యాప్తంగా 40.6 కోట్ల విమాన సర్వీసులు విజయవంతంగా గమ్యస్థానాన్ని చేరుకోగా, కేవలం 7 ప్రమాదాలే నమోదయ్యాయి. వాస్తవాలు ఎలా ఉన్నా, ఒక్క ఘోర ఘటన ఏవియో ఫోబియా భయాన్ని పెంచింది. దీనిని ఎదుర్కొవడానికి మానసిక నిపుణులు కొన్ని ముఖ్య సూచనలు చేశారు. సానుకూల ఆలోచనలతో మనస్సును మళ్లించడం, సంగీతం వినడం లాంటివి ఉపశమనం కలిగిస్తాయని చెప్పారు. చిన్న ప్రయాణాలతో ప్రారంభించి క్రమంగా పెద్ద ప్రయాణాల వైపు అడుగులు వేయాలని సూచిస్తున్నారు. కాగ్నిటివ్‌ బిహేవియర్‌ థెరపీ ఎక్స్‌పోజర్‌ థెరపీ(విమాన దృశ్యాలు, సౌండ్స్‌, ప్రయాణ వీడియోలను చూపిస్తారు), యాంగ్జైటీ మేనేజ్‌మెంట్‌ మెడికేషన్‌ ద్వారా ఏవియో ఫోబియాను ఎదుర్కోవచ్చని చెబుతున్నారు.

11ఏ సీటుకు డిమాండ్‌

ఇంత పెద్ద విమాన ప్రమాదంలో ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. ఇప్పుడు అతను బతకడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అతను కూర్చున్న సీటు నంబరు 11ఏ .అప్పటి నుంచి ఆ సీటు కోసం అభ్యర్థనలు పెరిగాయని భారతీయ ట్రావెల్‌ ఎజెంట్లు నివేదించారు. కొంత మంది ప్రయాణికులు అదనంగా డబ్బు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారట. యూకేకు చెందిన రమేష్‌ ఎమర్జెన్సీ డోర్‌ పక్కన కూర్చోవడం వల్లే తప్పించుకున్నాడని మెజారిటీ ప్రజలు నమ్ముతున్నారు.

(సెంట్రల్‌ డెస్క్‌)

Updated Date - Jun 27 , 2025 | 08:08 AM