Air india: సాంకేతిక లోపంతో బయలుదేరిన 18 నిమిషాలకే..
ABN , Publish Date - Jul 25 , 2025 | 05:54 PM
జైపూర్ నుంచి ముంబై బయలుదేరిన ఏఐ-612 విమానం 18 నిమిషాల ప్రయాణం తర్వాత సాంకేత లోపాన్ని ఎదుర్కొంది. దీంతో విమానాన్ని వెనక్కి మళ్లించారు.

జైపూర్: ఎయిరిండియా (Air India) విమానాలను సాంకేతిక లోపాలు వెంటాడుతున్నాయి. శుక్రవారంనాడు మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. జైపూర్ నుంచి ముంబై బయలుదేరిన ఏఐ-612 విమానం 18 నిమిషాల ప్రయాణం తర్వాత సాంకేత లోపాన్ని ఎదుర్కొంది. దీంతో విమానాన్ని వెనక్కి మళ్లించారు. మధ్యాహ్నం 1.35 గంటలకు జైపూర్ నుంచి ఈ విమానం టేకాఫ్ కాగా 1.58 నిమిషాలకు తిరిగి జైపూర్ చేరుకుంది. అయితే విమానంలో ఎంతమంది ఉన్నారనేది వెంటనే తెలియలేదు.
ఈ వారం మొదట్లో కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దోహాకు బయలుదేరిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ IX 375లో సాంకేతిక లోపం తలెత్తింది. 188 మంది ప్రయాణికులతో ఉన్న ఈ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో రెండు గంటల తర్వాత కాలికట్ విమానాశ్రయానికి తిరిగి మళ్లించారు.
కాగా, మరో ఘటన గత గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ముంబైకు బయలుదేరిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం సాంకేతిక లోపం కారణంగా రద్దయింది. కాక్‌పిట్ స్క్రీన్స్‌లో లోపాన్ని పైలట్ కనిపెట్టడంతో విమాన సర్వీసును రద్దు చేసారు. ఈ ఏడాది జూలై 21 వరకూ ఐదు ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాల్లో 183 సాంకేతిక లోపాలను గుర్తించినట్టు కేంద్రం ఇటీవల లోక్‌సభలో ప్రకటించింది. ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ కలిసి 85 సాంకేతిక లోపాలను ఎదుర్కోగా, ఇండిగో, అకస ఎయిర్‌లో 62, 28 సాంకేతిక లోపాలను గుర్తించారు. స్పైస్ జెట్‌లో 8 సార్లు సాంకేతిక లోపాలను గుర్తించారు. 2024లో 421 సార్లు సాంకేతిక లోపాలు తలెత్తగా, 2023లో 448 సార్లు, 2022లో 528 సార్లు, 2021లో 514 సార్లు సాంకేతిక లోపాలు తలెత్తాయి.
ఇవి కూడా చదవండి..
ఆపరేషన్ సిందూర్‌పై పార్లమెంటులో 32 గంటలు చర్చ: కేంద్ర మంత్రి
అప్పుడు తప్పు చేశా, ఇప్పుడు సరిదిద్దుకుంటున్నా: రాహుల్ గాంధీ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి