Train Accident: పట్టాలు తప్పి అగ్గి రేగి.. 18 డీజిల్ ట్యాంకర్లు దగ్ధం
ABN , Publish Date - Jul 14 , 2025 | 04:39 AM
డీజిల్ ట్యాంకర్ల లోడ్‌తో వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పటంతో ట్యాంకర్లు ఒకదానినొకటి ఢీకొని నిప్పంటుకుని భారీ అగ్నిప్రమాదం సంభవించింది...

రూ.12 కోట్ల ఆస్తి నష్టంతమిళనాడులోని తిరువళ్లూరు వద్ద ఘటన
చెన్నై, జూలై 13 (ఆంధ్రజ్యోతి): డీజిల్ ట్యాంకర్ల లోడ్‌తో వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పటంతో ట్యాంకర్లు ఒకదానినొకటి ఢీకొని నిప్పంటుకుని భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 18 ట్యాంకర్లలో ఉన్న 900 టన్నుల డీజిల్ కాలిపోయింది. రూ.12కోట్ల మేరకు ఆస్తినష్టం సంభవించింది. తమిళనాడులోని తిరువళ్లూరు రైల్వేస్టేషన్ సమీపంలో ఆదివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. చెన్నై శివారు ప్రాంతం మనలిలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) సంస్థ నుంచి 52 ట్యాంకర్లలో డీజిల్‌ను నింపుకుని గూడ్స్ రైలు ఆదివారం వేకువజామున కర్ణాటకలోని మైసూరుకు బయలుదేరింది. తిరువళ్లూరు రైల్వేస్టేషన్ దాటగానే రైలింజన్, దాని వెనుకనున్న మూడవ ట్యాంకర్, దాని తర్వాత మరో రెండు ట్యాంకర్లు పట్టాలు తప్పాయి. 70 వేల లీటర్ల సామ ర్థ్యం కలిగిన డీజిల్ ట్యాంకర్లు ఒకదానినొకటి ఢీకొనడంతో ఆ రాపిడికి నిప్పురవ్వలు చెలరేగి పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగ వెలువడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకుని సుమారు ఏడు గంటలు శ్రమించి మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదం కారణంగా ఆ రైలు మార్గంలోని సిగ్నల్ బోర్డులు, విద్యుత్ వైర్లు దెబ్బతిన్నాయి.