Share News

Sleeping Tips: రాత్రి లైట్లు ఆఫ్ చేసి పడుకోవాలా.. చీకట్లో నిద్రపోతే మంచిదా..

ABN , Publish Date - Apr 22 , 2025 | 12:32 PM

Easy Sleeping Tips: నిద్ర ఆరోగ్యానికి చాలా ముఖ్యం. తగినంత సమయం నిద్రపోవడంతో పాటు ఎలాంటి వాతావరణంలో నిద్రపోతున్నామనేది ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కొందరు రాత్రిళ్లు లైట్లు లేనిదే నిద్రపట్టదని కంప్లైంట్ చేస్తే.. మరికొందరేమో చీకట్లోనే నిద్రపోయేందుకు ఇష్టపడతారు. చీకట్లో నిద్రిస్తే నిమిషాల్లోనే నిద్ర పడుతుందా.. ఇంతకీ, ఏ పద్ధతి కరెక్ట్.

Sleeping Tips: రాత్రి లైట్లు ఆఫ్ చేసి పడుకోవాలా.. చీకట్లో నిద్రపోతే మంచిదా..
Easy Sleeping Tips

Benefits Of Sleeepig In Darkness: మంచి జీవనశైలికి తోడు సరైన నిద్ర ఉంటే ఆరోగ్యానికి ఢోకా ఉండదు. అలసిన శరీరానికి నిద్రే సహజ టానిక్. కానీ, ఈ రోజుల్లో బిజీ లైఫ్, అధిక ఒత్తిడి కారణంగా నిద్రలేని రాత్రులు గడిపే వారి సంఖ్య పెరుగుతోంది. ఎంత ప్రయత్నించినా ఏ రెండు మూడు గంటలకో గానీ కునుకు పట్టదు. దీని వల్ల తలంతా బరువుగా, అలసిపోయినట్లు అనిపిస్తుంది. దినచర్యని ఉత్సాహంగా ప్రారంభించలేరు. తప్పుడు పద్ధతిలో నిద్రపోవడం కూడా నిద్రలేమికి కారణం కావచ్చు. ఎందుకంటే, రాత్రిపూట కొంతమంది లైట్లు వేసుకునే నిద్రపోతారు. మరి, ఈ అలవాటుకు నిద్రపట్టకపోవడానికి సంబంధం ఏమిటి.. చీకట్లోనే ఎందుకు నిద్రపోవాలి..


రాత్రి పడుకునే ముందు లైట్లు ఎందుకు ఆఫ్ చేయాలి?

రాత్రి నిద్రపోతున్నప్పుడు కాంతి లేదా మసక వెలుతురు నిద్ర హార్మోన్ మెలటోనిన్ ఉత్పత్తిని నిరోధిస్తుంది. ఈ లైటింగ్ మీ శరీరంలోని స్లీపింగ్ సైకిల్ కు అంతరాయం కలిగిస్తుంది. దీనివల్ల నిద్ర నాణ్యత తగ్గిపోయి అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలు వస్తాయి. సరిగ్గా నిద్రపోకపోతేనే మధుమేహం, ఊబకాయం, అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.


చీకట్లో ఎందుకు నిద్రపోవాలి?

చీకటిలో నిద్రపోవడం వల్లే మెలటోనిన్ హార్మోన్ సరైన మొత్తంలో ఉత్పత్తి అయ్యి త్వరగా నిద్రపడుతుంది. గాఢంగా నిద్రపోయేందుకు ఆస్కారం లభిస్తుంది. మన శరీరానికి పూర్తి విశ్రాంతి దొరికి మరుసటి రోజు ఉదయం మెదడు, శరీరం రిఫ్రెష్ అవుతాయి. మంచి నిద్ర ఉంటే ఒత్తిడి తగ్గి మనసు తేలికపడుతుంది. మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుంది. ఇంకా చీకట్లో పడుకునే ముందు వీలైతే మీరు ధ్యానం కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మనస్సును, శరీరాన్ని ఒక తాటిపైకి తెచ్చేందుకు ఈ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. నిముషాల్లోనే నిద్రపోయేందుకు ఇదొక చక్కటి మార్గం.


ఇవి గుర్తుంచుకోండి?

మంచి నిద్ర కోసం పడుకునే ముందు గదిలోని అన్ని లైట్లు ఆపివేయండి. టీవీ, మొబైల్, ల్యాప్‌టాప్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా ఆఫ్ చేసి దూరంగా పెట్టండి. ఎందుకంటే వాటి నుండి వెలువడే బ్లూ లైట్ నిద్రకు భంగం కలిగిస్తుంది. ఇదే కాకుండా మంచి నిద్ర కోసం వాతావరణానికి అనుగుణంగా గది ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోండి. తేలికపాటి పూల సువాసన, హాయిగొలిపే సంగీతం మంచి నిద్ర పొందడానికి చక్కగా సహాయపడతాయి.


Read Also: Oxygen Plants: ఈ 6 మొక్కలు ఇంట్లో నాటితే ఆరోగ్యం, ఐశ్వర్యం..

Sleep Position: నిద్రపోయే భంగిమకు, ఆరోగ్యానికి లింకేంటి.. ఏ వైపు తిరిగి పడుకుంటే ఏమవుతుంది..

Morning Walk Tips: మార్నింగ్ వాక్‍కు వెళ్లే ముందు ఈ పొరపాట్లు చేయకండి..

Updated Date - Apr 22 , 2025 | 12:36 PM