IRCTC Tour Packages: దేశవ్యాప్తంగా IRCTC వీక్లీ టూర్ ప్యాకేజెస్.. టికెట్ గ్యారెంటీ..
ABN , Publish Date - Jul 08 , 2025 | 01:45 PM
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఇప్పుడు కొత్తగా ప్రయాణికుల కోసం వీక్లీ టూరిజం ప్యాకేజీలను ప్రవేశపెట్టింది. అదీ టికెట్ గ్యారెంటీ హామీతో. టూర్ ప్యాకేజీని బట్టి యాత్రికులు దేశవ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలను దర్శించుకోవచ్చు.

IRCTC Weekly Tour Packages: భారత ప్రభుత్వ సంస్థ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) పర్యాటక ప్రియులకు అదిరిపోయే ఆఫర్ ఇస్తోంది. దేశవ్యాప్తంగా అత్యంత డిమాండ్ ఉన్న పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు వీక్లీ టూర్ ప్యాకేజీలను ప్రకటించింది. ఈ ప్యాకేజీ స్పెషాలిటీ ఏంటంటే.. టికెట్ బుక్ అవదనే ఆందోళన లేకుండా ఏ గమ్యస్థానానికైనా ప్రయాణికులు నిశ్చింతగా చేరుకోవచ్చు. పర్యాటకులు నచ్చిన తేదీల్లో టూర్ ప్లాన్ చేసుకునేందుకు ఈ వీక్లీ ప్యాకేజీ అనుకూలం.
ఈ టూర్ IRCTC వెస్ట్ జోన్ ముంబై నుంచి ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి వైష్ణోదేవి, తిరుపతి, సిమ్లా, ద్వారక ఇలా మొత్తం 20 కి పైగా గమ్యస్థానాలకు వీక్లీ రైలు టూర్ ప్యాకేజీలు అందుబాటులో ఉంటాయి. బుక్ చేసుకున్న ప్రతి ప్రయాణికుడికీ టికెట్ కచ్చితంగా కన్‌ఫర్మ్ అవుతుంది. అదే ఈ వీక్లీ ప్యాకేజీ ప్రత్యేకత. ఇంకా యాత్రలో భాగంగా హోటల్ వసతి, భోజనం, AC, ప్రయాణ బీమా తదితర సౌలభ్యాలు ఉన్నాయి. టికెట్ ధరలు ఒక్కొక్కరికి రూ. 8,599 నుండి ప్రారంభమవుతాయి. ఆన్‌లైన్ లేదా IRCTC ముంబై కార్యాలయంలో 5 రోజుల ముందుగానే బుకింగ్‌లు చేసుకోవచ్చు.
IRCTC వెస్ట్ జోన్ ముంబై నుంచి 20 కి పైగా వీక్లీ టూర్ ప్యాకేజీలు ఉంటాయి. ఈ ప్యాకేజీ భాగంగా సిమ్లా-మనాలి, వైష్ణోదేవి, ఇండోర్, ఉజ్జయిని, హైదరాబాద్, ద్వారక, సోమనాథ్, షిర్డీ, తిరుపతి వంటి ప్రసిద్ధ తీర్థయాత్రలు, ప్రముఖ పర్యాటక ప్రాంతాలను చుట్టేయవచ్చు.
IRCTC వీక్లీ టూర్ ప్యాకేజీలో దర్శించే వివిధ పర్యాటక ప్రదేశాలు:
ఆధ్యాత్మిక గమ్యస్థానాలు: వైష్ణోదేవి, తిరుపతి, మహాకాళేశ్వర్, ద్వారకాధీష్ ఆలయం, హైదరాబాద్, సోమనాథ్, షిర్డీ, కొల్హాపూర్, కెవాడియా, ఓంకారేశ్వర్, గ్వాలియర్, మహాలక్ష్మి ఆలయం ఇతరాలు.
చారిత్రక, పర్యాటక ప్రదేశాలు: కుఫ్రి, మాల్ రోడ్ (సిమ్లా), అజంతా–ఎల్లోరా గుహలు, ఖజురహో దేవాలయాలు, రాజ్‌వాడ ప్యాలెస్, జై విలాస్ ప్యాలెస్ సహా మరిన్ని.
వీక్లీ టూర్ ప్యాకేజీ వివరాలు:
స్లీపర్, 3AC, లేదా 2AC కోచ్‌లలో ప్రయాణం(టికెట్ గ్యారెంటీ హామీతో)
డీలక్స్ హోటళ్లలో వసతి
స్థానిక రవాణా, ప్రయాణం కోసం AC వాహనాలు
టూర్ ప్లాన్ ప్రకారం భోజనం సదుపాయలు
ప్రయాణ భీమా
టికెట్ ధరలు ఒక్కొక్కరికి కేవలం రూ. 8,599 నుంచి ప్రారంభం (ట్విన్ షేరింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది)
మరొక ముఖ్య విషయం ఏంటంటే ప్రయాణీకులు ముంబై నుంచి టూర్ ప్లాన్ ప్రకారం ఎంపిక చేసిన మార్గమధ్యంలోని స్టేషన్లలో రైలు ఎక్కవచ్చు.
IRCTC వీక్లీ టూర్ ద్వారా అతి తక్కువ ఖర్చుతోనే ప్రయాణికులు కుటుంబాలతో కలిసి దేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శించవచ్చు. టూర్ డిపార్చర్లు వారంలోని వివిధ రోజులలో అందుబాటులో ఉంటాయి. ప్రయాణానికి 5 రోజుల ముందు వరకూ బుకింగ్‌లు చేసుకోవచ్చు. చివరి నిమిషంలో ప్లాన్ చేసుకునే వారికైనా టికెట్ లభిస్తుంది. ఈ ప్యాకేజీ యాత్రికులతో పాటు సాధారణ ప్రయాణీకులకు అనువైనది.
Also Read:
IRCTC స్పెషల్ టూర్ ప్యాకేజీ... 17 రోజుల్లోనే 30 రామక్షేత్రాలు చూసే ఛాన్స్..
బస్సులో మీ లగేజీ మరిచిపోయారా.. టెన్షన్ పడకండి.. ఇలా చేస్తే చాలు..
For More Lifestyle News