Daily Habits For Happy Life: రోజూ ఈ 5 పనులు చేస్తే.. 90% సమస్యలు సాల్వ్..
ABN , Publish Date - Jul 24 , 2025 | 01:58 PM
చాలా సార్లు మనం చిన్న చిన్న విషయాలను తేలిగ్గా తీసుకుంటాం. కానీ, అవే పోను పోను అతి పెద్ద సమస్యగా తయారై మనకు సవాల్ విసురుతాయి. అలాంటి పరిస్థితులు రాకూడదంటే ప్రతిఒక్కరూ దైనందిన జీవితంలో ఈ 5 పనులనూ భాగం చేసుకోండి. ఈ చిన్నపాటి మార్పులే జీవితంలో 90 శాతం సమస్యలను దూరం చేస్తాయి.

మీరు మీ జీవితంతో సంతోషంగా ఉన్నారా? ఈ ప్రశ్న ఎవరిని అడిగినా తమ జీవితానికి సంబంధించిన పెద్ద సమస్యల చిట్టానే విప్పుతారు. దాదాపు ప్రతి ఒక్కరూ తాము గడుపుతున్న లైఫ్ గురించి అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉంటారు. ఆనందం కంటే బాధే ఎక్కువ ఫేస్ చేస్తున్నామని అభిప్రాయపడుతుంటారు. నిజానికి, సంతోషం, విచారం రెండూ జీవితంలో భాగమే. నచ్చినా నచ్చకపోయినా కొన్ని బాధకర సంఘటనలు ఎదుర్కొవాల్సి వస్తుంది. కానీ, జీవితంలో చాలా సమస్యలను మనకు మనమే సృష్టించుకుంటామని మీకు తెలుసా..? చాలా సార్లు మనం చిన్న చిన్న విషయాలను తేలిగ్గా తీసుకుంటాం. కానీ, అవే పోను పోను అతి పెద్ద సమస్యగా తయారై మనకు సవాల్ విసురుతాయి. అలాంటి పరిస్థితులు రాకూడదంటే ప్రతిఒక్కరూ దైనందిన జీవితంలో ఈ 5 పనులనూ భాగం చేసుకోండి. ఈ చిన్నపాటి మార్పులే జీవితంలో 90 శాతం సమస్యలను దూరం చేస్తాయి.
ఉదయం త్వరగా నిద్రలేవడం
ఉదయాన్నే నిద్ర లేస్తే అంతా బాగుంటుందని పెద్దలు చెప్పడం వినే ఉంటారు. ఇది పూర్తిగా నిజం. చాలా మంది విజయవంతమైన వ్యక్తుల దినచర్యను పరిశీలిస్తే.. ఉదయాన్నే నిద్రలేచే అలవాటు తప్పకుండా కనిపిస్తుంది. ఎందుకంటే, ఉదయాన్నే నిద్ర మేల్కొంటే ఆ రోజుపై మనకు పూర్తి నియంత్రణ ఉంటుంది. తొందరపడకుండా రోజును హాయిగా ప్లాన్ చేసుకోగలుగుతారు. అందువల్ల ఉత్సాహంగా ఉంటూ మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు.
స్క్రీన్ సమయాన్ని తగ్గించండి
ఈ రోజుల్లో మనం రోజులో సగానికి పైగా సమయాన్ని ఫోన్, ల్యాప్‌టాప్ లేదా టీవీ స్క్రీన్ ముందు గడుపుతున్నాం. ఇందులో పని గంటలు తక్కువగా ఉంటాయి. పనికిరాని సమయం ఎక్కువగా ఉంటుంది. స్క్రీన్ ముందు ఎక్కువ సమయం గడుపుతున్న కొద్దీ అసంతృప్తి, నిరాశా పెరిగిపోతుంటాయి. గంటల తరబడి మొబైల్ ముందు కూర్చోవడం వల్ల కుటుంబంతో బంధం చెడిపోతుంది. స్లీపింగ్ సైకిల్ చెదిరిపోతుంది. సమయం కూడా వృథా అయ్యే కొద్దీ ప్రతికూల ఆలోచనలు వస్తాయి. దీనికి బదులుగా మంచి పుస్తకం చదవండి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో మాట్లాడండి. మీ జీవితాన్ని ప్లాన్ చేసుకోండియ. సంతోషంగా ఉంటారు.
శారీరక శ్రమ
బిజీ జీవనశైలి కారణంగా ప్రజలు తమ ఆరోగ్యానికి కొంచెం సమయం కూడా ఇవ్వరు. తరువాత ఆరోగ్యం క్షీణిస్తుంది. పెరుగుతున్న ఊబకాయం వారిని ఇబ్బంది పెడుతుంది. అందుకే ప్రతిరోజూ శరీరానికి కనీసం అరగంట సమయం ఇవ్వడం ముఖ్యం. మీరు తేలికపాటి నడక లేదా స్ట్రెచింగ్ కూడా చేయవచ్చు. శారీరక శ్రమ మిమ్మల్ని ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంచడంలో సహాయపడటమే కాకుండా మానసిక స్థితి, హార్మోన్లు, ఒత్తిడి స్థాయిని సమతుల్యం చేస్తుంది.
మీతో మీరు గడపండి
పనికి సమయం కేటాయిస్తారు. కుటుంబం కోసం సమయం కేటాయిస్తారు. కానీ మీ కోసం మీరు ఎప్పుడైనా సమయం కేటాయించుకున్నారా? చివరిసారిగా ఏకాంతంగా ఎప్పుడు గడిపారో గుర్తులేని పరిస్థితుల్లో ఉంటే మీకు మీరు అన్యాయం చేసుకుంటున్నట్లే. ఎందుకంటే మనతో మనం కనెక్ట్ అవ్వనంత వరకు వేరే ఎవరితోనూ సంతోషంగా ఉండలేం. అందుకే ప్రతిరోజూ ఒంటరిగా కొంత సమయం గడపడం మంచిది. ఒక కప్పు టీ తాగడం, ఇష్టమైన పని చేయడం ముఖ్యం. అది ఒక హాబీ కావచ్చు లేదా మనలో మనం మాట్లాడుకోవచ్చు. మొత్తమ్మీద ఆనందం కలిగించే ఏ పనైనా చేయవచ్చు.
ఇతరులతో పోలిక
ఇతరులతో పోల్చుకోవడం మానేయనంత వరకు మీరు సంతోషంగా ఉండలేరు. జీవితంలో ముందుకు సాగలేరు. ప్రతి ఒక్కరి జీవిత ప్రయాణం భిన్నంగా ఉంటుందని అర్థం చేసుకోవాలి. మీకు పైకి కనిపించేంది ఒకటి ఉండవచ్చు. దాని వెనుక ఉన్న వాస్తవం మీ అవగాహనకు చాలా భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఇతరులను చూసి సంతోషంగా ఉండండి తప్ప పోల్చుకోకండి. ఈ రోజు కంటే రేపు మెరుగ్గా ఎలా ఉండాలి అనేదానిపై దృష్టి పెట్టండి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)