Cyber Crime: సైబర్ పోలీస్, మహిళా ఎస్సై.. ఇద్దరూ దొంగలే
ABN , Publish Date - Jul 24 , 2025 | 03:58 AM
దొంగల నుంచి ప్రజల్ని రక్షించాల్సిన ఎస్సై దొంగతనానికి తెగబడ్డాడు. ఆయన ప్రియురాలైన మహిళా ఎస్సై ఈ పనిలో ఆయనకు సహకరించింది.

రూ.2 కోట్లతో జంట పరార్.. పట్టుకున్న పోలీసులు
న్యూఢిల్లీ, జూలై 23: దొంగల నుంచి ప్రజల్ని రక్షించాల్సిన ఎస్సై దొంగతనానికి తెగబడ్డాడు. ఆయన ప్రియురాలైన మహిళా ఎస్సై ఈ పనిలో ఆయనకు సహకరించింది. ఇద్దరూ కలిసి దొంగసొమ్ముతో టూర్లకు వెళ్లారు. చివరికి పట్టుబడటంతో వారి అక్రమాలు బయటకొచ్చాయి. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. ఢిల్లీ పోలీస్ సైబర్ విభాగానికి చెందిన ఓ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా పని చేసే అంకుర్ మాలిక్.. సైబర్ నేరాల్లో జప్తు చేసిన నగదును కోర్టుకు అక్రమ పత్రాలు సమర్పించి తనకు తెలిసిన వాళ్ల ఖాతాల్లోకి మళ్లింపజేసేవాడు. అనంతరం వారి ఖాతాల్లోంచి ఆ డబ్బు తీసుకునేవాడు.
ఇలా దాదాపు రూ.2 కోట్లు కొల్లగొట్టాడు. ఈ పనిలో ఆయన ప్రియురాలైన నేహాపూనియా అనే మహిళా ఎస్సై సహకరించేది. నేహా ఢిల్లీలోనే మరో పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తోంది. వివాహితులైన వీరిద్దరికీ కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. ఇటీవల వీరు వారం సెలవుపెట్టి గోవా, మనాలీ, జమ్మూకశ్మీర్‌ల టూర్‌కు వెళ్లారు. ఎంతకీ తిరిగిరాకపోవడంతో అనుమానం వచ్చిన అధికారులు దర్యాప్తునకు ఆదేశించగా.. ఈ జంట మధ్యప్రదేశ్ ఇండోర్‌లో ఉన్నట్లు తెలిసింది. చేతిలోని డబ్బుతో, కొత్త పేర్లు పెట్టుకొని అక్కడే స్థిరపడాలని వీరు నిర్ణయించుకున్నారు. పోలీసులు వారి ఆచూకీ గుర్తించి పట్టుకోవటంతో గుట్టురట్టయింది. ఇద్దరినీ అరెస్టు చేసి జైలుకు తరలించారు.