Share News

Black Magic: పుట్టింటికి వెళ్లిపోయిన భార్య తిరిగి రావాలని నరబలి

ABN , Publish Date - Jul 24 , 2025 | 03:53 AM

తనను వదిలి పుట్టింటికి వెళ్లిపోయిన భార్యను తిరిగి రప్పించుకునేందుకు రాజస్థాన్‌కు చెందిన ఓ భర్త నరబలి ఇచ్చాడు. ఓ మంత్రగాడి మాటలు నమ్మి.. అన్న కొడుకుని హతమార్చాడు.

Black Magic: పుట్టింటికి వెళ్లిపోయిన భార్య తిరిగి రావాలని నరబలి

  • ఆరేళ్ల బాలుడిని హతమార్చిన భర్త..

  • రాజస్థాన్‌లో ఘోరం

జైపూర్‌: తనను వదిలి పుట్టింటికి వెళ్లిపోయిన భార్యను తిరిగి రప్పించుకునేందుకు రాజస్థాన్‌కు చెందిన ఓ భర్త నరబలి ఇచ్చాడు. ఓ మంత్రగాడి మాటలు నమ్మి.. అన్న కొడుకుని హతమార్చాడు. రాజస్థాన్‌లోని సరయకళ గ్రామంలో జూలై 19న ఈ దారుణం జరిగింది. సరయకళకు చెందిన మనోజ్‌ ప్రజాపత్‌ మద్యానికి బానిసై భార్యను వేధిస్తుండేవాడు. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య తన వద్దకు తిరిగి వచ్చేందుకు ఏం చేయాలంటూ సునీల్‌కుమార్‌(38)అనే మంత్రగాడిని మనోజ్‌ సంప్రదించాడు. కాళీమాతకు ఓ చిన్నారిని బలిచ్చి, ఆ చిన్నారి రక్తం, గుండెతో పూజ చేస్తే నీ భార్య నీ వశం అవుతుందని సునీల్‌ సూచించాడు.


జూలై 19న పూజ చేయాలని, తనకు రూ.12వేలు ఇవ్వాలని చెప్పాడు. మనోజ్‌ తన అన్నకుమారుడు లోకేశ్‌(6)ను బలి ఇవ్వాలనుకున్నాడు. ఈ క్రమంలో 19న లోకేశ్‌ను మనోజ్‌ ఎత్తుకెళ్లాడు. ఓ పాడుబడిన ఇంట్లోకి తీసుకెళ్లి పీక కోసి చంపేశాడు. అనంతరం ఆ బాలుడి శరీరంలోని వివిధ భాగాల నుంచి సిరంజితో రక్తం తీసి మృతదేహంపై గడ్డి వేసి వెళ్లిపోయాడు. అయితే, కుటుంబసభ్యులు అదే రోజు రాత్రి మృతదేహాన్ని గుర్తించారు. బాలుడి సోదరి ఇచ్చిన సమాచారంతో పోలీసులు మనోజ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన ఘోరాన్ని బయటపెట్టాడు. మనోజ్‌, మాంత్రికుడును పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.

Updated Date - Jul 24 , 2025 | 12:39 PM