Mysterious Indian Places: శాస్త్రాన్ని ఆశ్చర్యపరిచే దేశంలోని 5 ఆధ్యాత్మిక ప్రదేశాల గురించి తెలుసా
ABN , Publish Date - Aug 03 , 2025 | 07:40 AM
మన దేశంలో కొన్ని అద్భుతమైన ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ సైన్స్ కూడా ఎలా సాధ్యమని ఆశ్చర్యపోతుంది. ఈ స్థలాలు కేవలం ఆధ్యాత్మికమే కాదు, శాస్త్రవేత్తల పరిశోధనకు కూడా ఆసక్తికరంగా మారాయి. అవి ఎక్కడ ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

మన దేశంలో అనేక అరుదైన ప్రాంతాలు ఉన్నాయి. కొన్ని ప్రదేశాలు చూడగానే మనకు ఆశ్చర్యం (Mysterious Indian Places) కలుగుతుంది. ఈ స్థలాలు కేవలం ఆధ్యాత్మికతతోనే కాదు, శాస్త్రీయంగా కూడా ఆసక్తికరంగా మారాయి. శతాబ్దాలుగా మన పూర్వీకులు నిర్మించిన ఈ నిర్మాణాలు, ప్రకృతి రహస్యాలతో శాస్త్రవేత్తల అంచనాలకు కూడా అందడం లేదు. ఇలాంటి ప్రత్యేకతలతో ఉన్న ప్రాంతాలు మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కనిపిస్తాయి. ఆ ప్రదేశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
1. శని శింగనాపూర్, మహారాష్ట్ర
శని శింగనాపూర్ గ్రామంలో ఇళ్లకు తాళాలు వేయరు. ఎందుకంటే, ఇక్కడ శని దేవుడు తమను రక్షిస్తాడని స్థానికుల విశ్వాసం. దొంగతనాలు లేకపోవడమే కాదు, ఈ గ్రామంలో దైవశక్తి ఉందని వాళ్ల నమ్మకం. దశాబ్దాలుగా ఈ విశ్వాసం కొనసాగుతోంది. అలాంటి ఈ గ్రామాన్ని ఓసారి సందర్శించండి మరి.
2. లేపాక్షి హ్యాంగింగ్ పిల్లర్, ఆంధ్రప్రదేశ్
లేపాక్షిలో 16వ శతాబ్దంలో నిర్మించిన ఒక రాతి స్తంభం నేలను తాకకుండా వేలాడుతోంది. దీని కింద సన్నటి గుడ్డ, కాగితం సులభంగా అటుఇటుగా జారిపోతాయి. ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు దీన్ని పరిశీలించారు, కానీ దీని రహస్యం తేలలేదు. ఈ అద్భుతాన్ని చూడాలంటే మాత్రం లేపాక్షి వెళ్లి తీరాలి.
3. కామాఖ్య ఆలయం, అస్సాం
అస్సాంలోని కామాఖ్య ఆలయం ఒక దైవిక శక్తి కేంద్రంగా ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం మూడు రోజుల పాటు ఆలయం మూసివేస్తారు. ఎందుకంటే దేవతకు రజస్వల కాలమని భక్తుల నమ్మకం. ఆ సమయంలో సమీపంలోని నది ఎర్రగా మారుతుంది. దీన్ని సైన్స్ సహజ సిద్ధాంతంగా చెప్పినా, భక్తులు దీన్ని దైవిక శక్తిగా భావిస్తారు.
4. జ్వాలా జీ ఆలయం, హిమాచల్ ప్రదేశ్
హిమాచల్ ప్రదేశ్‌లోని జ్వాలా జీ ఆలయంలో రాళ్ల నుంచి నిరంతరం మంటలు వస్తాయి. ఎటువంటి ఇంధనం, చమురు, లేదా కట్టెలు లేకుండా.. ఏ ఋతువులోనైనా ఈ మంటలు వస్తుంటాయి. ఈ అద్భుతాన్ని చూస్తే, మీరు కూడా దైవశక్తిని నమ్మక తప్పదు. ఈ ఆలయం సందర్శన మీకు ఒక మరపురాని అనుభవాన్ని అందిస్తుంది.
5. కైలాస ఆలయం, ఎల్లోరా
ఎల్లోరాలోని కైలాస ఆలయం కేవలం నిర్మాణం మాత్రమే కాదు, ఒకే రాతి నుంచి చెక్కిన అద్భుతం. సిమెంట్, జిగురు, యంత్రాలు లేకుండా ఈ ఆలయం నిర్మితమైంది. శాస్త్రవేత్తలు దీన్ని సహజ అద్భుతంగా చెప్పినా, భక్తులు దీన్ని దైవశక్తిగా నమ్ముతారు. ఈ అద్భుత ఆలయాన్ని చూసేందుకు ఎల్లోరా చేరుకోవాలి. ఈ అద్భుతమైన స్థలాలు సైన్స్‌కు సవాలు విసురుతూ, దైవిక శక్తిని అనుభవించే అవకాశాన్ని ఇస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి