US Imposes Tariff: భారత్‌పై అమెరికా భారీ సుంకం.. ఈ వస్తువులకు చుక్కలు చూపించనున్న టారిఫ్
ABN , Publish Date - Jul 31 , 2025 | 08:49 AM
భారతదేశంపై అమెరికా 25% సుంకాన్ని విధించేందుకు సిద్ధమైంది. ఈ సుంకం వల్ల భారతదేశం నుంచి అమెరికాకు ఎగుమతవుతున్న పలు కీలక వస్తువులపై ప్రత్యక్ష ప్రభావం చూపనుంది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై 25% సుంకం విధించనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం ఆగస్టు 1 నుంచి అమలులోకి వస్తుంది. ట్రంప్ తన లిబరేషన్ డే వాణిజ్య వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యూహం అమెరికా వాణిజ్య భాగస్వామ్యాలను పరస్పర ప్రయోజనాల దిశగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది.
ట్రంప్ ఏమన్నారు?
ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్రూత్ సోషల్‌లో ఈ విషయాన్ని ప్రకటించారు. భారతదేశం మన స్నేహ దేశం అయినప్పటికీ, వారి సుంకాలు చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారతదేశం ఒకటని ప్రస్తావించారు. అంతేకాక ఇండియా రష్యా నుంచి సైనిక సామగ్రి, ఇంధనాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారని, ఇది ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలనే అంతర్జాతీయ లక్ష్యానికి వ్యతిరేకమన్నారు. అందుకే భారతదేశంపై 25% సుంకం విధిస్తున్నట్లు చెప్పారు. అదనంగా, రష్యాతో వాణిజ్యం కారణంగా ఒక జరిమానా కూడా విధించబడుతుందని ట్రంప్ అన్నారు.
భారతదేశం ఏమన్నది?
భారత వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ సుంకం గురించి ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికా అధ్యక్షుడి ప్రకటనను గమనించాము. దీని ప్రభావాన్ని అధ్యయనం చేస్తున్నామని తెలిపింది. భారతదేశం, అమెరికా మధ్య న్యాయమైన వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నాయన్నారు. రైతులు, వ్యాపారవేత్తలు, చిన్న తరహా పరిశ్రమల (MSME) ప్రయోజనాలను కాపాడటం ప్రభుత్వ లక్ష్యమని తెలిపింది. జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
భారతదేశంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
ఈ 25% సుంకాల ప్రభావం సముద్ర ఉత్పత్తులు, ఔషధాలు, వస్త్రాలు, రత్నాలు, ఆభరణాలు, తోలు, ఆటోమొబైల్ రంగాలపై పడుతుంది. అయితే, ఆగస్టు చివరిలో అమెరికా బృందం భారతదేశానికి రానుంది. ఈ చర్చల ద్వారా సమగ్ర వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఔషధ రంగం, ఇనుము, ఉక్కు, ఆటోమొబైల్ వంటి రంగాలపై సుంకం వివరాలు ఇంకా స్పష్టంగా లేవు. అమెరికాకు భారత ఔషధ ఎగుమతులు 30% కంటే ఎక్కువ.
ఎగుమతులు పోటీతత్వం కోల్పోతాయా?
భారతదేశం ఆసియా పొరుగు దేశాలైన జపాన్ (15%), వియత్నాం (20%), ఇండోనేషియా (19%) కంటే ఎక్కువ సుంకం చెల్లించాల్సి ఉంటుంది. ఇది భారత ఎగుమతుల పోటీ తత్వాన్ని దెబ్బతీస్తుంది. ఔషధ రంగంలో భారతదేశం జనరిక్ ఔషధాలను ఎగుమతి చేస్తుంది. యూరప్ దేశాలు ఖరీదైన, బ్రాండెడ్ ఔషధాలను ఎగుమతి చేస్తాయి. అందువల్ల 25% సుంకం భారత ఔషధ ఎగుమతులపై పెద్దగా ప్రభావం చూపక పోవచ్చు. స్మార్ట్‌ఫోన్ ఎగుమతుల విషయంలో కూడా చైనా (30%)తో పోలిస్తే భారతదేశం (25%)పై తక్కువ సుంకం ఉంది.
ఇవి కూడా చదవండి
ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి