Scientists Predict Earthquakes: భూకంపాలను శాస్త్రవేత్తలు ముందుగా అంచనా వేయవచ్చా.. ఏమన్నారంటే..
ABN , Publish Date - Jul 31 , 2025 | 07:27 AM
మనం ఎదుర్కొనే భూకంప సంఘటనలను ముందుగానే అంచనా వేయగలమా? అలాంటి మార్పులను ముందుగా తెలుసుకోవడం సాధ్యమా? ఇలాంటి ప్రమాదాలను పసిగట్టవచ్చా? శాస్త్రవేత్తలు దీని గురించి ఏం చెబుతున్నారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

రష్యా ఫార్ ఈస్టర్న్ కమ్చట్కా తీరంలో జూలై 30న 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం పసిఫిక్ సముద్ర తీరంలో సునామీ హెచ్చరికలను రేకెత్తించింది. దీంతో ఆ పరిధిలోని అనేక దేశాలు అప్రమత్తం కావాల్సి వచ్చింది. ఈ తీవ్రత చరిత్రలో నమోదైన అత్యంత శక్తివంతమైన భూకంపాలలో ఒకటిగా గుర్తించబడింది. ఈ సంఘటనతో భూకంపాలను అంచనా వేయడం సాధ్యమేనా అనే పాత చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది.
అవకాశం ఉందా..
ఈ క్రమంలో దీని భూకంపం కేంద్రం పెట్రోపావ్లోవ్స్క్-కమ్చట్స్కీ నగరం సమీపంలో ఉందని శాస్త్రవేత్తలు (Scientists Predict Earthquakes) తెలిపారు. మరిన్ని పెద్ద ప్రకంపనలు కూడా వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. అయితే అసలు వీటిని ముందుగానే అంచనా వేయడం సాధ్యమేనా. దీని గురించి శాస్త్రవేత్తలు ఏమంటున్నారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గుర్తుచేసే విషాదం
ఇది 2011లో జపాన్‌లో సంభవించిన భయంకరమైన భూకంపం తర్వాత అతి పెద్దదిగా నమోదైంది. 1900 నుంచి ప్రపంచవ్యాప్తంగా నమోదైన నాల్గవ అతిపెద్ద భూకంపంగా గుర్తించబడింది. ఆ సంఘటన సునామీని రేకెత్తించి, ఫుకుషిమా డైచీ అణు విద్యుత్ కేంద్రంలో విపత్తును సృష్టించింది. అధికారిక లెక్కల ప్రకారం 2011 భూకంప సునామీలో దాదాపు 18,500 మంది మరణించారు. కొన్ని అంచనాల ప్రకారం ఈ సంఖ్య 20,000 కంటే ఎక్కువగా ఉండవచ్చు.
భూకంపాలను అంచనా వేయడం సాధ్యమేనా?
యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) శాస్త్రవేత్తల ప్రకారం, భూకంపాలను అంచనా వేయడం సాధ్యం కాదు. ఒక నిర్దిష్ట ప్రాంతం, సమయంలో భూకంపం సంభవించే సంభావ్యతను లెక్కించగలిగినప్పటికీ, కచ్చితమైన తేదీ, సమయం, స్థానం, తీవ్రతను నిర్ధారించడం మాత్రం ప్రస్తుతానికి అసాధ్యమన్నారు.
అంచనా ఎందుకు కష్టం?
భూకంపాలు సంక్లిష్టమైన భౌగోళిక ప్రక్రియల ఫలితంగా సంభవిస్తాయి. వీటిని అర్థం చేసుకోవడం, అంచనా వేయడం చాలా సవాలుగా ఉంటుందని, దీనికి కొన్ని కారణాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూకంపాలు భూమి ఉపరితలం కింద ఉన్న పొరలలో సంభవిస్తాయి. వీటిని కచ్చితంగా గుర్తించడం కష్టం. వాటి లోపల ఒత్తిడి దీర్ఘకాలంగా పేరుకుపోతుంది. ఈ ఒత్తిడి ఎప్పుడు విడుదల అవుతుందో నిర్ధారించడం సాధ్యం కాదు.
ఒకేసారి అర్థం చేసుకోవడం
భూకంపాలు అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయని, వీటిని ఒకేసారి అర్థం చేసుకోవడం కష్టమని శాస్త్రవేత్తలు చెప్పారు. USGS ప్రకారం ఈ రోజు భూకంపం వస్తుందని చెప్పడం నిజంగా భూకంప అంచనా కాదన్నారు. ఎందుకంటే ప్రతి రోజు వేలాది భూకంపాలు సంభవిస్తాయి. కానీ చాలా వరకు గుర్తించబడకుండా చిన్నవిగా ఉంటాయన్నారు.
వీటి గురించి తెలుసుకోవచ్చు
చారిత్రక డేటా, భౌగోళిక పరిశోధనల ఆధారంగా భూకంప అంచనాలను రూపొందిస్తారు. ఇవి ఒక ప్రాంతంలో భూకంపం సంభవించే సంభావ్యతను సూచిస్తాయి. ఇవి భూకంప ప్రమాదాలను తట్టుకునేలా భవన నిర్మాణ నియమాలను రూపొందించడంలో సహాయపడతాయి. భూకంప సమయంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పిస్తారు. ఈ చర్యలు భూకంపాల వల్ల సంభవించే నష్టాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
ఇవి కూడా చదవండి
ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి