Yahya Sinvar: తుర్కియే పారిపోయి మళ్లీ పెళ్లి చేసుకున్న సిన్వర్ భార్య
ABN , Publish Date - Jul 27 , 2025 | 05:13 PM
అబు జమర్ ఫోర్జరీ డాక్యుమెంట్లతో రాఫా సరిహద్దు మీదుగా ఈజిప్టుకు చేరుకుని అక్కడి నుంచి తుర్కియేకు వెళ్లినట్టు మీడియా వర్గాలు తెలిపాయి. అక్కడ ఆమె మరో వివాహం చేసుకుందని, ఇందుకు హమాస్ రాజకీయ బ్యూరోలోని సీనియర్ అధికారి ఫాతీ హమ్మద్ సహకరించాడని పేర్కొన్నాయి.

జెరూసలేం: ఇజ్రాయెల్ దాడిలో హమాస్ మిలటరీ కమాండర్ యాహ్యా సిన్వర్ (Yahya Sinvar) మృతి చెందిన కొన్ని నెలల తర్వాత ఆయన భార్యకు సంబంధించిన ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది. సిన్వర్ భార్య సమర్ మహమ్మద్ అబూ జమర్ (Samar Muhammad Abu Zamar) గాజా నుంచి పారిపోయి తుర్కియే (Turkey) చేరుకుంది. అక్కడ ఆమె మరో వివాహం చేసుకుంది. ఇజ్రాయెల్ వార్తా సంస్థ ఈ విషయం వెల్లడించింది.
అబు జమర్ ఫోర్జరీ డాక్యుమెంట్లతో రాఫా సరిహద్దు మీదుగా ఈజిప్టుకు చేరుకుని అక్కడి నుంచి తుర్కియేకు వెళ్లినట్టు మీడియా వర్గాలు తెలిపాయి. అక్కడ ఆమె మరో వివాహం చేసుకుందని, ఇందుకు హమాస్ రాజకీయ బ్యూరోలోని సీనియర్ అధికారి ఫాతీ హమ్మద్ సహకరించాడని పేర్కొన్నాయి.
గత జనవరిలో అబూ జమర్ తన పిల్లలతో సహా హమాస్ టన్నెల్‌లోకి వెళ్తున్న ఫుటేజ్‌ను ఇజ్రాయెల్ మిలటరీ విడుదల చేసింది. దీంతో ఆమె అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లిపోయిందనే ఊహాగానాలు వెలువడ్డాయి. సిన్వర్ మరణించడంతో ఆమె గాజాను వదిలి తుర్కియే పారిపోయినట్టు తాజా సమాచారం బయటకు వచ్చింది.
కాగా, యాహ్యా సిన్వర్ సోదరుడు మహమ్మద్ సిన్వర్ కూడా ఇజ్రాయెల్ దాడుల్లో మరణించాడు. అప్పట్నించీ ఆయన భార్య నజ్వా సిన్వర్ ఆచూకీ బయటకు రాలేదు. అయితే తమ భర్తలిద్దరూ మరణించడానికి ముందే నజ్వా, అబూ జమర్ కలిసి రాఫా సరిహద్దుల మీదుగా గాజా నుంచి బయటపడినట్టు చెబుతున్నారు. అయితే, ఈ విషయాన్ని హమాస్ అధికారికంగా ధ్రువీకరించ లేదు. ఘర్షణల సమయంలో తమ నాయకుల కుటుంబాలను బయటకు తరలిచేందుకు కోవర్డ్ నెట్‌వర్క్‌ను నడిపించడం హమాస్‌కు అలవాటేనని, ఇందుకోసం పోర్జరీ డాక్యుమెంట్లు, నకలీ మెడికల్ రికార్డులు సృష్టించడం, ఇందుకు మిత్రదేశాల దౌత్య కార్యాలయాల సహకారం తీసుకోవడం జరుగుతుందని ప్రాంతీయ పరిశీలకులు తెలిపారు.
ఇవి కూడా చదవండి...
గాజాపై దాడులకు విరామం.. ఇజ్రాయెల్ కీలక నిర్ణయం
కంబోడియా, థాయ్‌లాండ్ తక్షణం చర్చలు చేపట్టేందుకు రెడీ.. డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన
మరిన్ని అంతర్జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి