Share News

Donald Trump: కంబోడియా, థాయ్‌లాండ్ తక్షణం చర్చలు చేపట్టేందుకు రెడీ.. డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన

ABN , Publish Date - Jul 27 , 2025 | 08:42 AM

కంబోడియా, థాయ్‌లాండ్‌లు తక్షణం కాల్పుల విరమణ చర్చలు చేపట్టేందుకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఘర్షణలు తగ్గించుకోకపోతే అమెరికాతో వాణిజ్యావకాశాలు కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించినట్టు తెలిపారు.

Donald Trump: కంబోడియా, థాయ్‌లాండ్ తక్షణం చర్చలు చేపట్టేందుకు రెడీ.. డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన
Trump Ceasefire Announcement

ఇంటర్నెట్ డెస్క్: థాయ్‌లాండ్, కంబోడియా దేశాధినేతలు కాల్పుల విరమణ చర్చలను తక్షణం ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారని డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ప్రస్తుతం స్కాట్‌లాండ్ పర్యటనలో ఉన్న ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా ఈ పోస్టు పెట్టారు. కంబోడియా ప్రధాని హున్ మానెట్, థాయ్‌లాండ్ ఆపద్ధర్మ ప్రధాని ఫుంథామ్ వెయెయిచాయ్‌తో తాను వేర్వేరుగా సంప్రదింపులు జరిపినట్టు తెలిపారు. ఇరు దేశాల ఘర్షణ ఇలాగే కొనసాగితే అమెరికాతో వాణిజ్యావకాశాలు కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించినట్టు తెలిపారు.

‘ఇరు దేశాలు తక్షణ కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నాయి. అమెరికాతో వాణిజ్య పరమైన చర్చలకు కూడా ఉత్సుకతతో ఉన్నాయి. కానీ వాళ్ల ఘర్షణ సద్దుమణిగే వరకూ వాణిజ్య చర్చలు సబబు కాదని మేము భావిస్తున్నాము. కాబట్టి, తక్షణ కాల్పుల విరమణకు ఇద్దరు రెడీ అయ్యారు. ఇరు దేశాలతో కలిసి పనిచేసే అవకాశం రావడం నాకు గర్వకారణం. అవి గొప్ప చరిత్ర, సంస్కృతి ఉన్న దేశాలు. భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య శాంతి నెలకొని ఉండాలని కోరుకుంటున్నాను. ఇరు దేశాలతో వాణిజ్య ఒప్పందాల కోసం ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్నా’ అని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు.


ట్రంప్ ప్రకటనపై థాయ్‌లాండ్ విదేశాంగ శాఖ ఆచితూచి స్పందించింది. ట్రంప్‌కు ధన్యవాదాలు తెలిపింది. కాల్పుల విరమణకు సూత్రప్రాయంగా మాత్రమే అంగీకరించినట్టు ఆపద్ధర్మ ప్రధాని పేర్కొన్నారు. కంబోడియా కూడా నిజాయతీగా వ్యవహరించాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇక ట్రంప్ ప్రతిపాదనను కంబోడియా ప్రధాని కూడా అంగీకరించినట్టు అక్కడి ప్రభుత్వ సన్నిహిత మీడియా రాసుకొచ్చింది.

ఇరు దేశాల మధ్య 800 కిలోమీటర్ల సరిహద్దు విషయంలో అస్పష్టత తాజా ఘర్షణలకు దారి తీసింది. కొన్ని దశాబ్దాలుగా ఈ వివాదం కొనసాగుతోంది. ముఖ్యంగా రెండు పురాతన హిందూ దేవాలయాల విషయం వివాదాస్పదంగా మారింది. ఈ దేవాలయాలున్న ప్రాంతాన్ని ఇరు దేశాలు తమదిగా ప్రకటించుకున్నాయి. 2011లో జరిగిన ఘర్షణల్లో 20 మృతి చెందారు. మే నెలలో సరిహద్దు వద్ద జరిగిన కాల్పుల్లో ఓ కంబోడియా సైనికుడి మృతితో ఇరు దేశాల మధ్య వివాదం మళ్లీ మొదలైంది. చివరకు యుద్ధ వాతావరణానికి దారి తీసింది. ఈసారి సరిహద్దు వద్ద చెలరేగిన ఘర్షణల్లో 33 మంది కన్నుమూశారు. ఆయా ప్రాంతాల్లోని 1.68 లక్షల మందిని ఇరు దేశాల ప్రభుత్వాలు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.


ఇవి కూడా చదవండి:

వలసలపై ట్రంప్ హెచ్చరికలు.. ఈ ఆక్రమణను అడ్డుకోవాలని ఐరోపా దేశాలకు పిలుపు

హమాస్‌పై మండిపడ్డ ట్రంప్.. వారి పని ముగించేయాలంటూ ఇజ్రాయెల్‌కు సూచన

మరిన్ని అంతర్జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 27 , 2025 | 10:41 AM