New York Shooting: న్యూయార్క్ పార్క్ అవెన్యూలో కాల్పులు.. ఐదుగురు మృతి
ABN , Publish Date - Jul 29 , 2025 | 09:29 AM
అగ్రరాజ్యం అమెరికా న్యూయార్క్‌లో మళ్లీ కాల్పులు కలకలం రేపుతున్నాయి. సోమవారం సాయంత్రం పార్క్ అవెన్యూలో ఉన్న కార్యాలయ భవనంలోకి ఓ దుండగుడు దూసుకొచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.

అమెరికాలో మళ్లీ గన్ కల్చర్ (Shooting) బీభత్సం సృష్టించింది. న్యూయార్క్ నగరంలో (New York Park Avenue) సోమవారం సాయంత్రం 6:30 ప్రాంతంలో మిడ్‌టౌన్ మాన్‌హాటన్‌లో ఉన్న 345 పార్క్ అవెన్యూ వద్ద ఓ దుండగుడు అకస్మాత్తుగా కార్యాలయ భవనంలోకి ప్రవేశించి విచక్షణ లేకుండా తూటాల వర్షం కురిపించాడు. దీంతో ఒక్కసారిగా భయాందోళన చెందిన స్థానిక ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. ఆ ప్రాంతమంతా భయానక వాతావరణంలో కూరుకుపోయింది.
అరుపులు వినిపించడంతో..
ఈ దాడిలో ఐదుగురు అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. బాధితుల్లో ఒకరు ఆఫ్-డ్యూటీ పోలీస్ అధికారి కావడం విచారకరం. న్యూయార్క్ ఫైర్ డిపార్ట్‌మెంట్ (FDNY) ఎమర్జెన్సీ కాల్ ప్రకారం, కాల్పులు మొదలైన సమయంలో భవనంలోని ఉద్యోగులు తమ స్థానాల్లో పనిలో నిమగ్నమై ఉన్నారు. ఆ క్రమంలో అరుపులు వినిపించడంతో అంతా భయభ్రాంతులకు లోనయ్యారు. దీంతో ఉద్యోగులు భయంతో బయటకు పరుగులు తీసిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.
ఐర్లాండ్ కాన్సులేట్ కూడా
ఈ 634 అడుగుల ఎత్తైన ఆకాశహర్మ్యం, న్యూయార్క్‌లో ప్రత్యేక జిప్ కోడ్ కలిగిన అరుదైన భవనాల్లో ఒకటి. ఇందులో బ్లాక్‌స్టోన్, NFL వంటి దిగ్గజ సంస్థలు కార్యాలయాలు కలిగి ఉండగా, ఐర్లాండ్ కాన్సులేట్ కూడా ఇక్కడే ఉంది. ఇది సాధారణ భవనం కాదని, కఠిన భద్రత కలిగిన ప్రదేశమని చెబుతున్నారు. అయినప్పటికీ అతను ఎలా వచ్చాడన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఇంకా అనుమానాస్పదం
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని భవనాన్ని ఖాళీ చేయించారు. కాల్పులు జరిపిన వ్యక్తిపై ఎటాక్ చేయగా అతను మరణించినట్లు తెలుస్తోంది. అతడు నెవాడాకు చెందిన షేన్ తమురాగా గుర్తించారు. అతని దగ్గర లాస్ వెగాస్ నుంచి జారీచేయబడిన కన్సీల్డ్ క్యారీ గన్ లైసెన్స్, ఐడీ కార్డులు లభ్యమయ్యాయి. కానీ అతను ఎందుకు ఈ దాడికి పాల్పడ్డాడన్న దానిపై స్పష్టత రాలేదు.
బాధిత కుటుంబాలకు
మేయర్ ఎరిక్ ఆడమ్స్ స్పందిస్తూ ఈ ఘటనపై స్పందించారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ఈ దాడికి కారణమైన విషయాలను త్వరగా వెలుగులోకి తెస్తామన్నారు. ప్రజలు తమ ఇళ్లలోనే ఉండాలని, ఆ ప్రాంతాన్ని దాటి వెళ్లొద్దని హెచ్చరించారు. ఈ ఘటనపై NYPD, FBI సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నాయి.
న్యూయార్క్ వంటి బిజీ నగరంలో, పీక్ అవర్స్ సమయంలో జరిగిన ఈ కాల్పుల ఘటన మరోసారి అమెరికాలో గన్ కల్చర్ గురించి ప్రస్తావిస్తుంది. భద్రతా సంస్థలు ఎంత చర్యలు తీసుకున్నా, ఇలాంటి దాడులు ఎలా జరుగుతున్నాయో అనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఇవి కూడా చదవండి
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
కస్టమర్ల ఖాతాల నుంచి కోట్ల రూపాయల దోపిడీ.. పరారీలో ఎస్‌బీఐ క్లర్క్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి