US: భారీ ప్రమాదం.. మంటల్లో కాలిపోయిన విమానం.. వీడియో వైరల్..
ABN , Publish Date - Apr 22 , 2025 | 08:28 AM
అమెరికాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. టేకాఫ్ అవుతుండగా విమానంలో మంటలు చెలరేగుతున్న దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

US Delta Airlines Fire Accident: అమెరికాలోని ఓర్లాండో విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వందల మంది ప్రయాణిస్తున్న డెల్టా ఎయిర్‌లైన్స్ విమానం టేకాఫ్ అయ్యేటప్పుడు హఠాత్తుగా భారీ ఎత్తున మంటలు చెలరేగాయి.విమానం కుడి ఇంజిన్‌లో మంటలు చెలరేగి నల్లటి పొగ బయటికి ఎగసిపడుతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఓర్లాండో నుంచి అట్లాంటాకు బయలుదేరడానికి సిద్ధమవుతుండగా మంటలు చెలరేగినట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు.
అమెరికా దేశం ఫ్లోరిడా రాష్ట్రంలోని ఓర్లాండో విమానాశ్రయంలో డెల్టా ఎయిర్‌లైన్స్ A330 మంటల్లో చిక్కుకుంది. సోమవారం తెల్లవారుజామున 282 మంది ప్రయాణికులు, 10 మంది విమాన సిబ్బంది, ఇద్దరు పైలట్లతో ఓర్లాండో నుండి అట్లాంటాకు బయలుదేరడానికి సిద్ధమవుతున్న విమానం ఇంజన్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ఎయిర్‌క్రాఫ్ట్ రెస్క్యూ & ఫైర్ ఫైటింగ్ బృందం వెంటనే రంగంలోకి దిగి అత్యవసర స్లయిడ్‌ల ద్వారా ప్రయాణీకులు, సిబ్బందిని బయటకు తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని, ప్రాణ నష్టం జరగలేదని డెల్టా ఎయిర్‌లైన్స్ తెలిపింది. విమానం గాల్లోకి లేవకముందే మంటలు చెలరేగడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని విమానాశ్రయ అధికారులు తెలిపారు.
ప్రమాదం అనంతరం ఓర్లాండో అంతర్జాతీయ విమానాశ్రయం సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. “ఈరోజు ఉదయం 11:06 గంటలకు డెల్టా ఎయిర్ లైన్స్ విమానం 1213 బయలుదేరే ముందు ర్యాంప్ ప్రాంతంలో ఉండగా ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. ఎయిర్‌క్రాఫ్ట్ రెస్క్యూ & ఫైర్ ఫైటింగ్ బృందం వెంటనే స్పందించి ప్రయాణీకులను ఖాళీ చేయించారు. విచారణ కోసం దయచేసి డెల్టా ఎయిర్ లైన్స్‌ను నేరుగా సంప్రదించండి.” అని పేర్కొంది. కస్టమర్లకు అసౌకర్యం కలిగినా సహకరించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ.. వీలైనంత త్వరగా వారిని గమ్యస్థానాలకు చేర్చేందుకు కృషి చేస్తామని డెల్టా ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది.
Read Also: Fake Notes: 500 నోట్లతో జాగ్రత్త
Zeeshan Siddique: బాబా సిద్ధిఖీ తర్వాత జీషన్ టార్గెట్..నీ తండ్రిలాగే నిన్ను చంపేస్తామని బెదిరింపు
Oil Overload India: వంట నూనె తాగేస్తున్నాం