Trump: భారతీయులను ఉద్యోగాల్లోకి తీసుకోకండి: డోనాల్డ్ ట్రంప్
ABN , Publish Date - Jul 24 , 2025 | 03:35 PM
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారతీయులపై మరోసారి తన అసహనాన్ని వెళ్ళగక్కారు. భారతీయ ఉద్యోగులను నియమించుకోవద్దంటూ యూఎస్ దిగ్గజ కంపెనీలకు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు.

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో ఉదారమైన ప్రయోజనాలను పొందుతూ చైనాలో కర్మాగారాలను నిర్మిస్తున్నాయని అమెరికా దిగ్గజ కంపెనీలపై డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ సహా కొన్ని కంపెనీలు అక్కడ భారత్ నుంచి ఉద్యోగులను నియమించుకుంటున్నాయని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనాలో తమ పరిశ్రమలను నిర్మించడం, అక్కడ భారత్ కు చెందిన కార్మికులను నియమించుకోవడం ద్వారా సదరు అమెరికా కంపెనీలు అమెరికన్ల విశ్వాసాన్ని కోల్పోయాయని అన్నారు. వాషింగ్టన్ లో జరిగిన ఏఐ సమ్మిట్ కు హాజరైన పలు అమెరికా టెక్ కంపెనీలను ఉద్దేశిస్తూ చేసిన ప్రసంగంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
తన హయాంలో ఇక ఆ రోజులు ముగిసిపోయినట్టేనని చెప్పిన ట్రంప్.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేసులో గెలవడానికి దేశభక్తి కావాలన్నారు. ఏఐ రంగంలో అమెరికాను మొదటి స్థానంలో ఉంచాలని టెక్ కంపెనీలను ట్రంప్ కోరారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేసులో విజయం సాధించడానికి సిలికాన్ వ్యాలీ లోపల, వెలుపల కొత్త దేశభక్తి, జాతీయ విధేయత అవసరమని ట్రంప్ సూచించారు. అమెరికా టెక్ పరిశ్రమ చాలా కాలం వరకు రాడికల్ గ్లోబలిజాన్ని అనుసరించిందని.. ఇది మిలియన్ల మంది అమెరికన్లకు అపనమ్మకాన్ని కలిగించిందన్నారు. ఈ సందర్భంగా వైట్ హౌస్ యాక్షన్ ప్లాన్ సహా కృత్రిమ మేధకు సంబంధించిన మూడు కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు.
ఈ సందర్భంగా అమెరికా కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్లూప్రింట్ ను డొనాల్డ్ ట్రంప్ విడుదల చేశారు. కీలక సాంకేతిక పరిజ్ఞానంలో చైనాపై అమెరికా ఆధిపత్యాన్ని కొనసాగించే ప్రయత్నంలో పర్యావరణ నిబంధనలను సడలించడం, మిత్రదేశాలకు కృత్రిమ మేధ ఎగుమతులను విస్తరించడం లక్ష్యంగా ఈ కొత్త కృత్రిమ మేధ(ఏఐ) బ్లూప్రింట్ ను ట్రంప్ విడుదల చేశారు. 21వ శతాబ్దాన్ని.. ఏఐ నిర్వచించే పోరాటంగా అభివర్ణించిన ట్రంప్.. చైనాతో సాంకేతిక ఆయుధ పోటీని వివరిస్తూ ఈ ప్రణాళికను విడుదల చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్.. ఐటీ అధికారుల సోదాలు
సినీ నటుడు రాజీవ్ కనకాలకు హయత్‌నగర్ పోలీసుల నోటీస్
Read latest Telangana News And Telugu News