Share News

LA Protests: రగులుతున్న లాస్ ఏంజెల్స్.. 2 వేల మంది గార్డ్స్‌తో..!

ABN , Publish Date - Jun 10 , 2025 | 11:07 AM

అక్రమ వలసదారుల అరెస్టులతో లాస్ ఏంజెల్స్‌లో అగ్గి రాజుకుంది. వేలాది మంది జనం వీధుల్లోకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో 2 వేల మంది నేషనల్ గార్డులను రంగంలోకి దింపారు ఆ దేశాధ్యక్షుడు ట్రంప్.

LA Protests: రగులుతున్న లాస్ ఏంజెల్స్.. 2 వేల మంది గార్డ్స్‌తో..!

అగ్రరాజ్యం అమెరికాలోని లాస్ ఏంజెల్స్ నగరం నిరసనలతో అట్టుడుకుతోంది. అక్రమ వలసదారుల అరెస్టులతో అక్కడ రాజుకున్న అగ్గి రోజురోజుకీ మరింత తీవ్రరూపం దాల్చుతోంది. మూడో రోజైన ఆదివారం నాడు వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపారు. జాతీయ రహదారిని దిగ్బంధించడమే గాక కార్లకు నిప్పు పెట్టారు. దీంతో చాలా క్యాబ్‌లు అగ్నికి ఆహుతి అయ్యాయి. అల్లర్లను అణచివేసేందుకు 2 వేల మంది నేషనల్ గార్డులను ట్రంప్ సర్కారు మోహరించింది. పోలీసుల రాకతో అక్కడి ప్రజలు మరింత ఆగ్రహావేశాలకు లోనయ్యారు.

la.jpg


వాళ్లను వదలొద్దు..

ఆందోళనకారులను అడ్డుకునేందుకు రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు పోలీసులు. అల్లర్లకు కేంద్ర స్థానంగా ఉన్న డౌన్‌టౌన్‌లోని పలు మార్గాలను దిబ్బంధించారు. ఆందోళనకారుల్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. కానీ అటు నుంచి కాంక్రీట్ ముక్కలు, రాళ్లు విసరడంతో.. తమను తాము కాపాడుకునేందుకు వంతెన కింద దాక్కున్నారు పోలీసులు. పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు నేషనల్ గార్డులను రంగంలోకి దింపామని పేర్కొన్నారు లాస్ ఏంజెల్స్ పోలీసు చీఫ్ మెక్ డొనెల్. డజన్ల కొద్దీ ఆందోళనకారుల్ని అరెస్ట్ చేశామని ఆయన వెల్లడించారు. కాగా, ఫేస్ మాస్కులతో ఉన్న ఆందోళనకారుల్ని అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించారు ట్రంప్.


గార్డ్స్‌కు సాయంగా..

లాస్ ఏంజెల్స్‌లో నిరసనలు జరగడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ పలుమార్లు ఈ నగరాన్ని కేంద్రంగా చేసుకొని భారీ నిరసనలు జరిగాయి. ఈసారి అక్రమ వలసదారుల అరెస్టులతో నగరంలో మరోమారు అగ్గి రాజుకుంది. అయితే పరిస్థితుల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఆ ఏరియాలో భారీ స్థాయిలో నేషనల్ గార్డులను మోహరిస్తున్నారు అధికారులు. ఈ గార్డ్స్‌కు సాయంగా మరో 700 మంది మెరైన్‌లను మోహరించింది పెంటగాన్. ఇమ్మిగ్రేషన్ అధికారులతో పాటు దాని ఆస్తులను సంరక్షించే పనిలో వీళ్లు ఉంటారని పెంటగాన్ ప్రధాన ప్రతినిధి సీన్ పార్నెల్ తెలిపారు.


ఇవీ చదవండి:

పాకిస్తాన్ బుద్ధి మారటం లేదు..

సముద్రంలో కూలిన ప్రైవేటు విమానం

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 10 , 2025 | 11:07 AM