Iran Israel conflict: ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇరాన్ టాప్ ఇంటెలిజెన్స్ చీఫ్ మృతి..
ABN , Publish Date - Jun 16 , 2025 | 09:14 AM
Iran Top Officials Killed in Israel Airstrikes: టెహ్రాన్‌లో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ టాప్ ఇంటెలిజెన్స్ అధికారులు మృతిచెందారు. బ్రిగేడియర్ జనరల్ మొహమ్మద్ కజెమి, డిప్యూటీ చీఫ్ హసన్ మొహాకిక్ ప్రాణాలు కోల్పోయారు.

Iran Intelligence Chief killed: ఇజ్రాయెల్ వరస దాడులతో ఇరాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. తాజాగా టెల్ అవీవ్ జరిపిన గగనతల దాడుల్లో టెహ్రాన్ టాప్ ఇంటెలిజెన్స్ అధికారులను కోల్పోయింది. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఇంటెలిజెన్స్ చీఫ్ బ్రిగేడియర్ జనరల్ మొహమ్మద్ కజెమి, డిప్యూటీ జనరల్ హసన్ మొహాకిక్ దుర్మరణం పాలయ్యారు. ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ మీడియా IRNA ధృవీకరించినట్లు 'ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్' పేర్కొంది.
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్‌లోని అగ్ర నిఘా నాయకులు బ్రిగేడియర్ జనరల్ మొహమ్మద్ కజెమి, డిప్యూటీ హసన్ మొహాకిక్ మరణించారని ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ధృవీకరించారు. ఇరాన్ 100 కి పైగా యుఏవిలను (మానవరహిత వైమానిక వాహనం) పంపింనప్పటికీ ఇజ్రాయెల్ రక్షణ దళాలు దీటుగా అడ్డుకున్నాయని వెల్లడించారు.
ఇరాన్ అణు కార్యకలాపాలను అడ్డుకోవడమే లక్ష్యంగా 'ఆపరేషన్ రైజింగ్ లయన్' పేరిట ఇజ్రాయెల్ దాడులు చేపట్టింది. 2025 జూన్ 13 శుక్రవారం నాడు ఇరాన్ గగనతల రక్షణను, బాలిస్టిక్ క్షిపణి స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎఫ్) భీకర దాడులు చేసింది. ఆ దాడుల్లో ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్‌జీసీ) చీఫ్ మేజర్ జనరల్ హొస్సేన్ సలామీ, సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ మేజర్ జనరల్ మహమ్మద్ బాఘేరి, దేశ క్షిపణి కార్యక్రమ అధిపతి జనరల్ అమీర్‌అలీ హాజీజతో పాటు సుమారు 14 మంది అణుశాస్త్రవేత్తలు కూడా మృతి చెందారు. ఇజ్రాయెల్ దాడులలో మరణించిన తొమ్మిది మంది శాస్త్రవేత్తల జాబితాను ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) విడుదల చేశాయి.
ఇప్పటివరకూ ఇరాన్ వ్యాప్తంగా దాదాపు 250 చోట్ల దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎఫ్) వెల్లడించింది. కాగా, ఇజ్రాయెల్ దాడుల్లో 406 మంది ఇరాన్ పౌరులు మృతి చెందగా.. 654 మందికిపైగా గాయాలపాలయ్యారు. ఇరాన్ రష్యా సాయంతో రహస్యంగా అణు బాంబు తయారు చేస్తోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఆ ప్రక్రియ తుది దశకు చేరుకుందని.. తమ దేశానికి ఇరాన్ అణ్వాయుధాలతో ముప్పు పొంచి ఉండటం వల్లే ఈ దాడులు నిర్వహించినట్లు టెల్ అవీవ్ వాదిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
వాళ్లు రెండుసార్లు ట్రంప్‌ను చంపేందుకు ప్రయత్నించారు: నెతన్యాహు
Mossad Drone Operation: దటీజ్ మొస్సాద్
For International And Telugu News