Student Attack In Flight: విమానంలో విద్యార్థి దాడి.. పలువురికి గాయాలు
ABN , Publish Date - Oct 28 , 2025 | 02:42 PM
బస్సుల్లో, రైళ్లలో సీట్ల కోసం ఒకరికొకరు సర్దుబాటవ్వక గొడవలు పడటం చూస్తుంటాం. కానీ, విమాన ప్రయాణాల్లో అలాంటివి సాధారణంగా కనిపించవు. అయితే అలాంటి ఘటనే ఇటీవల ఒకటి జరిగింది. చికాగో నుంచి జర్మనీకి వెళ్లే విమానంలో ఓ విద్యార్థి చేసిన ఆకస్మిక దాడికి పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.
ఇంటర్నెట్ డెస్క్: బస్సుల్లో, రైళ్లలో లాగా విమానాల్లోనూ తరచూ తగాదాలు జరుగుతుంటాయి. కొందరు మద్యం సేవించి తోటి ప్రయాణికులపై దాడికి పాల్పడుతుంటారు. తాజాగా భారత్ కు చెందిన ఓ విద్యార్థి(Indian student attack) చేసిన రచ్చ కారణంగా పలువురికి గాయాలయ్యాయి. అతడు తోటి ప్రయాణికులపై ఫోర్క్ తో దాడికి దిగాడు. అడ్డుకోబోయిన విమాన సిబ్బందిపైనా ఎదురుదాడికి యత్నించాడు. చికాగో నుంచి జర్మనీ వెళ్లే విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే...
భారత్‌కు చెందిన ఉసిరిపల్లి ప్రణీత్ కుమార్(28) అనే విద్యార్థి.. లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్(Lufthansa Airlines)కు చెందిన చికాగో నుంచి జర్మనీ (Germany)కి వెళ్లే విమానంలో ప్రయాణించాడు. అసలేమైందో తెలియదు గానీ.. అతడు అకస్మాత్తుగా 17ఏళ్ల వయసున్న ఇద్దరిపై ఫోర్క్‌తో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఒకరికి భుజంపై, మరొకరికి తల వెనుక భాగంపై తీవ్ర గాయాలయ్యాయి. అతడ్ని అడ్డుకునేందుకు విమానయాన సిబ్బంది యత్నించగా.. చేతి వేళ్లను తుపాకీగా చూపిస్తూ వారినీ భయభ్రాంతులకు గురిచేశాడు. ఈ క్రమంలోనే అతడు.. మరో మహిళపైనా చెయిచేసుకున్నాడు. ఈ ఘటనతో విమానాన్ని బోస్టన్ లోగాన్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్(Boston emergency landing) చేశారు. అక్కడ ప్రణీత్ ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
శిక్ష పడనుందా?
ఈ ఘటనను యూఎస్ అటార్నీ జనరల్(US authorities) కార్యాలయం ధ్రువీకరించింది. ప్రణీత్.. వీసాపై అమెరికా వచ్చినట్లు అధికారులు గుర్తించారు. మాస్టర్స్ విద్యనభ్యసించేందుకు వచ్చిన అతను.. అగ్రరాజ్యంలో అక్రమంగా తలదాచుకుంటున్నాడని తెలిపారు. అతడిపై నేరం రుజువైతే పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.2 కోట్లకుపైగా జరిమానా విధించే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
గంటకు 12 కి.మీ వేగంతో దూసుకొస్తున్న మొంథా
మొంథా తుపాను.. ఎమ్మెల్యేలకు లోకేష్ ముఖ్య సూచనలు