Share News

American Airlines AA-3023 Fire: విమానం బయలుదేరిన కొద్ది సేపటికే మంటలు..

ABN , Publish Date - Jul 27 , 2025 | 08:37 AM

అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన AA-3023 బోయింగ్ విమానంలో టేకాఫ్ సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అందులో ఉన్న 173 మంది ప్రయాణికులు భయాందోళన చెందారు.

American Airlines AA-3023 Fire: విమానం బయలుదేరిన కొద్ది సేపటికే మంటలు..
American Airlines AA-3023 Fire

డెన్వర్ విమానాశ్రయంలో శనివారం అమెరికన్ ఎయిర్‌లైన్స్‎కు చెందిన ఓ విమానాన్ని టేకాఫ్ సమయంలో వెంటనే నిలిపివేశారు. ల్యాండింగ్ గేర్‌లో సమస్య తలెత్తడంతో రన్‌వేపై ఒక్కసారిగా మంటలు, పొగలు కనిపించాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది చర్యలు చేపట్టారు. విమానంలోని 173 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఆ క్రమంలో ఒక వ్యక్తికి స్వల్ప గాయం అయినట్లు అధికారులు తెలిపారు.


టేకాఫ్ అయిన కొద్దిసేపటికే..

ఈ AA-3023 విమానం బోయింగ్ 737 మాక్స్ 8 మోడల్, మయామికి వేళ్లేందుకు సిద్ధమై టేకాఫ్ అయిన కొద్దిసేపటికే రన్‌వేపై మంటలు వచ్చాయి. ఆ క్రమంలో ల్యాండింగ్ గేర్‌లోని టైర్‌లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు అమెరికన్ ఎయిర్‌లైన్స్ తెలిపింది. రన్‌వేపై విమానం ఆగిపోవడంతో అగ్నిమాపక బృందాలు, విమానాశ్రయ సిబ్బంది వెంటనే స్పందించారు. సాయంత్రం 5:10 గంటలకు మంటలను ఆర్పివేసినట్లు డెన్వర్ ఫైర్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది.


బస్సుల ద్వారా..

అందుకు సంబంధించిన రెస్క్యూ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రయాణికులు భయంతో విమానం నుంచి స్లైడ్‌ల ద్వారా బయటకు రావడం వీడియోలో కనిపిస్తుంది. ఆ తర్వాత ప్రయాణికులను బస్సుల ద్వారా టెర్మినల్‌కు తరలించారు. ఐదుగురు ప్రయాణికులను సంఘటనా స్థలంలో పరీక్షించగా, ఒకరిని గేట్ వద్ద పరీక్షించి ఆసుపత్రికి తరలించారు.


గతంలో కూడా..

అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఈ విమానం టైర్‌లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు తెలిపింది. ఈ విమానాన్ని సర్వీసు నుంచి తప్పించి, మరమ్మతుల కోసం పంపిస్తున్నట్లు వెల్లడించింది. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ఈ ఘటనపై మరింత దర్యాప్తు చేస్తామని వెల్లడించింది. గత ఐదు నెలల్లో డెన్వర్ విమానాశ్రయంలో బోయింగ్ 737-800 విమానంలో మంటలు చెలరేగడం ఇది రెండో సంఘటన. మార్చిలో డల్లాస్‌కు వెళ్లే అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఇలాంటి ఘటనే జరిగింది. ఈ ఘటనలు విమాన భద్రతపై ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి.


ఇవి కూడా చదవండి

ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి

కస్టమర్ల ఖాతాల నుంచి కోట్ల రూపాయల దోపిడీ.. పరారీలో ఎస్‌బీఐ క్లర్క్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 27 , 2025 | 09:00 AM