Russia Earthquake: రష్యాలో భూకంపం వచ్చిన తర్వాత ముంచెత్తిన సునామీ.. డ్రోన్ వీడియో
ABN , Publish Date - Jul 30 , 2025 | 12:23 PM
రష్యాలో 8.8 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపంతో సముద్రాన్ని ఆనుకుని ఉన్న తీర ప్రాంతాల్లో అలజడి రేగింది. సముద్రం ఉవ్వెత్తున ఎగసిపడి భారీ సునామీగా తీరం వైపు దూసుకొచ్చింది. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

రష్యాలో ఫార్ ఈస్ట్రన్ ప్రాంతంలో బుధవారం భారీ భూకంపం (Russia Earthquake) సంభవించడంతో పసిఫిక్ మహాసముద్రాన్ని ఆనుకొని ఉన్న తీరప్రాంతాల్లో భారీ సునామీ వచ్చింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 8.8గా నమోదైంది. ఇది 1952 తర్వాత ఆ ప్రాంతంలో వచ్చిన అత్యంత శక్తివంతమైన భూకంపంగా అధికారులు పేర్కొన్నారు.
సముద్ర జలాలు..
రష్యా అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు చెందిన జియోఫిజికల్ సర్వే విడుదల చేసిన డ్రోన్ వీడియోలలో, సెవెరో-కురిల్స్క్ అనే తీర పట్టణాన్ని సముద్ర జలాలు ముంచిన దృశ్యాలు కనిపించాయి. ఈ పట్టణం కమ్చాట్కా ద్వీపకల్పం సమీపంలో ఉంది. అక్కడ జనాభా దాదాపు 2,000 మంది మాత్రమే ఉన్నారు.
ప్రమాదాన్ని ముందుగానే గుర్తించిన అధికారులు
భూకంపం వచ్చిన వెంటనే, రష్యా అధికారులు అప్రమత్తమై ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సమాచారం ప్రకారం ఈ భూకంప తీవ్రత వల్ల పలువురు గాయపడ్డారు. కానీ ఎవరికీ తీవ్రమైన గాయాలు కాలేదని తెలిసింది.
స్థానిక ప్రజలు ఏమన్నారంటే..
ఈ తీవ్రత వల్ల భవనాల గోడలు వణికాయని, చాలా భయంగా అనిపించిందని స్థానికులు పేర్కొన్నారు. ఆ క్రమంలో వెంటనే బయటకు పరిగెత్తుకుని వచ్చినట్లు ఆ ప్రాంతానికి చెందిన ఓ మహిళ తెలిపారు. కమ్చాట్కా ప్రాంత గవర్నర్ వ్లాడిమిర్ సొలోడోవ్ తీర ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సునామీ హెచ్చరిక కొనసాగుతోందని, ప్రజలు సూచనలను పాటించాలని కోరారు.
సునామీ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా
ఈ భారీ భూకంపం ప్రభావం కేవలం రష్యాలోనే కాదు, పసిఫిక్ మహాసముద్రానికి ఆనుకుని ఉన్న అమెరికా, జపాన్, చైనా, న్యూజిలాండ్ వంటి పలు దేశాల్లో కూడా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అక్కడ కూడా ప్రజలను ముందస్తుగా ఖాళీ చేయించారు. ఇది 2004లో వచ్చిన ఇండోనేషియా సునామీ తరహాలో పెద్ద ఎత్తున ప్రభావం చూపించే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
ఇవి కూడా చదవండి
రష్యాలో భారీ భూకంపం.. జపాన్, అమెరికాలో సునామీ అలర్ట్
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి