Donald Trump: ఆ నగరాన్ని స్వాధీనం చేసుకుంటాం.. ట్రంప్ సంచలన ప్రకటన
ABN , Publish Date - Feb 05 , 2025 | 09:26 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ మధ్య జరిగిన భేటీ తర్వాత ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ క్రమంలో గాజాను స్వాధీనం చేసుకుంటామన్నారు. ఇంకా ఏం చెప్పారనే కీలక విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) గాజా విషయంలో కీలక ప్రకటన చేశారు. ఈ క్రమంలో తాము గాజాని స్వాధీనం చేసుకుంటామన్నారు. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుతో కలిసి వాషింగ్టన్‌లో జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో ఈ మేరకు పేర్కొన్నారు. అమెరికా గాజా స్ట్రిప్‌ను స్వాధీనం చేసుకుని, అభివృద్ధి చేస్తామన్నారు. ఈ క్రమంలో అది మధ్యప్రాచ్యంలో గర్వించదగ్గ ప్రాంతంగా మారుతుందన్నారు.
వేల కొద్ది ఉద్యోగాలు..
ట్రంప్ ఇంకా మాట్లాడుతూ మేము ఆ ప్రాంతంలో ఉన్న ప్రమాదకరమైన ఆయుధాలు, పేలని బాంబులను నాశనం చేయడానికి బాధ్యత వహిస్తామన్నారు. దాన్ని పూర్తిగా పునర్నిర్మించుకోవడం మాకు అవసరమన్నారు. గాజా ప్రాంతం పునర్నిర్మాణం ద్వారా వేల కొద్ది ఉద్యోగాలు సృష్టించబడతాయని, ఇది మధ్యప్రాచ్య ప్రజలందరికీ గర్వకారణం అవుతుందని ఆయన పేర్కొన్నారు. ట్రంప్ ఈ ప్రకటనలో గాజా స్ట్రిప్‌పై అమెరికా ఏ విధమైన నియంత్రణను చేపడుతుంది. ఈ చర్య చట్టపరంగా ఎలాంటి నిర్ణయాలను తీసుకుంటుందనే విషయాలను మాత్రం వెల్లడించలేదు. ఈ విషయంపై సూటిగా స్పందించకుండా ఆయన తన భావాలను వివరించారు.
చర్యలు తీసుకోలేదని..
ఈ క్రమంలో ట్రంప్ జో బైడెన్ విదేశీ వ్యూహాన్ని విమర్శించారు. మధ్యప్రాచ్యంలో నాలుగు సంవత్సరాలు ఏదీ చేయలేదన్నారు. అసమర్థత మాత్రమే చూపించారని ఆరోపించారు. బైడెన్ ప్రభుత్వం మధ్యప్రాచ్యంలో ఉద్ధరణ కోసం సక్రమమైన చర్యలు తీసుకోలేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈసారి ఆయన పాలస్తీనా ప్రజల శాశ్వత పునరావాసాన్ని ప్రస్తావిస్తూ, దశాబ్దాలుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్-పాలస్తీనా సంఘర్షణకు ఒక పరిష్కారంగా రెండు రాష్ట్రాల వ్యవస్థను సమీక్షించాలని అభిప్రాయపడ్డారు.
భద్రత, అభివృద్ధిపై చర్చలు
ట్రంప్ ఇంకా చెప్పినట్లు గాజా స్ట్రిప్‌ను స్వాధీనం చేసుకోవడం మాత్రమే కాకుండా, భద్రతా దృష్టికోణంలో కూడా అభివృద్ధి చేసేందుకు వారికి మరింత సమయం, ఆలోచనలు అవసరమవుతాయన్నారు. ఇది ఇజ్రాయెల్-పాలస్తీనా సంబంధాల్లో శాంతి సాధనలో ఒక ముఖ్యమైన దిశగా మారవచ్చని అన్నారు.
ఇజ్రాయెల్ ప్రధాని ఏమన్నారంటే..
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ (Benjamin Netanyahu) ఈ వ్యాఖ్యలు ట్రంప్ చేసిన తర్వాత స్పందిస్తూ ఈ చర్య చరిత్రను మార్చగలదని నమ్ముతున్నట్లు వెల్లడించారు. ఈ మార్గం అనుసరించడం నిజంగా విలువైనదని అన్నారు. ఆయన గాజా ప్రాంతంలో శాంతి నెలకొల్పడానికి, హమాస్‌ను నిర్మూలించడానికి అమెరికా మార్గదర్శకత్వం సమర్థవంతంగా ఉండగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.
అవకాశాలు, సవాళ్లు
ట్రంప్ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రశ్నలను లేవనెత్తుతుంది. గాజా స్ట్రిప్‌పై అమెరికా యాజమాన్యం ఉంటే, దీని ఫలితంగా ప్రాంతీయ శాంతి సాధనకు దోహదం చేస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఈ క్రమంలో కొత్త సైనిక ఉద్రిక్తతలకు కారణమవుతుందా అనే ప్రశ్నలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. అయితే ట్రంప్ ప్రకటనకు ప్రస్తుత పాలస్తీనియన్లు, ఇజ్రాయెల్ సహా ఇతర అరబ్ దేశాలు ఎలా స్పందిస్తాయో చూడాలి మరి.
ఇవి కూడా చదవండి:
Shooting: పాఠశాలలో కాల్పులు.. 10 మంది మృతి
Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..
RBI Report: దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే.. వీటి వాడకంలో
IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..
Read More Business News and Latest Telugu News