Donald Trump: యుద్ధం నేనే ఆపా!
ABN , Publish Date - Jun 19 , 2025 | 03:01 AM
యుద్ధాన్ని ఆపడంలో భారత్ వైపు ప్రధాని మోదీ, పాకిస్థాన్ వైపు ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ప్రభావవంతంగా వ్యవహరించారని... అయితే యుద్ధాన్ని మాత్రం తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.

భారత్ వైపు ప్రధాని నరేంద్ర మోదీ, పాక్ వైపు ఆర్మీ చీఫ్ మునీర్ సమర్థంగా పనిచేశారు
కాల్పుల విరమణతో అమెరికాకు సంబంధం లేదని ట్రంప్‌కు మోదీ స్పష్టం చేసిన తర్వాత వ్యాఖ్య
పాక్ అభ్యర్థిస్తేనే ఆపరేషన్ ఆపామన్న మోదీ వాణిజ్యం,
మధ్యవర్తిత్వంపై అమెరికాతో చర్చే లేదని వెల్లడి
ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి ఫోన్లో మాటామంతీ
అమెరికాకు రావాలన్న ట్రంప్ ఆహ్వానానికి తిరస్కృతి
షెడ్యూల్ ప్రకారం క్రొయేషియాకు వెళ్లనున్నట్టు వెల్లడి
న్యూఢిల్లీ, జూన్ 18: యుద్ధాన్ని ఆపడంలో భారత్ వైపు ప్రధాని మోదీ, పాకిస్థాన్ వైపు ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ప్రభావవంతంగా వ్యవహరించారని... అయితే యుద్ధాన్ని మాత్రం తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. కాల్పుల విరమణకు అంగీకరిస్తే భారీగా వాణిజ్యం చేస్తామని, లేకుంటే వాణిజ్యం మొత్తంగా నిలిపివేస్తామని తాను చేసిన హెచ్చరికలతోనే భారత్, పాక్ యుద్ధం నిలిపివేశాయని గతంలో ట్రంప్ పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు భారత్ తరఫున మోదీ, పాక్ తరఫున ఆసిమ్ మునీర్ యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నించారంటూ వారికి కొంత క్రెడిట్ ఇచ్చారు. భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంలో అమెరికాకు ఎలాంటి సంబంధం లేదని ట్రంప్‌కు ప్రధాని మోదీ స్పష్టం చేసిన నేపథ్యంలో ట్రంప్ కాస్త వెనక్కి తగ్గినట్టుగా అభిప్రాయం వ్యక్తమవుతోంది. బుధవారం ట్రంప్ అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌజ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘పాకిస్థాన్, భారత్ మధ్య యుద్ధాన్ని నేనే ఆపాను. ఐ లవ్ పాకిస్థాన్. మోదీ ఒక అద్భుత వ్యక్తి. గత రాత్రే నేను ఆయనతో మాట్లాడాను. భారత్‌తో వాణిజ్య ఒప్పందం చేసుకోబోతున్నాం. పాకిస్థాన్ వైపు ఆ దేశ ఆర్మీ చీఫ్, భారత్ వైపు ప్రధాని మోదీ.. యుద్ధాన్ని ఆపడంలో ఇద్దరూ ప్రభావవంతమైన వ్యక్తులు. వారి పని వారు చేశారు. రెండూ అణ్వస్త్ర సామర్థ్యమున్న దేశాలు. వారి మధ్య యుద్ధాన్ని నేను ఆపాను’’ అని వ్యాఖ్యానించారు. తాను చేసిన గొప్పపనిని మీడియా సరిగా పట్టించుకోవడం లేదనే ఉద్దేశాన్ని ట్రంప్ వ్యక్తం చేశారు.
వాణిజ్యం, మధ్యవర్తిత్వంపై చర్చే లేదు
కెనడాలో జరుగుతున్న జీ-7 సదస్సులో పాల్గొంటున్న ప్రధాని మోదీ.. అక్కడ షెడ్యూల్ ప్రకారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఆయన భేటీ కావాల్సి ఉంది. కానీ పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్ అమెరికాకు వెళ్లిపోయారు. అనంతరం మోదీ, ట్రంప్ ఫోన్‌లో మాట్లాడారు. ఈ వివరాలతో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ బుధవారం ఉదయమే ఒక ప్రకటన విడుదల చేశారు. మిస్రీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ట్రంప్‌తో మోదీ 35 నిమిషాల పాటు మాట్లాడారు. పాకిస్థాన్‌తో ఘర్షణ సమయంలో వాణిజ్యం గురించికానీ, మధ్యవర్తిత్వం గురించిగానీ అమెరికా పాలన యంత్రాంగంతో తాను చర్చించలేదని ట్రంప్‌కు ప్రధాని మోదీ స్పష్టం చేశారు. పాకిస్థాన్ అభ్యర్థన మేరకు, తమ ఇరు సైన్యాల మధ్య చర్చల ద్వారా కాల్పుల విరమణ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. భారత్, పాక్ మధ్య మూడోదేశం మధ్యవర్తిత్వాన్ని భారత్ ఇంతవరకు అంగీకరించలేదని, భవిష్యత్తులోనూ అంగీకరించబోదని స్పష్టంచేశారు. ఇక సదస్సును ముగించుకుని అమెరికాకు రావాలన్న ట్రంప్ ఆహ్వానాన్ని మోదీ సున్నితంగా తిరస్కరించారు. షెడ్యూల్ ప్రకారం తాను క్రొయేషియాకు వెళ్లనున్నట్టు తెలిపారు. పహల్గాం ఉగ్రదాడి ఘటన జరిగిన రోజు (ఏప్రిల్ 22న) మోదీకి ట్రంప్ ఫోన్ చేసి విచారం వ్యక్తం చేశారు. ఆ తర్వాత తిరిగి వారు మాట్లాడుకోవడం ఇదే మొదటిసారి. ఆపరేషన్ సిందూర్ సాగినంతకాలం విదేశాంగ మంత్రి జైశంకర్‌తో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్, ఆ దేశ విదేశాంగ శాఖలోని అత్యున్నత అధికారుల బృందం తరచూ మాట్లాడింది. మే 7-9 తేదీల మధ్య మోదీతో జేడీ వాన్స్ ఫోన్‌లో మాట్లాడారని విక్రమ్ మిస్రీ వెల్లడించారు.
వైట్‌హౌస్‌లో మునీర్‌కు ట్రంప్ విందు
వాషింగ్టన్, జూన్ 18: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం పతాక స్థాయిలో ఉన్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌కు వైట్ హౌస్‌లో బుధవారం విందు ఇచ్చారు. యుద్ధంలో ఇరాన్‌కు పాకిస్థాన్ నుంచి ఎలాంటి సాయం అందకుండా చూడటం ప్రధాన లక్ష్యంగా ఆయన ఈ విందు ఏర్పాటు చేసినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. ఇరాన్‌ను ఏకాకిని చేయడం ట్రంప్ వ్యూహమని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో చైనాకు పాకిస్థాన్‌ను దూరం చేసే యోచన కూడా ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు. ఆర్మీ చీఫ్ పదవుల నుంచి పాక్ అధ్యక్షులైన వారికి అమెరికా అధ్యక్షులు గతంలో అనేకసార్లు విందు ఇచ్చారు. అయితే నేరుగా పాక్ ఆర్మీ చీఫ్‌కు వైట్ హౌస్‌లో విందు ఇవ్వడం ఇదే తొలిసారి.