Share News

US Visa Crisis: విద్యార్థి వీసాల రద్దుకు బ్రేకులు

ABN , Publish Date - Apr 25 , 2025 | 05:04 AM

అమెరికాలో 133 మంది విదేశీ విద్యార్థుల సెవిస్‌ రికార్డులను తాత్కాలికంగా పునరుద్ధరించాలని ఫెడరల్‌ కోర్టు ఆదేశించింది. హెచ్‌-1బీ వీసాలపై నూతన మార్పులు, డీఎస్‌-160 ఫారం నిబంధనలతో విద్యార్థులపై కొత్త ఒత్తిళ్లు పెరుగుతున్నాయి

US Visa Crisis: విద్యార్థి వీసాల రద్దుకు బ్రేకులు

  • 133 మంది సెవిస్‌ రికార్డుల పునరుద్ధరణకు కోర్టు ఆదేశం

  • వీరిలో ఎక్కువ మంది భారతీయ విద్యార్థులే

  • హెచ్‌-1బీ వీసాకు చిరునామా, బయోమెట్రిక్‌ తప్పనిసరి

  • రిక్వెస్ట్‌ ఫర్‌ ఎవిడెన్స్‌ కోరుతున్న యూఎ్‌స అధికారులు

వాషింగ్టన్‌/ న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 24: అమెరికాలో స్టూడెంట్‌ వీసాలు రద్దయి ఇబ్బందులు పడుతున్న విదేశీ విద్యార్థులకు న్యాయస్థానం ఊరట కల్పించింది. మొత్తం 133 మంది విద్యార్థుల సెవిస్‌ (స్టూడెంట్‌ అండ్‌ ఎక్స్‌చేంజ్‌ విజిటర్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌) రికార్డులను తాత్కాలికంగా పునరుద్ధరించాలని జార్జియాలోని ఫెడరల్‌ కోర్టు న్యాయమూర్తి ట్రంప్‌ ప్రభుత్వాన్ని ఆదేశించారు. వీరిలో ఎక్కువ మంది భారతీయ విద్యార్థులే ఉన్నారు. అమెరికా విదేశాంగ శాఖ, ఇమిగ్రేషన్‌, కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌(ఐసీఈ) అధికారులు తమ వీసాతో పాటు సెవిస్‌ రికార్డులు రద్దు చేయడంపై వీరు కోర్టులో దావా వేశారు. చట్టాలను ఉల్లంఘించిన ఘటనలతో వీరికి సంబంధం ఉందని ప్రభుత్వ సంస్థలు చెబుతున్నప్పటికీ వీరిలో చాలమందికి ఎలాంటి నేర చరిత్ర లేదు. తీవ్ర నేరాలు చేయకపోయినా విదేశీ విద్యార్థుల వీసాలు. సెవిస్‌ రికార్డులను రద్దు చేయడం అన్యాయమని, ఈ నిర్ణయంతో వారంతా చట్టపరమైన హోదాను కోల్పోయారని ఇమిగ్రేషన్‌ న్యాయవాదులు వాదించారు. కాగా, అమెరికా విదేశాంగ మంత్రి మార్క్‌ రూబియో ‘క్యాచ్‌ అండ్‌ రివోక్‌’ కార్యక్రమం కింద చర్యలకు ఆదేశించిన తర్వాత విద్యార్థి వీసాలు రద్దు చేయడం మొదలైంది. దీనిలో భాగంగా స్టూడెంట్‌ వీసాదారులపై ఏఐ సాయంతో నిఘా పెట్టడంత పాటు వారి సోషల్‌ మీడియా ఖాతాలను అధికారులు జల్లెడ పడుతున్నారు. ఈ కార్యక్రమంలో 300 మందికి పైగా విద్యార్థుల వీసాలు రద్దు చేసినట్లు రూబియో గతంలో ప్రకటించారు.


4,736 మంది సెవిస్‌ రికార్డులు రద్దు

అమెరికన్‌ ఇమిగ్రేషన్‌ లాయర్స్‌ అసోసియేషన్‌(ఏఐఎల్‌ఏ) నివేదిక ప్రకారం.. 2025 జనవరి 20 నుంచి మొత్తం 4,736 మంది సెవిస్‌ రికార్డులను ఐసీఈ రద్దు చేసింది. ఇందులో 327 మందికి సంబంధించిన సమగ్ర నివేదికలు తమకు అందాయని, వారిలో దాదాపు 50శాతం మంది భారత్‌కు చెందిన విద్యార్థులేనని ఏఐఎల్‌ఏ ప్రకటించింది. బాధితుల్లో చైనా, నేపాల్‌, దక్షిణ కొరియా, బంగ్లాదేశ్‌ విద్యార్థులు కూడా ఉన్నారని పేర్కొంది. కాగా, అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థుల్లో చాలామంది ఓపీటీ (ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌)లో ఉన్నారు. ఎఫ్‌-1 వీసాలపై ఉన్న విదేశీ విద్యార్థులు తమ చదువుకు సంబంధించిన రంగాల్లో 12నెలల వరకూ పని చేయడానికి ఓపీటీ ప్రోగ్రామ్‌ అనుమతిస్తుంది. స్టెమ్‌ గ్రాడ్యుయేట్లు ఈ వ్యవధిని మరో 24 నెలలు పొడిగించుకోవడం ద్వారా మూడేళ్ల వరకూ అమెరికాలో ఉండే అవకాశం ఉంది. హెచ్‌-1బీ వీసా కోసం దరఖాస్తు చేసే సమయంలో ఈ పని అనుభవం వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది.


ట్రంప్‌ ప్రభుత్వ నిర్ణయాలతో ఓపీటీ హోదాను కోల్పోవడం వల్ల వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ట్రాఫిక్‌ నిబంధనలు, వర్సిటీ నిబంధనల ఉల్లంఘనల వంటి చిన్న చిన్న కారణాలతో చాలామంది విద్యార్థుల వీసాలు రద్దు చేస్తున్నారని ఏఐఎల్‌ఏ నివేదిక వెల్లడించింది. ఒక విద్యార్థిపై గృహహింస కేసు నమోదవడంతో అతడి వీసా రద్దు చేశారని తెలిపింది. మొత్తం 327 మంది విద్యార్థుల్లో ఇద్దరికి మాత్రమే రాజకీయ కార్యకలాపాలతో సంబంధం ఉన్నట్లు ప్రస్తావించారని పేర్కొంది. ప్రభుత్వ చర్యలను ఇమిగ్రేషన్‌ న్యాయవాదులు ఖండిస్తున్నారు. బాధిత విద్యార్థులకు అమెరికా విదేశాంగ శాఖ, ఐసీఈ జారీ చేసిన లేఖల్లో వీసా రద్దుకు సంబంధించి నిర్దిష్ట నియమ నిబంధనలేమీ లేవని స్పష్టం చేస్తున్నారు. అమెరికాలో నిరసనలు తెలపడం చట్టవిరుద్ధం ఏమీ కాదని, అస్పష్టమైన ఆరోపణల కారణంగా విద్యార్థులు సర్వం కోల్పోవాల్సి వస్తుందని ఓ న్యాయవాది ఆవేదన వ్యక్తం చేశారు.

హెచ్‌-1బీ వీసాల్లో కొత్త చిక్కులు

అమెరికాలో హెచ్‌-1బీ వీసా దరఖాస్తుదారులకు కొత్త చిక్కులు మొదలయ్యాయి. వీసా ముంజూరు కోసం అభ్యర్థుల ఇంటి చిరునామా, బయోమెట్రిక్‌ డేటాను అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం (యూఎ్‌ససీఐఎస్‌) అధికారులు కోరుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఫోర్బ్స్‌ నివేదిక ప్రకారం.. హెచ్‌-1బీ వీసా కేసుల్లో ఇమిగ్రేషన్‌ అధికారులు రిక్వెస్ట్‌ ఫర్‌ ఎవిడెన్స్‌ (ఆర్‌ఎ్‌ఫఈ)ను కోరుతున్నారు. దీనిలో భాగంగాదరఖాస్తుదారులు వారి ఇంటి చిరునామా, బయోమెట్రిక్‌ డేటాతో పాటు వ్యక్తిగత సమాచారం కూడా సమర్పించాల్సి ఉంటుంది. అయితే దీని వెనుక యూఎస్‌సీఐఎస్‌ ఉద్దేశం ఏమిటనే సందేహాలను ఇమిగ్రేషన్‌ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.


డీఎస్‌-160 ఫాం సమర్పిస్తేనే వీసా ఇంటర్వ్యూ

అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసేవారు ఇకపై ఇంటర్వ్యూ స్లాట్‌ బుక్‌ చేసుకోవడానికి ముందే డీఎస్‌-160 ఫాంను సమర్పించాలి. ఈ మేరకు ఆన్‌లైన్‌ ఫాం, షెడ్యూల్‌ ప్రక్రియలో అమెరికా విదేశాంగ శాఖ మార్పులు చేసింది. పలు దేశాల్లోని అమెరికా రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లలో ఈ నిబంధన అమలులోకి వచ్చింది. ఏప్రిల్‌ 1 తర్వాత వీసా ఇంటర్వ్యూకు హాజరయ్యే వారందరికీ ఇది వర్తిస్తుంది. దీని ప్రకారం దరఖాస్తుదారులు ధ్రువీకరించిన డీఎస్‌-160 ఫాం గానీ ‘ఏఏ’తో ప్రారంభమయ్యే బార్‌కోడ్‌ నంబరును గానీ ఇంటర్వ్యూకు తీసుకురావాల్సి ఉంటుంది. అమెరికాలోకి తాత్కాలిక ప్రవేశానికి వీసా కోసం దరఖాస్తు చేసుకొనే వారందరూ డీఎస్‌-160 ఆన్‌లైన్‌ నాన్‌-ఇమిగ్రెంట్‌ వీసా దరఖాస్తు పూర్తి చేయాల్సి ఉంటుంది. కొత్త నిబంధన ప్రకారం అపాయింట్‌మెంట్‌ షెడ్యూల్‌ చేయడానికి ముందే ఈ ఫాంను నింపి, సబ్మిట్‌ చేయాలి. దీనిద్వారా దరఖాస్తుదారులకు సంబంధించిన కచ్చితమైన, సమగ్ర సమాచారం కాన్సులర్‌ అధికారులకు అందుబాటులో ఉంటుందని విదేశాంగ శాఖ పేర్కొంది. బీ1/బీ2, హెచ్‌-1బీ, ఎఫ్‌-1, జే-1 తదితర వీసా కేటగిరీలకు కొత్త డీఎస్‌-160 ఫాం నిబంధనలు వర్తిస్తాయి.


ఇవి కూడా చదవండి

Pahalgam Terror Attack: పాకిస్తానీలు 48 గంటల్లో ఇండియా వదలి వెళ్లాలని కేంద్ర ఆదేశం..

Fauji Actress Imanvi: పుకార్లపై స్పందించిన ప్రభాస్ హీరోయిన్

Updated Date - Apr 25 , 2025 | 05:04 AM