China: పిల్లలను కనండి.. ప్రతి ఏటా రూ.42 వేలు ఇస్తాం..
ABN , Publish Date - Jul 04 , 2025 | 04:25 PM
China New Birthrate Incentives: వరసగా మూడో ఏడాది జననరేటు భారీగా పడిపోవడంతో చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సంవత్సరం జనవరి1 లేదా ఆ తర్వాత జన్మించిన ప్రతి బిడ్డకు మూడు సంవత్సరాలు నిండే వరకూ ఏడాదికి 3,600 యువాన్లు (రూ.42,000) ఇస్తామని ప్రకటించింది.

China New Population Policy 2025: చైనా జనాభా ఏటికేడు వేగంగా క్షీణిస్తోంది. గత మూడేళ్లలో జననాల రేటు భారీగా పడిపోయింది. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనాకు ఇది సంకట పరిస్థితే. నెంబర్‌వన్ ఆర్థికవ్యవస్థ లక్ష్యానికి జనాభారేటు తగ్గుదల అడ్డుగా నిలుస్తుండటంతో బీజింగ్ పెద్దల్లో కలవరం మొదలైంది. దశాబ్దం కిందటే 'ఒకే బిడ్డ' నియమానికి స్వస్తి పలికినప్పటికీ పరిస్థితుల్లో మార్పు కనిపించడంలేదు. దేశంలో యువత కంటే వృద్ధుల సంఖ్య భారీగా ఉండటంతో ఆ దేశ ఎకానమీ భవిష్యత్తులో తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యే అవకాశముంది. దీంతో జనాభా సంఖ్యను పెంచే దిశగా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది డ్రాగన్. ప్రజలు పిల్లల్ని కనేలా ప్రోత్సహించేందుకు భారీ తాయిలాలు అందిస్తోంది. తాజాగా, ఈ సంవత్సరం జనవరి 1 లేదా ఆ తర్వాత జన్మించిన ప్రతి బిడ్డకు మూడు సంవత్సరాలు నిండే వరకూ ఏడాదికి 3,600 యువాన్లు (రూ.42,000) ఇస్తామని ప్రకటించింది.
ఒక్కో బిడ్డకు ఏడాదికి రూ.42వేలు..
ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఉన్న చైనాకు స్థిరంగా జనాభా తగ్గిపోతుండటం అతిపెద్ద సవాలుగా మారింది. 2016లో 8.8 మిలియన్ల కొత్త జననాలు నమోదవగా.. 2024లో నవజాత శిశువుల సంఖ్య 9.54 మిలియన్లకు తగ్గింది. SCMP ప్రకారం, జనాభా లెక్కల నిపుణుడు హువాంగ్ వెన్జెంగ్ మాట్లాడుతూ, ' చైనాలో ఇలాగే స్థిరంగా జనాభా తగ్గుతూ పోతే భవిష్యత్తులో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకురారు. వ్యాపారులు ఇన్వెస్టుమెంట్లు చేయడం నిలిపివేస్తే ఆటోమేటిగ్గా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయి'. 2023లోనే ప్రపంచంలో అత్యధిక జనాభా హోదా కోల్పోయిన చైనా ఈ పరిస్థితి రాకుండా ఉండేందుకు తీవ్ర కసరత్తులు చేస్తోంది. అందులో భాగంగానే 2016 లోనే ఒకే బిడ్డ విధానానికి ముగింపు పలికింది.
చైనా ప్రభుత్వం జననాల రేటు పెరిగేలా ప్రోత్సహిస్తున్నప్పటికీ.. ఆ దేశ ప్రజలు పిల్లల్ని కనేందుకు విముఖత చూపుతున్నారు. జీవనవ్యయం భారీగా పెరగడం, ఆదాయం అతితక్కువగా ఉండటంతో యువత పెళ్లి చేసుకునేందుకు అనాసక్తి చూపుతున్నారు. ఇదివరకే పెళ్లైన జంటలు పిల్లల్ని కనాలంటేనే భయపడుతున్నారు. గత 50 సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా చైనాలో వివాహ రేట్లు అత్యల్ప స్థాయికి పడిపోవడమే ఇందుకు నిదర్శనం. స్థానికంగా ప్రభుత్వ అధికారులు రెండో బిడ్డ కనేవారికి 50,000 యువాన్లు(సుమారు రూ.5,96,000), మూడో బిడ్డకు 100,000(సుమారు రూ.11,92,000) యువాన్లు చెల్లిస్తున్నప్పటికీ పరిస్థితుల్లో మార్పులు కనిపించకపోవడంతో డ్రాగన్ తాజాగా కొత్త స్కీం ప్రవేశపెట్టింది.
ఇవి కూడా చదవండి:
ఆకాశ్ మిసైల్ కొనుగోలుకు బ్రెజిల్ ఆసక్తి
ఎఫ్-35 జెట్‌ను స్వదేశానికి తరలించనున్న బ్రిటన్.. చిన్న భాగాలుగా విడగొట్టి..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి