Share News

No Tobacco Day 2025: నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం..

ABN , Publish Date - May 31 , 2025 | 10:16 AM

World No Tobacco Day 2025: ఆరోగ్యాన్ని మింగేసే పొగాకు వాడకాన్ని అంతం చేయడమే లక్ష్యంగా ఏటా మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటారు. పొగాకు ఉత్పత్తులు సేవించడం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు తెలియజేయాలనే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.

No Tobacco Day 2025: నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం..
World No Tobacco Day 2025

World No Tobacco Day Theme 2025: ప్రతి సంవత్సరం మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటారు. పొగాకు వాడకం వల్ల కలిగే ప్రమాదాలు, పొగాకు కంపెనీల వ్యాపార పద్ధతులు, ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆరోగ్యం, ఆరోగ్యకరమైన జీవన హక్కును పొగాకు ఎలా హరిస్తోంది.. భవిష్యత్తు తరాలను పొగాకు నుంచి రక్షించడానికి ఏమి చేయాలో అవగాహన పెంచడమే ఈ దినోత్సవ లక్ష్యం. 1987 నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) పొగకు రహిత ప్రపంచం కోసం ప్రజల్లో అవగాహన పెంచేందుకు కృషి చేస్తోంది.


ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 13-15 సంవత్సరాల వయస్సు గల 37 మిలియన్ల మంది టీనేజర్లు పొగాకు ఉత్పత్తులకు బానిసలవుతున్నారు. కేవలం బాల్యాన్నే కాదు. పెద్దల ఆరోగ్యాన్ని పొగాకు ఉత్పత్తులు నాశనం చేస్తున్నాయి. పొగాకులో క్యాన్సర్ కు కారణమయ్యే పదార్థాలు దాదాపు 70 వరకూ ఉంటాయి. ప్రజల ప్రాణాలను పొగాకు పీల్చేయకూడదంటే దీని గురించి తెల్సుకోవడమే కాదు. ఇతరుల్లోనూ అవగాహన పెంచేందుకు కృషి చేయడం అవసరం. ఎందుకంటే పొగాకు సేవించేవారి వల్ల వారితో కలిసి జీవించే వారి ప్రాణాలూ ప్రమాదంలో పడతాయి.


ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ తేదీ, థీమ్

ప్రతి సంవత్సరం మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటారు. WHO ప్రకారం ఈ సంవత్సరం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం థీమ్ 'ప్రకాశవంతమైన ఉత్పత్తులు. చీకటి ఉద్దేశాలు. ఆకర్షణను బయటపెట్టడం(Bright products. Dark intentions. Unmasking the Appeal)'. ఆకర్షణీయమైన రుచులు, ప్యాకింగ్‌లలో వచ్చే పొగాకు ఉత్పత్తుల వెనక దాగి ఉన్న ప్రమాదాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడమే ఈ ఏడాది థీమ్.


పరిశ్రమలు స్వలాభం కోసం పిల్లలను నిస్సిగ్గుగా మోసం చేస్తున్నాయి. పొగాకు, నికోటిన్ పరిశ్రమలు కొత్త తరం కస్టమర్లను ఆకర్షించడానికి, ఇదివరకే పొగాకు సేవించేవారిని మరింత ఆకట్టుకోవడానికి అనేక ఆకర్షణీయమైన ఉత్పత్తులను, మోసపూరిత వ్యూహాలను అనుసరిస్తున్నాయి. అందువల్లే ఈ మధ్య పొగాకు కారణంగా నవయవ్వనంలోనే క్యాన్సర్, తీవ్రశ్వాసకోస వ్యాధులు ప్రజలను కాటేస్తున్నాయి. ఈ దుష్పరిణామాల నుంచి తప్పించుకోవాలంటే పొగాకు సేవనం మానేయడంతో పాటు ఇతరుల్లోనూ అవగాహన పెంచేందుకు కృషి చేయడం అవసరం.


చరిత్ర, ప్రాముఖ్యత

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని 1987లో ప్రారంభించింది. పొగాకు వాడకం వల్ల కలిగే హానికరమైన ప్రభావాల గురించి అవగాహన పెంచడం, పొగాకు వినియోగాన్ని తగ్గించే విధానాల కోసం కృషి చేయడం ఈ దినోత్సవ లక్ష్యం. అధికారిక దినోత్సవం తొలిసారి 1988లో జరిగింది.


ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలకు కారణమవుతున్న వాటిలో పొగాకు వాడకం కూడా ఒకటి. ఏటా 8 మిలియన్లకు పైగా మరణాలకు పొగాకు ఉత్పత్తులే మూల కారణంగా ఉన్నాయి. అందుకే ప్రతి ఏడాది మే 31న ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, సామాజికవేత్తలు పొగాకు వాడకాన్ని అరికట్టేందుకు అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నారు. పొగాకు సేవనం వల్ల ఆరోగ్యపరంగా, ఆర్థికంగా ఎలా నష్టపోతారో కూలంకషంగా వివరిస్తున్నారు. భవిష్యత్ తరాలను పొగాకు ఉత్పత్తుల నుంచి రక్షించేందుకు కృషి చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

ప్రతి మహిళ తప్పక చేయించుకోవాల్సిన 8 ఆరోగ్య పరీక్షలు..

భారతీయుల 'ఎనర్జీ డ్రింక్' ఇదే! కొత్త అధ్యయనంలో ఆసక్తికర విషయాలు

Read Latest and Health News

Updated Date - May 31 , 2025 | 11:02 AM