Liver Health Alert: కాలేయంలో కలకలం
ABN , Publish Date - Apr 19 , 2025 | 04:44 AM
కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే జీవనశైలి మార్పులు, మంచి ఆహారం అనివార్యం. హెపటైటిస్, మద్యపానం, ఊబకాయం లాంటి వాటి వల్ల లివర్ వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి

నేడు ప్రపంచ కాలేయ దినోత్సవం
లివరే కదాని లైట్ తీసుకోవద్దు
తెలియకుండానే కబళించే లివర్ వ్యాధులు
సమస్యేమిటో గుర్తించే సరికే ప్రాణాపాయ స్థితి
అధిక కొవ్వు, రసాయనాలున్న ఆహారం, మద్యం.. ఊబకాయం, హెపటైటిస్ తదితరాలే కారణం
ముందుగా గుర్తిస్తేనే రక్షణ సాధ్యం
శరీరంలోని అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం ఒకటి. అది ఏమాత్రం దెబ్బతిన్నా సమస్యలు తప్పవు. కానీ కొన్నేళ్లుగా కాలేయ వ్యాధుల బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. కాలేయ క్యాన్సర్లు నిశ్శబ్దంగా కబళిస్తున్నాయి. సమ స్య ఏమిటో గుర్తించే సరికే ప్రాణాలకే ముప్పుగా మారుతున్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కాలేయ సమస్యలను నివారించవచ్చునని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే, అసలు కాలేయ వ్యాధులు రాకుండా చూసుకోవడానికి మనం తీసుకునే ఆహారమే దివ్య ఔషధమని పేర్కొంటున్నారు. హెపటైటిస్-బీ, విపరీతంగా మద్యం అలవాటు, అధిక కొవ్వు ఉండే ఆహారం తీసుకోవడం, ఊబకాయంతో ఏర్పడే ఫ్యాటీ లివర్, కొన్ని రకాల మందుల దుష్ప్రభావాలు వంటివి కాలేయ సమస్యలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా 42 ఏళ్లు దాటిన వారిలో కాలేయ సమస్యలు పెరిగిపోతున్నట్టు చెబుతున్నారు.
ఎలా గుర్తించవచ్చు: ఆకలి తగ్గిపోవడం, కడుపు నొప్పి, రక్తపు వాంతులు, కామెర్లు, మల విసర్జనలో రక్తం పడటం, బరువు తగ్గిపోతుండటం, తరచూ జ్వరం, ముఖం, కాళ్ల వాపు వంటివి కాలేయ సమస్యలకు లక్షణాలని వైద్యు లు చెబుతున్నారు. ఆల్కాహాల్ అలవాటును వదులుకోవడం, బరువును నియంత్రించుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
కాలేయం భద్రం: మంత్రి సత్యకుమార్
ఆధునిక జీవన విధానంలో కాలేయ వ్యాధుల్ని అరికట్టడానికి సరైన ఆహారం, జీవన అలవాట్లను అనుసరించాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ పిలుపునిచ్చారు. ప్రపంచ కాలేయ దినోత్సవం సందర్భంగా పోషకాలతో కూడిన ఆహారం ద్వారా కాలేయ వ్యాధుల్ని అరికట్టే దిశగా ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. 38 శాతం ప్రజలు ఫ్యాటీ లివర్ సమస్యను ఎదుర్కోవడం పట్ల మంత్రి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
దానం చేయొచ్చు!
కాలేయ వ్యాధిగ్రస్తులకు లివర్ మార్పిడి చికిత్సతో మంచి జీవితాన్ని అందించవచ్చునని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో కాలేయం కొంత భాగాన్ని కోసి తీసినా.. తిరిగి పెరుగుతుంది. అందువల్ల కాలేయ దానం చేసినవారు కొన్ని రోజుల్లోనే సాధారణ జీవనం గడపవచ్చని వైద్యులు చెబుతున్నారు. కానీ, అవగాహన లేకపోవడంతో ఎవరూ పెద్దగా ముందుకు రావడం లేదని అంటున్నారు.
- హైదరాబాద్ సిటీ, ఆంధ్రజ్యోతి
కాలేయమే కర్త!
నేడు కాలేయ దినోత్సవం
ప్రతి ఏటా ఏప్రిల్ 19న ప్రపంచకాలేయ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. మానవ శరీరంలో కాలేయ ప్రాధాన్యం, దానిని కాపాడుకునే విధానం వంటి కీలక విషయాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ సంవత్సరం.. ‘ఆహారమే ఔషధం’ ఇతివృత్తంతో ప్రపంచ కాలేయ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. తీసుకునే ఆహారంలో స్వల్ప మార్పుల ద్వారా కాలేయాన్ని కాపాడుకోవచ్చన్న సందేశాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంటోంది.
మనిషి శరీరంలో అనేక అంగాలు ఉన్నప్పటికీ.. కాలేయమే ఈ శరీరాన్ని నడిపించే కర్త!. మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలోను, జీర్ణమైన ఆహారాన్ని రక్తం రూపంలో జీవక్రియలకు అందించడంలోనూ కాలేయమే కీలకం. అంతేకాదు.. శరీరంలోని వివిధ అంగాలు నిర్వర్తించే కార్యక్రమాలకు బాధ్యత వహించే కీలకమైన అవయవం. రక్తా న్ని ఫిల్టర్ చేయడంలోను, రసాయన స్థాయిలను నియంత్రించడంలోను, విటమిన్లు, ఖనిజాలు మూత్రం ద్వారా బయటకు వెళ్లకుండా నిల్వచేయడంలోనూ కాలేయమే ముఖ్య భూమిక పోషిస్తుంది. మరీ ముఖ్యంగా ఇన్‌ఫెక్షన్లు సోకినప్పుడు సమర్ధవంతంగా పోరాడే శక్తి ని కూడా శరీరానికి అందించేది కాలేయమే. అందుకే మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే కాలేయ ఆరోగ్యం అత్యంత ప్రధానమని వైద్యులు చెబుతున్నారు.
ఈ జాగ్రత్తలు తీసుకుంటే...
అనారోగ్యకర జీవనశైలి, ఇతర సమస్యలతో కాలేయ క్యాన్సర్లు పెరిగిపోతున్నాయి. కొన్ని జాగ్రత్తలు పాటించటం ద్వారా కాలేయ క్యాన్సర్ల బారినపడకుండా తప్పించుకోవచ్చు. ప్రాసెస్డ్ ఆహారం, కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలు, కృత్రిమ రంగులు కలిగిన పానీయాలకు దూరంగా ఉండాలి. తాజా ఆహారం, తక్కువ కొవ్వు, ఫైబర్ అధికంగా ఉన్న పదార్థాలను తీసుకోవాలి. బీ, సీ, ఈ విటమిన్లు సమృద్ధిగా ఉన్న ఆహారం కాలేయాన్ని రక్షించడానికి దోహదపడుతుంది. నీరు సమృద్ధిగా తాగాలి. హెపటైటిస్ వైరస్ నుంచి కాపాడుకోవటానికి వాక్సినేషన్ చేయించుకోవాలి. మద్యపానం మానాలి. తగినంత శారీరక శ్రమ ఉండాలి. వ్యాయామం చేయాలి. బరువును అదుపులో ఉంచుకోవాలి.
- డాక్టర్ నయీమ్, క్లినికల్ డైరెక్టర్,
కేర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైజెస్టివ్ డిసీజెస్